విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ఇంటర్మీడియెట్ పరీక్షలు రాసే విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం పరీక్షల నిర్వహణ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసారు. కుమ్రంభీం జిల్లా అదనపు పాలనాధికారి రాజేశం, జిల్లా మాధ్యమిక విద్యాధికారి డా.శ్రీధర్ సుమన్ పాల్గొని పరీక్షల కోసం తీసుకున్న ఏర్పాట్ల గురించి వివరించారు. అదనపు కలెక్టర్ రాజేశం మాట్లాడుతూ జిల్లాలో హైపవర్ కమిటీ సమావేశం నిర్వహించి పోలీస్, రెవెన్యూ, విద్య, వైద్యం, జిల్లా పరిషత్ అధికారులకు తగు సూచనలిచ్చామని తెలిపారు. పరీక్షా నిర్వాహకులకు సమావేశం నిర్వహించి చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్ మెంటల్ అధికారులు, కస్టోడియన్లకు శిక్షణా కార్యక్రమం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 24 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్మీడియేట్ ప్రథమ సం. పరీక్ష ( నిర్వహించనున్నారని, జనరల్ విద్యార్థులు 4326 మరియు 882 ఒకేషనల్ మొత్తం 5208 విద్యార్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు, నీటి వసతి, రవాణా తదితర అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా సూచించారు. ఇంటర్ బోర్డు నియమావళికి లోబడి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. పరీక్షల సందర్భంగా కోవిడ్ నిబంధనల మేరకు తగు సంఖ్యలో వైద్య సిబ్బందిని తప్పక నియమించాలన్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు నైతం శంకర్, తిరుపతి, పోలీస్, విద్య, వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like