ఎమ్మెల్యే.. బహిరంగ చర్చకు సిద్ధమా..?

-తాను చాట్ చేశానని అమ్మాయి చెప్పలేదు
-అమ్మాయి తనను నేరుగా లైంగికంగా వేధించారని చెప్పింది
-ఎమ్మెల్యే తాను చాటింగ్ చేయలేదని చెబుతున్నారు
-మరి నాతో చాటింగ్ చేసింది, మాట్లాడింది ఎవరో చెప్పాలి
-మేం ఇచ్చిన రూ. 20 లక్షలతో ఎమ్మెల్యే నూతన గృహప్రవేశం
-ఆరిజన్ డైరీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఆదినారాయణ

Manchiryal:తనపై వస్తున్న ఆరోపణలు నిజం కాదని, అసలు తాను చాటింగే చేయలేదని చెప్పడం శుద్ధ అబద్ధమని ఆరిజన్ డైరీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఆదినారాయణ స్పష్టం చేశారు. ఆయన బుధవారం ఓ వీడియో విడుదల చేశారు. మీడియాలో వస్తున్నవి ఆరోపణలు కాదని. అవన్నీ నిజాలేనని స్పష్టం చేశారు. సెజల్ చెప్పినవి నిజాలేనన్నారు. ఎమ్మెల్యేతో తాను చాట్ చేశానని అమ్మాయి చెప్పలేదని, అమ్మాయి తనను నేరుగా లైంగికంగా వేధించారని చెప్పిందన్నారు. వాటికి సంబంధించి మా వద్ద ఆధారాలు ఉన్నాయని ఆదినారాయణ స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆ చాటింగ్ తనది కాదని చెబుతున్నారని, తాను చాట్ చేయలేదని, తాను ఆ నంబర్ వాట్సప్ వాడటం లేదని అంటున్నారని తెలిపారు. మరి ఆగస్టు 4న ప్రగతిభవన్లో ముఖ్యమంత్రితో చిన్నయ్య కలిసి ఉన్న ఫొటోలు తనకు పంపిన వ్యక్తి ఎవరు..? దళితబంధు గురించి ముఖ్యమంత్రితో మాట్లాడానని, మంచిర్యాల ఎమ్మెల్యేకు 22 యూనిట్లు ఇచ్చారని తనతో చెప్పిన వ్యక్తి ఎవరని ఆదినారాయణ ప్రశ్నించారు. కోకాపేటలో మంత్రిని హరీష్రావును కలిసేందుకు వెళ్తునానని తనతో చెప్పిన వ్యక్తి ఎవరని అడిగారు. ఇవన్నీ ఎవరో తెలియనప్పుడు అది ఎవరో చెప్పాల్సిన బాధ్యత కూడా ఎమ్మెల్యేదేనని వెల్లడించారు.

ఒక ప్రజాప్రతినిధి అయ్యి కూతురు వయస్సు ఉన్న అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించడం సిగ్గుచేటని అన్నారు. మేం రైతులను మోసం చేశామని చెప్పారని తాము ఎక్కడ మోసం చేశామో చెప్పాలని ఆదినారాయణ డిమాండ్ చేశారు. తాము భూమి కొన‌డానికి వ‌స్తే తాను భూమి ఇప్పిస్తాన‌ని రూ. 20 ల‌క్ష‌లు తీసుకున్నార‌ని వెల్ల‌డించారు. మేం ఇచ్చిన రూ. 20 లక్షలతో ఎమ్మెల్యే నూతన గృహ ప్రవేశం చేశారని, ఇది వాస్తవం కాదా….? అని ప్రశ్నించారు. షెడ్ నిర్మాణం చేపిస్తానని రూ. 10 లక్షలకు సంబంధించి చెక్కులు ఇస్తామంటే చెక్కులు వద్దు క్యాష్ ఇవ్వాలనడం నిజం కాదా..? అన్నారు. ఈ విష‌యంలో నాతో చాట్ చేసి థామ్స‌స్ అనే వ్య‌క్తితో అగ్రిమెంట్ చేయించి షెడ్ నిర్మాణం చేయ‌కుండా మ‌మ్మ‌ల్ని మోసం చేసిన మాట వాస్త‌వం కాదా..? అని ప్ర‌శ్నించారు.

మొద‌ట త‌మ‌కు ఇచ్చిన భూమి ప్ర‌భుత్వానిది అని తెలిసి నిల‌దీశామ‌ని, అప్పుడు త‌న‌కు వేరే చోట రెండెక‌రాలు ప‌ట్టా లాండ్ ఉంద‌ని దానిని మీ పేరిట రిజిస్ట్రేష‌న్ చేస్తామ‌ని ఎమ్మెల్యే చెప్పార‌ని వెల్ల‌డించారు. అది కాకున్నా మీ కుటుంబ‌సభ్యుల పేరిట ఉన్న భూమి చూపించార‌ని ఆదినారాయణ తెలిపారు. మీరు చేసిన ప‌నులు బ‌య‌ట‌కు తీసుకువ‌స్తున్నామ‌ని మాపై ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌రికాద‌న్నారు. మీ ద‌గ్గ‌ర ఏ ఆధారాలు ఉన్నా తీసుకురండి.. మేం బ‌హిరంగ చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌ని ఆరిజన్ డైరీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఆదినారాయణ స‌వాల్ విసిరారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like