లక్షెట్టిపేట సీడీపీవోకు షోకాజ్ నోటీసు

-చెన్నూర్ సి.డి.పి.ఓ. మనోరమపై ఆగ్రహం
-విధుల పట్ల అలసత్వం,నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
-మంచిర్యాల జిల్లా క‌లెక్ట‌ర్ భార‌తి హోళీకేరీ

మంచిర్యాల : క‌లెక్ట‌రేట్‌లో నిర్వ‌హించిన సమావేశానికి సరైన వివరణ లేకుండా గైర్హాజరైన లక్షెట్టిపేట సి.డి.పి.ఓ. రేష్మాకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని క‌లెక్ట‌ర్ భార‌తి హోళీకేరీ జిల్లా సంక్షేమాధికారి మాస ఉమాదేవిని ఆదేశించారు. బుధవారం కలెక్టర్ చాంబర్లో పోషన్ పక్వాడా, గిరి పోషణ, పోషన్ అభయాన్, ఇతర సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చెన్నూర్ పరిధిలోని మండలాలలో అంగన్వాడీ సిబ్బంది సమయపాలన పాటించకపోవడం, సకాలంలో అంగన్వాడీ కేంద్రం తెరువకపోవడం, స్థానికంగా ఉ ండకపోవడం వలన ఇబ్బందులు తలెత్తుతున్నాయని, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో అధికారులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంపై చెన్నూర్ సి.డి.పి.ఓ. మనోరమపై ఆగ్రహం వ్య‌క్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాల పరిధిలో గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, పిల్లలకు సరైన సమయానికి పోషకాహారం అందించాలని, మంచిర్యాలను రక్తహీనత లోపం లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు సంబంధిత అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని తెలిపారు.

ప్రభుత్వ అధికారులు, సిబ్బంది వారికి కేటాయించిన విధులలో సమయపాలన తప్పనిసరిగా పాటించడంతో పాటు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాల‌న్నారు. పాఠశాలలు, కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాల పిల్లలకు పౌష్టికాహారాన్ని సకాలంలో అందించాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో పోషణ్ పక్వాడా కార్యక్రమంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టిన ప్రజలలో చైతన్యం కల్పించాలని తెలిపారు. అప్పుడే పుట్టిన శిశు వుకు ముర్రుపాలు ఎంతో శ్రేయస్కరమని, పసిపిల్లలకు తల్లిపాల ఆవశ్యకతపై విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు. పోషన్ అభయాన్లో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ క్రమంలో గర్భిణులకు, ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాలో 969 మంది అంగన్వాడీ టీచర్లు ఉన్నారని, ఆ అంగన్వాడీ కేంద్రాలను ప్రతి రోజు సమయపాలన పాటిస్తూ తెరువాలని, హాజరు కోసం ఏర్పాటు చేసిన సెల్ఫీయాప్లో క్రమంగా తప్పకుండా సమయం, ఫొటో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. వారికి కేటాయించిన విధుల పట్ల అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి ఉమాదేవి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రి, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, జిల్లా గిరిజన సంక్షేమాధికారి జనార్ధన్, షెడ్యూల్డ్ కులాల సంక్షేమశాఖ ఉప సంచాలకులు రవీందర్రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like