అదే మాట అధినేత‌కు…

-కోరుకంటికి టిక్కెట్టు ఇవ్వొద్ద‌ని చెప్పిన అస‌మ్మ‌తి నేత‌లు
-ఎమ్మెల్యే కేసులు వేధించార‌ని కేటీఆర్ దృష్టికి
-స‌ర్వేల‌ను బ‌ట్టి పార్టీ టిక్కెట్టు ఇస్తామ‌న్న మంత్రి కేటీఆర్‌
-పార్టీకి వ్య‌తిరేకంగా ప్రెస్‌మీట్లు పెట్టొద్ద‌ని వెల్ల‌డి

కోరుకంటి చంద‌ర్‌కు ఎట్టి ప‌రిస్థితుల్లో టిక్కెట్టు ఇవ్వొద్దు.. కావాలనుకుంటే జిల్లా అధ్యక్షునిగా కోరుకంటి కొనసాగినా పర్వాలేదు.. కానీ, ఎమ్మెల్యే టికెట్ మాత్రం ఇవ్వ‌వ‌ద్దు.. వేరేవాళ్లకు ఇవ్వాలని రామ‌గుండం అసమ్మతి నేతలు మంత్రి కేటీఆర్‌ను కోరారు. ఆ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఐదుగురు కీలక నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. రామగుండం నియోజకవర్గంలో జరిగిన పరిణామాలను ఐదుగురు నేతలు కేటీఆర్ కు వివరించారు. ఈ సంద‌ర్భంగా ఆ నేత‌లు ఎమ్మెల్యే కొరుకంటి చంద‌ర్ గురించి ప‌లు విష‌యాలు వెల్ల‌డించిన‌ట్లు స‌మాచారం.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సర్వేల రిపోర్టు ఎవరికి అనుకూలంగా ఉంటే వారికే పార్టీ టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కోరుకంటి చందర్ రామగుండం ఎమ్మెల్యే కాబట్టి తనతో మాట్లాడుతానని, అలా అని ఆయన తనకు దగ్గర అనుకుంటే ఎలా అని, త‌న‌కు అందరూ ఒక్కటే అని పార్టీ నేతలకు సర్ది చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే పనులు ఎవరూ చేయవద్దని అసంతృప్తి నేతలకు చెప్పారు. పార్టీ బలోపేతం కోసం అందరూ కష్టపడి పని చేయాలని కోరారు.

ఎమ్మెల్యే చందర్ తమపై కేసులు పెట్టించి.. తీవ్రంగా వేధించారని కేటీఆర్ కు ఐదుగురు నేతలు ఫిర్యాదు చేశారు. సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్యే కేసులు పెట్టిన విషయం తనకు తెలియదని కేటీఆర్ వారితో చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా రామ‌గుండం నియోజకవర్గంలో ప్రెస్ మీట్లు పెట్టవద్దని కేటీఆర్ ఆదేశించారు. అయితే.. కలిసి పనిచేయాలా? వద్దా? అనేది కోరుకంటిపై ఆధారపడి ఉంటుందని అసమ్మతి నేతలు కేటీఆర్ కు బదులిచ్చినట్లు సమాచారం. అధిష్టాన నిర్ణయంపైనే తమ రాజకీయ భవిష్యత్ ఉంటుందని కూడా వాళ్లు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.

కొద్ది రోజులుగా పెద్దపల్లి జిల్లా రామగుండంలో అసమ్మతి జ్వాల‌లు ర‌గులుతున్నాయి. పాలకుర్తి జడ్పిటిసి కందుల సంధ్యారాణి, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, రామగుండం నగరపాలక సంస్థ తొలి మాజీ మేయర్ కుంకటి లక్ష్మీనారాయణ, బసంత్ నగర్ పర్మినెంట్ కార్మిక సంఘం నాయకులు బయ్యపు మనోహర్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాతిపల్లి ఎల్లయ్య ఎమ్మెల్యే కోరుకంటి చంద‌ర్‌పై అస‌మ్మ‌తి గ‌ళం వినిపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే మంత్రి కేటీఆర్ తో శుక్రవారం భేటీ అయ్యారు. అసెంబ్లీ కేటీఆర్ పేషీలోనే గంటల తరబడి వీళ్ల సమావేశం జరిగింది. మ‌రోవైపు అసమ్మతి నేతలతో పాటు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తోనూ మంత్రి కేటీఆర్ చర్చించారు. ఆపై “నేను చెప్పాల్సింది చెప్పిన.. ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ కోసమే పనిచేస్తా.. అంటూ ఎమ్మెల్యే కోరుకంటి వ్యాఖ్యానించడం గమనార్హం. కేటీఆర్తో భేటీ అనంతరం.. మంత్రి కొప్పుల ఈశ్వర్‌తోనూ రామగుండం అసమ్మతి నేతలు భేటీ అయ్యారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like