మా టీచర్ కొడుతుండు

పోలీస్ స్టేషన్ లో రెండో తరగతి విద్యార్థి ఫిర్యాదు

బయ్యారం: సాధారణంగా పిల్లలను వారి స్నేహితులు కొడితే? తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఆటలో అరటిపండులే అని అనుకుంటూ సర్దుకుపోతారు. అదే ఉపాధ్యాయులు కొడితే తప్పు చేశామేమో అనుకుని మిన్నకుండి పోతారు. దెబ్బ కాస్త గట్టిగా తగిలితే కాసేపు ఏడ్చి ఆ తర్వాత ఊరుకుంటారు. గోలను తట్టుకోలేక ఉపాధ్యాయులు గద్దిస్తే బాధను దిగమింగుకుని మౌనంగా రోదిస్తారు. ఇందంతా క్లాస్ రూం వరకే పరిమితం అవుతుంది. స్కూల్ వదిలిన తర్వాత ఆ విషయాన్నే మరిచిపోతారు. ఇదంతా మామూలుగా జరిగిపోయే ముచ్చటే. అయితే ఇప్పుడు కాలం మారిపోయింది. పిల్లలు మితిమీరి పోతున్నారు. కొన్ని సందర్భాల్లో పిల్లల చేష్టలు ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. కాలంతో పాటుగా పిల్లల ఆలోచన విధానంలో కూడా మార్పు వస్తోంది. తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నారు.

మహబూబాబాద్‌ జిల్లా బయ్యారంలోని ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్లపై ఏడేళ్ల బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలంటే కొందరు ఆలోచిస్తారు. మరికొందరికి ధైర్యమే చాలదు. అనిల్ అనే విద్యార్థి మాత్రం అదురూ బెదురూ లేకుండా టీచర్లపై ఫిర్యాదు చేశాడు. బుడతడు ఫిర్యాదు చేయడమే ఆలస్యం.. వెంటనే పోలీసులు విచారణ ప్రారంభించారు. బయ్యారంలోని నిర్మల ప్రైవేట్ స్కూల్‌లో అనిల్ అనే విద్యార్థి రెండో తరగతి చదువుతున్నాడు. ఏ కారణం లేకుండానే సన్నీ, వెంకట్ అనే టీచర్లు తనను కొట్టారంటూ అనిల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను కొట్టిన టీచర్లపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్‌ఐ రమాదేవికి ఫిర్యాదు చేశాడు. అయితే బాలుడి ధైర్యాన్ని పోలీసులు మెచ్చుకున్నారు. స్కూల్‌కు వెళ్లి ఉపాధ్యాయులను పోలీసులు ప్రశ్నించారు. బాలుడిని శాంతింపజేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like