మీ ప‌నితీరు మార్చుకోండి

-అధికారుల నిర్ల‌క్ష్యం వ‌ల్లే కూలీల‌కు ఉపాధి అంద‌డం లేదు
-ప‌ని క‌ల్పించ‌క‌పోతే నిరుద్యోగ భృతి చెల్లించండి
-ప్రత్యేక అధికారి గజానన్ కి బీజేపీ నేత‌ల‌ వినతిపత్రం

మంచిర్యాల జిల్లా // ఉపాధి హామీ ప‌నుల‌కు సంబంధించిన అధికారులు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, వారి ప‌నితీరు మార్చుకోవాల‌ని బీజేపీ నేత‌లు డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం ప్రజావాణిలో మండల ప్రత్యేక అధికారి గజానన్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు రామగౌని మహీధర్ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 100 రోజుల పని కల్పించాలనే ఉద్దేశ్యంతో ఉపాధి హామీ ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్టింద‌న్నారు. ఉపాధి హామీ చట్టం ప్రకారం ఎవరైనా కూలీ, పని అడిగిన 14 రోజుల్లోగా పని కల్పించాలని లేక‌పోతే నిరుద్యోగ భృతి చెల్లించాల‌న్నారు. పని ప్రదేశాల్లో ఎండ నుంచి రక్షణకు గ్రీన్ టేంట్ ఏర్పాటు, ఫస్ట్ఎయిడ్ కిట్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలని తెలిపారు. కానీ అధికారుల నిర్లక్ష్యంతో ఇవేమి అమలు కావడం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అధికారులు సమయ పాలన పాటించకుండా, ఇష్టం వచ్చినప్పుడు ఆఫీసుకు వచ్చి వెళ్తున్నారన్నారు. ఉపాధి హామీ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మండల ఈజిఎస్ అధికారులు తీరు మార్చుకోవాలని, లేక‌పోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు పట్టెం విష్ణుకళ్యాణ్,దూడపాక భరత్,తాళ్లపల్లి భాస్కర్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు పుట్ట కుమార్, ఆనంద్, శ్రీనివాస్ బీజేవైఎం జిల్లా కార్యదర్శి ఎముర్ల ప్రదీప్, రాజయ్య, బానయ్య తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like