మంచిర్యాల సీటు బీసీల‌కేనా..?

-క‌స‌ర‌త్తు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ
-ఇప్ప‌టికే ఒక‌సారి స‌ర్వే చేసిన అధిష్టానం
-తాజాగా మ‌రోసారి స‌ర్వే చేయించిన పార్టీ అధినేత‌
-ఆరుగురి పేర్లు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని కొన‌సాగిన స‌ర్వే
-పూర్తిగా మార‌నున్న నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయ స్వ‌రూపం

Manchryala seat is for BCs: మంచిర్యాల నియోజ‌క‌వ‌ర్గ స్వ‌రూపం పూర్తిగా మారనుందా..? ఇప్ప‌టి వ‌ర‌కు రెడ్డి, వెల‌మ సామాజిక వ‌ర్గాల‌కు సీట్లిచ్చిన పార్టీలు రూటు మార్చానున్నాయా..? బీఆర్ఎస్ పార్టీ ఇక్క‌డ బీసీల‌కు టిక్కెట్టు ఇచ్చి గంప‌గుత్త‌గా వారి ఓట్లు కొల్ల‌గొట్టాల‌ని భావిస్తోందా…? అవుననే అంటున్నారు.. రాజ‌కీయ ప‌రిశీల‌కులు..

మంచిర్యాల నియోజ‌క‌వ‌ర్గం సీటు ఈసారి బీసీల‌కు ఇచ్చేందుకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ పావులు క‌దుపుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యంలో ఇప్ప‌టికే ఓమారు నియోజ‌క‌వ‌ర్గంలో స‌ర్వే చేయించిన అధిష్టానం తాజాగా మ‌రోమారు స‌ర్వే చేయించిన‌ట్లు స‌మాచారం. ఇందులో ఎమ్మెల్యేగా ఎవ‌రెవ‌రు ప‌నిచేయ‌గ‌ల‌రు..? ఆయా వ్య‌క్తుల గ‌త చ‌రిత్ర‌..? ప్ర‌స్తుతం వారి ప‌నితీరు…? పార్టీలో వారి పాత్ర‌..? ఇలా అన్ని ర‌కాలుగా ఆరా తీసిన‌ట్లు స‌మాచారం. ముఖ్యంగా ఇందులో అభ్య‌ర్థుల సామాజిక వ‌ర్గాన్ని ప‌రిగ‌ణలోకి తీసుకుని వారి గురించి పూర్తి స్థాయి స‌మాచారం సేక‌రించింది.

ఆరుగురు రాజకీయ‌నాయ‌కులు, న‌లుగురు త‌ట‌స్థుల పేర్లు ప‌రిగ‌ణిలోకి తీసుకున్నారు. ఇందులో ప్ర‌స్తుత వ్య‌వ‌సాయ మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ ప‌ల్లె భూమేష్ ఉన్నారు. ఆయ‌న విద్యాసంస్థ‌ల అధినేతగా సైతం కొన‌సాగుతున్నారు. ఈయ‌న కాపు సామాజిక వ‌ర్గానికి నేత‌. ఇక న‌స్పూరు మున్సిపాలిటీ వైస్ చైర్మ‌న్ తోట శ్రీ‌నివాస్. ప్ర‌స్తుతం ఆయ‌న న‌స్పూరు మున్సిపాటిటీ వైస్ చైర్మ‌న్ గా ప‌నిచేస్తున్నారు. ఆయ‌న స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా గెలిచి బీఆర్ఎస్ మ‌ద్ద‌తుతో వైస్ చైర్మ‌న్‌గా గెలిచారు. ఉద్య‌మ కాలంలో చురుకుగా ప‌నిచేశారు. బాల్క సుమ‌న్ అనుచ‌రుడిగా పేరొందారు. ఎమ్మెల్యే ఎన్నిక‌ల్లో సైతం చురుకుగా ప‌నిచేశారనే పేరుంది. ఈయ‌న‌ది కూడా కాపు సామాజిక‌వ‌ర్గ‌మే.

ఇక మంచిర్యాల మున్సిప‌ల్ వైస్ చైర్మ‌న్‌గా ప‌నిచేస్తున్న ముఖేష్ గౌడ్ పేరు సైతం ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నారు. ఆయ‌నకు మంచిర్యాల ప‌ట్ట‌ణంలో మంచి పేరు ఉండ‌టంతో పాటు మాజీ ఎమ్మెల్యే గ‌డ్డం అర‌వింద‌రెడ్డి ఆశీస్సులు సైతం ఉన్నాయి. ఇక పెర్క సామాజిక వ‌ర్గానికి చెందిన మంచిర్యాల బీఆర్ఎస్ నాయ‌కురాలు అత్తి స‌రోజ పేరు సైతం ప‌రిశీల‌న‌కు తీసుకున్నారు. డీసీఎంఎస్ చైర్మ‌న్ తిప్ప‌ని లింగ‌య్య పేరును సైతం ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని స‌ర్వే నిర్వ‌హించారు. ఆయ‌నతో పాటు మంచిర్యాల ఈఎన్‌టీ స్పెష‌లిస్టు డాక్ట‌ర్ ర‌మ‌ణ గురించి సైతం ఆరా తీశారు.

మంచిర్యాల నియోజ‌క‌వ‌ర్గంలో పెర్క, కాపు సామాజిక వ‌ర్గానికి పెద్ద ఎత్తున ఓటు బ్యాంకు ఉంటుంది. అందుకోస‌మే ఈ ఆరుగురిలో ఒక ముఖేష్ గౌడ్ మిన‌హా మిగ‌తా అంద‌రూ ఆ రెండు సామాజిక వ‌ర్గాల‌కు చెందిన వారే ఉన్నారు. వీరితో పాటు న‌లుగురు త‌ట‌స్థుల పేర్లు సైతం ప‌రిశీల‌న‌లోకి తీసుకున్న‌ట్లు స‌మాచారం. రాజకీయాల‌కు సంబంధం లేని ఈ న‌లుగురి పేర్ల‌ను ప‌రిశీలించి ఎవ‌రి పేరు ఖ‌రారు చేస్తారో అన్న చ‌ర్చ సాగుతోంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like