మీ పిల్ల‌ల‌కు మందు పెట్టి సంపుతా

-త‌ల్లిదండ్రుల‌ను బెదిరించిన అంగ‌న్వాడీ టీచ‌ర్ భ‌ర్త‌
-చెన్నూరు ఐసీడీఎస్ కార్యాల‌యాన్ని ముట్ట‌డించిన బాధితులు
-స్పందిచ‌ని సీడీపీవోపై సైతం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆందోళ‌న

మంచిర్యాల :‘మీ పిల్ల‌ల్ని అంగ‌న్‌వాడీ సెంట‌ర్‌కు ఎలా పంపిస్తారో చూస్తా.. వారి సెంట‌ర్‌కు పంపిస్తే మందు పెట్టి సంపుతా’ అని ఓ అంగ‌న్‌వాడీ టీచ‌ర్ భ‌ర్త గ్రామ‌స్తుల‌ను బెదిరించాడు. అంతేకాకుండా మ‌హిళ‌లు అని చూడ‌కుండా ఇష్టం వ‌చ్చిన‌ట్లు బూతులు తిట్టాడు. దీంతో గ్రామ‌స్తులు చెన్నూరు సీడీపీవో కార్యాల‌యం ఎదుట ఆందోళ‌న‌కు దిగారు. సీడీపీవో సైతం గ్రామస్తుల‌కు స‌రైన స‌మాధానం ఇవ్వ‌కపోవ‌డంతో తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గం కోట‌ప‌ల్లి మండ‌లం ల‌క్ష్మీపూర్ గ్రామంలో వ‌ర‌ద బీభ‌త్సం సృష్టించింది. ఇండ్ల‌లోకి నీరు రావ‌డంతో పాటు బియ్యం, వ‌స్తువులు, చివ‌ర‌కు దుస్తులు సైతం త‌డిచిపోయాయి. దీంతో గ్రామ‌స్తులు నానా ఇబ్బందులు ప‌డాల్సి వ‌చ్చింది. దీనిని గ‌మ‌నించిన సేవాభార‌తి స‌భ్యులు గ్రామ‌స్తులకు బియ్యంతో పాటు నిత్యావ‌స‌ర స‌రుకులు ఇచ్చేందుకు గ్రామానికి వ‌చ్చారు. దాదాపు 50 కుటుంబాల వ‌ర‌కు అంద‌చేశారు. మిగ‌తా వారికి ఇస్తుండ‌గా, అంగ‌న్‌వాడీ టీచ‌ర్ పెద్దింటి రాజేశ్వ‌రి భ‌ర్త కోటేష్ వ‌చ్చి వారు అంతా డ‌బ్బున్న వారు.. వారికి ఎందుకు ఇస్తున్నారంటూ గొడ‌వ‌కు దిగారు.

సేవాభార‌తి స‌భ్యులు నిత్యావ‌స‌ర స‌రుకులు ఇవ్వ‌కుండా అడ్డుకున్నారు. దీంతో గ్రామ‌స్తులు అత‌నిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో మీ పిల్ల‌లు నా భార్య న‌డ‌పే అంగ‌న్‌వాడీ సెంట‌ర్‌కు వ‌స్తారు క‌దా..? వారికి మందు పోసి సంపుతా అంటూ బెదిరించాడు. అంతేకాకుండా మ‌హిళ‌ల‌ను సైతం రాయ‌లేని భాష‌లో బూతులు తిట్టాడు. అంతేకాకుండా నిత్యావ‌స‌ర స‌రుకులు ఇచ్చేందుకు వ‌చ్చిన సేవాభార‌తి స‌భ్యులపై దాడికి సైతం ప్ర‌య‌త్నించాడు. దీంతో వారు వెళ్లిపోయారు. గ్రామ‌స్తులు మూకుమ్మ‌డిగా కోటేష్‌పై స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు.

అంతేకాకుండా చెన్నూరు సీడీపీవో కార్యాల‌యానికి వ‌చ్చి అంగ‌న్‌వాడీ టీచ‌ర్ రాజేశ్వ‌రి, ఆయ‌న భ‌ర్త కోటేష్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. అయితే సీడీపీవో క‌నీసం ఫోన్ కూడా లేప‌కపోవ‌డంతో పాటు త‌మ‌ను ప‌ట్టించుకోలేద‌ని గ్రామ‌స్తులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆమె కూడా అంగ‌న్‌వాడీ టీచ‌ర్‌కు మ‌ద్ద‌తు చెబుతోంద‌ని, సీడీపీవో డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. సీడీపీవో నిర్ల‌క్ష్యంపై ల‌క్ష్మీపూర్ స‌ర్పంచ్ పాణెం శంక‌ర్ సైతం నిర‌స‌న వ్య‌క్తం చేశారు. గ్రామ‌స్తులు అంద‌రూ వ‌చ్చి ఆందోళ‌న చేస్తుంటే సీడీపీవో క‌నీసం ప‌ట్టించుకోక‌పోవ‌డం ఏంట‌ని..? ప్ర‌శ్నించారు. వారిపై చ‌ర్య‌లు తీసుకోక‌పోతే ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like