మంద‌మ‌ర్రి స‌మ‌స్య‌… కేంద్రం వివ‌క్ష‌..

అసెంబ్లీలో కేంద్ర ప్ర‌భుత్వంపై ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ ఆగ్ర‌హం

మంచిర్యాల : మ‌ంద‌మ‌ర్రిలో ద‌శాబ్దాలుగా ఎన్నిక‌లు లేక అభివృద్దికి ఆటంకంగా మారింద‌ని ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అసెంబ్లీ వేదిక‌గా ప్ర‌భుత్వం దృష్టికి తీసుకువ‌చ్చారు. మంగ‌ళ‌వారం ఆయ‌న అసెంబ్లీలో మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపరచిన 1/70 చట్టం వల్ల మందమర్రి మున్సిపాలిటీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీని వ‌ల్ల‌ ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండ‌టం లేద‌ని, అభివృద్ధికి ఆటంకంగా మారిందన్నారు. స్థానికంగా ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ఫలాలు ప్రజలకు మరింత చేరువవుతాయ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ చట్టంపై కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న మొండి వైఖరిపై బాల్క సుమ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

1995 సంవత్సరంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దిలీప్ సింగ్ భూరియా కమిటీ కేంద్ర పీసా చట్టం అర్బన్ లోకల్ బాడీలకు కూడా వెసులు బాటు కల్పించవచ్చ‌ని తెలిపింద‌న్నారు. అయినా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంద‌ని తెలిపారు. ఈ చట్టాన్ని 2010 రాజ్యసభలో పొందుపరచినా ఇంతవరకు అతీగతి లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి మీసా చట్టం అమలయ్యేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఇక్క‌డే కాకుండా మణుగూరు, పాల్వంచ, సారపాక, ఆసిఫాబాద్, ప్రాంతాల్లో కూడా ఇదే ప‌రిస్థితి ఉంద‌న్నారు. ఆయా ప్రాంతాల‌కు సంబంధించిన ఎంపీలు కూడా పార్లమెంట్ లో నినదించాలన్నారు. ఈ విష‌యంలో మున్సిపల్ శాఖ మంత్రి ఈ అంశంపై స్పందిస్తూ మీసా చట్టం గురించి కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. తామే స్వయంగా కేంద్రానికి లేఖ రాస్తామని తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నుండి చెన్నూర్ నియోజకవర్గంలోని భూములకు సాగునీరు అందించే “చెన్నూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్” కు త్వరలోనే టెండర్ల పూర్తి చేస్తామ‌ని ఆర్థిక శాఖ మంత్రి హ‌రీష్ రావు మ‌రోమారు స్ప‌ష్టం చేశారు. ఈ ప‌థ‌కానికి సంబంధించి ప‌నులు త్వ‌ర‌లోనే ప్రారంభిస్తామ‌ని అసెంబ్లీ వేదికగా హామీ ఇచ్చారు. ఈ పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ సుముఖత వ్యక్తం చేసినట్లు ఈ సందర్భంగా తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like