మంచిర్యాల ఆసుప‌త్రుల్లో మ‌ర‌ణ‌మృదంగం

మంచిర్యాల:మంచిర్యాల జిల్లా కేంద్రంలో మ‌ర‌ణ మృదంగం మోగుతోంది. ప్రైవేటు ఆసుప‌త్రుల్లో వ‌రుస మ‌ర‌ణాలు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. కొద్ది రోజులుగా ఆసుప‌త్రుల్లో జ‌రుగుతున్న మ‌ర‌ణాల ప‌ట్ల ప‌లువురు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఓ యువ‌కుడు మ‌ర‌ణించాడు. చెన్న వెంకటేష్ లోట‌స్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతుండ‌గా చ‌నిపోయాడ‌ని, వైద్యుల నిర్లక్ష్యంతోనే మ‌ర‌ణించాడ‌ని కుటుంబ సభ్యుల ఆరోపించారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి ముందు ఆందోళన నిర్వ‌హించారు. అది మ‌రువ‌క ముందే మ‌హాల‌క్ష్మి ఆసుప‌త్రిలో ఓ చిన్నారి మృతి చెందింద‌ని ఆ బాబు తండ్రి సీఐ న‌రేంద‌ర్ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు.

రామ‌గుండం క‌మిష‌న‌రేట్‌లో విధులు నిర్వ‌హిస్తున్న న‌రేంద‌ర్ దంప‌తుల‌కు ఏడు రోజుల కింద‌ట ఓ ప్రైవేటు ద‌వాఖానలో బాబు పుట్టాడు. ఏడు నెల‌ల‌కే డెలివ‌రీ కావ‌డంతో బాబు ప‌రిస్థితి బాలేద‌ని అక్క‌డి వైద్యులు తెలిపారు. దీంతో చిన్నారిని మ‌హాల‌క్ష్మి పిల్ల‌ల ద‌వాఖాన‌కు తీసుకువెళ్లారు. ప‌సికందును ప‌రీక్షించిన వైద్యుడు డాక్ట‌ర్ కుమార్‌వ‌ర్మ ద‌వాఖాన‌లో అడ్మిట్ చేసుకుని ఏడు రోజుల పాటు చికిత్స అందించారు. ఆదివారం ఉద‌యం బాబు ఆరోగ్యం విష‌మించింద‌ని ప్ర‌త్యేక ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని క‌రీంన‌గ‌ర్‌కు రిఫ‌ర్ చేశారు. అక్క‌డికి వెళ్లి అడ్మిట్ అయిన సాయంత్రంలోపు బాబు మృతి చెందాడు. వైద్యుల నిర్ల‌క్ష్యం వ‌ల్లే బాబు మ‌ర‌ణించాడ‌ని ఆసుప‌త్రికి వెళ్లారు. ఆ త‌ర్వాత పోలీస్‌స్టేష‌న్ వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ విష‌యంలో ఆసుప‌త్రి వైద్యుడు కుమార్‌వ‌ర్మ మాట్లాడుతూ బాబు ఏడు నెల‌ల్లో పుట్ట‌డంతో ఊప‌రితిత్తులు స‌రిగ్గా లేవ‌ని తెలిపారు. అయినా ఏడు రోజుల పాటు వెంటిలేట‌ర్‌పై చికిత్స అందించామ‌న్నారు. వారు వ‌చ్చిన స‌మ‌యంలో తాము అడ్మిట్ చేసుకోక‌పోతే ప‌రిస్థితి మ‌రోలా ఉండేద‌ని చెప‌పారు. బాబుకు కార్డియాల‌జీ, టూడీఈకో, న్యూరోసానోగ్రాం ప‌రీక్ష‌ల కోసం క‌రీంన‌గ‌ర్ త‌ర‌లించామ‌న్నారు.

నా పాప‌ను సైతం పోగొట్టుకున్నా..
కొద్ది రోజుల కింద‌ట త‌న పాపను సైతం పోగొట్టుకున్నాన‌ని న‌రేష్ అనే వ్య‌క్తి విలేక‌రుల ముందు వాపోయారు. జైపూర్ ప‌వ‌ర్‌ప్లాంట్‌లో ప‌నిచేస్తున్న న‌రేష్ అనే వ్య‌క్తి ఈ నెల 10న ప‌సికందును ద‌వాఖాన‌కు తీసుకువ‌చ్చాడు. ఆ పాప‌కు కూడా ఏడు రోజుల పాటు చికిత్స అందించిన త‌ర్వాత ఈ నెల 17న పాప మృతి చెందిన‌ట్లు డాక్ట‌ర్లు చెప్పార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. సోమ‌వారం ప‌నుల నిమిత్తం ఆసుప‌త్రికి వ‌చ్చిన న‌రేష్ అక్క‌డ గొడ‌వ జ‌రుగుతున్న విష‌యం గ‌మ‌నించి త‌న‌కు కూడా అన్యాయం జ‌రిగింద‌ని విలేక‌రుల ముందు వాపోయాడు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like