మార్మోగుతున్న శివాల‌యాలు

మంచిర్యాల : ఓం నమఃశివాయ.. శంభో శంకర.. హరహర మహాదేవా.. అంటూ భక్తుల శివనామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న శివాలయాల్లో భక్తులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని కత్తెరశాల మల్లన్న , బుగ్గ రాజేశ్వర ఆల‌యం, వేలాల మల్లన్న, చెన్నూర్‌ శివాలయం.. తదితర శివాలయాలకు పెద్ద ఎత్తున భక్తులు త‌ర‌లివ‌చ్చారు. ఆల‌య కమిటీలు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. చెన్నూర్‌లో ప్రజలు గోదావరి ఉత్తరవాహినిల పుణ్యస్నానాలు ఆచరించి, అంబా అగస్త్యేశ్వరాలయం (శివాలయం)లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గూడెం పరిసర ప్రాంతాల్లోని భక్తులు సమీపంలోని గోదావరి నదిలో స్నానాలాచరించి గూడెంలోని ఆలయంలో అర్చనలు, పూజలు చేశారు. వీటితో పాటు జిల్లాలోని శివాలయాన్నింటిల్లో సందడి నెలకొంది.

ఆసిఫాబాద్ జిల్లాలో..
ఆసిఫాబాద్ జిల్లాలో సైతం భ‌క్తులు శివాల‌యాల వ‌ద్ద బారులు తీరారు. ఈస్‌గాం మ‌ల్ల‌న్న శివాలయంలో సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోన‌ప్ప దంప‌తులు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఇక్క‌డ కూడా భ‌క్తులు క్యూలైన్ల‌లో బారులు తీరారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా దేవాదాయ‌, పోలీసు శాఖ ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసింది.

శివరాత్రికి మాత్రమే దర్శనం..
కుంటాల జలపాతం వద్ద సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలో శివలింగం, నందీశ్వరుడిని దర్శించుకోవాలంటే మహా శివరాత్రి సందర్భంగా రెండు రోజులపాటు దర్శనానికి వీలుంటుంది. రాష్ట్రంలోనే ఎత్తయిన జలపాతంగా పేరొందిన కుంటాల జలపాతం వద్ద సహజ సిద్ధంగా ఏర్పడిన సోమేశ్వర ఆలయంలో శివలింగం, నందీశ్వర విగ్రహాలకు అభిషేకంతోపాటు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాలతోపాటు మహారాష్ట్ర, తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి గుహలోని శివలింగం, నందీశ్వర విగ్రహాలకు మొక్కులు చెల్లిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like