గోదావ‌రి ముంపులో మాతా శిశు సంర‌క్ష‌ణా కేంద్ర‌మా..?

-కమీషన్ల కక్కుర్తి కోసమే ఐబి చౌరస్తాలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్
-మేం అధికారంలోకి రాగానే ఇక్క‌డే మాతా శిశుసంర‌క్ష‌ణా కేంద్రం
-ప్ర‌జ‌ల త‌ర‌ఫున నిల‌బ‌డుతున్న ప్రేంసాగ‌ర్ రావుకు అభినంద‌న‌లు
-మంచిర్యాల పాద‌యాత్ర‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

CLP leader Bhatti Vikramarka: ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా మాతా శిశు సంరక్షణ కేంద్రం నిర్మించాల్సి ఉండ‌గా, గోదావ‌రి ముంపు ప్రాంతంలో ఏర్పాటు చేయ‌డం దారుణ‌మ‌ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 31వ రోజు ఆదివారం ఆయ‌న మంచిర్యాల ప‌ట్ట‌ణంలో పాద‌యాత్ర నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఐబీ చౌర‌స్తాలో ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ప‌రిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే కమీషన్ల కక్కుర్తి కోసమే ఐబి చౌరస్తాలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మిస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. గోదావరి ముంపు ప్రాంతంలో మాతా శిశు సంరక్షణ కేంద్రం నిర్మించ‌డం దుర్మార్గమైన ఆలోచనగా ఆయ‌న అభివ‌ర్ణించారు. మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని గోదావరి ముంపు ప్రాంతంలో నిర్మించ‌డం వల్ల గత ఏడాది వర్షాలు, వరదలతో ముంపునకు గురైందన్నారు. వరదలతో ఆసుపత్రి మొద‌టి అంత‌స్తు వరకు నీళ్లు వ‌చ్చాయ‌ని ఇప్పటికీ అక్కడే ఆసుపత్రి కొనసాగించడం దుర్మార్గమ‌న్నారు.

మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు, కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా వ్య‌వ‌హ‌రించార‌ని, వారు స్పందించ‌క‌పోతే ప్రాణనష్టం జరిగి ఉండేదని భ‌ట్టి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మాతా శిశు సంరక్షణ కేంద్రం వరదలతో మునిగిపోతుందని ఆసుపత్రిలో ఉన్న బాలింతలు, శిశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించారని స్ప‌ష్టం చేశారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఎదుట మాతాశిశు సంరక్షణ కేంద్రం ఉండడం సబబని వెల్ల‌డించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఎత్తివేసి మాతా శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. కమిషన్లు, కాంట్రాక్టుల బిల్లుల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దని భ‌ట్టి కోరారు. ప్రజల సంక్షేమం కోసం వెచ్చించాల్సిన నిధులను పాలకులకు భజన చేసే, జెండా మోసే వారి కోసం కేటాయించి ప్రజలను ఇబ్బంది పెట్టొద్దన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో షాపులు అమ్ముకోవడానికి ఐబి చౌరస్తాలో నిర్మాణం చేస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మాతా శిశు సంరక్షణ కేంద్రం, ఐబి చౌరస్తాలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మిస్తున్న కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల్లో స్క్రుటీని చేసి చర్యలు తీసుకుంటామ‌న్నారు. మ‌రోవైపు ప్రభుత్వం చేయాల్సిన అనేక పనులను సొంత నిధులతో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ చేయడం అభినందనీయమ‌న్నారు. కరోనా సమయంలో సొంత నిధులతో ప్రేమ్ సాగర్ మాస్కులు, ఆక్సిజన్ సిలిండర్లు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి ప్రజలకు అండగా ఉన్నారని తెలిపారు. గోదావరి వరదలతో మంచిర్యాల మునిగినప్పుడు ప్రభుత్వం చేయాల్సిన పనులను ప్రేమ్ సాగర్ ముందుండి చేశార‌ని భ‌ట్టి వెల్ల‌డించారు. విద్య వైద్యం అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like