ఎమ్మెల్యే డ‌మ్మీ… అభ్య‌ర్థే అన్నీ..

Khanapur Constituency: ఆయ‌న ఎమ్మెల్యే కాదు.. ఎమ్మెల్యేకు బంధువు కూడా కాదు.. కేవ‌లం ఒక పార్టీకి అభ్య‌ర్థి మాత్ర‌మే.. కానీ, ఎమ్మెల్యే కంటే ఎక్కువ అధికార ద‌ర్పాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఎస్ఐ నుంచి ఐఏఎస్ వ‌ర‌కు ఆయ‌న చెప్పినంటే వింటున్నారంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. అధికారులు సైతం సిట్టింగ్ ఎమ్మెల్యేకు కిచ్చింత్ విలువ ఇవ్వ‌డం లేదు. ఎంపీడీవో నుంచి ఉన్న‌తాధికారుల వ‌ర‌కు క‌నీసం ఎమ్మెల్యే ఫోన్ సైతం లేప‌డం లేదు. ఇంత‌కీ అన‌ధికారికంగా ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్న అభ్య‌ర్థి ఎవ‌రు..? నిత్యం ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ, ప‌త్రికా స‌మావేశాలు పెడుతున్న ఆ ఎమ్మెల్యే ఎవ‌రూ..? ఇంత‌కీ ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ఏం జ‌రుగుతోంది..?

నిర్మ‌ల్ జిల్లాలో ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్య‌ర్థి వ్య‌వ‌హార‌శైలిపై తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఆ పార్టీ అభ్య‌ర్థి జాన్స‌న్ నాయ‌క్ ఎమ్మెల్యే, మంత్రి త‌ర‌హాలో అధికార యంత్రాంగాన్ని వాడేస్తున్నారు. అధికార పార్టీ అభ్య‌ర్థి అయితే, ఎమ్మెల్యే అయిపోయిన‌ట్టుగానే వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెట్టేస్తున్నారు. అధికారుల‌తో మంత‌నాలు సాగిస్తూ అన‌ధికార ఎమ్మెల్యేగా న‌డిపిస్తున్నారు. మ‌రోవైపు జిల్లా, మండ‌ల స్థాయి అధికారులు ఆయ‌న మాటే వింటున్నారు. అధికారులు నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి నిధుల‌ను నిలిపివేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ద‌ళిత‌బంధు, ఏసీడీపీ నిధులు, బీసీ బంధు, నియోజ‌క‌వ‌ర్గానికి రావాల్సిన నిధులు, చేయాల్సిన ప‌నులు ఆగిపోయాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క్రెడిట్ త‌న‌కే ద‌క్కేలా వ్యూహ‌ర‌చ‌న చేస్తూ ముందుకు సాగుతున్నారు. జాన్స‌న్ నాయ‌క్ కే టిక్కెట్టు ప్ర‌క‌టించ‌డం, ఆయ‌న మంత్రి కేటీఆర్ స్నేహితుడు కావ‌డంతో అధికారగ‌ణం మొత్తం ఆయ‌న సేవ‌లోనే త‌రిస్తోంది.

ఇక, నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ టిక్కెట్టు ప్ర‌క‌టించిన ఒక అభ్య‌ర్థి విష‌యంలో అధికారులు ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం ప‌ట్ల సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయ‌క్ తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో సంక్షేమ ప‌థ‌కాలు నిలిపివేయ‌డం ఏమిట‌ని ఆమె ప్ర‌శ్నిస్తున్నారు. అభ్య‌ర్థికి ఎమ్మెల్యే స్థాయి ప్రొటోకాల్ ఇస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఆమె త‌ర‌చూ విలేక‌రుల స‌మావేశాలు నిర్వ‌హిస్తూ త‌న ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఆమెకు ఇవ్వాల్సిన క‌నీస ర‌క్ష‌ణ విష‌యంలో సైతం అధికార యంత్రాంగం నుంచి సైతం స్పంద‌న ఉండ‌టం లేదు. ఎంపీడీవోలు, ఎస్ఐలు, సీఐలు ఆమెను ప‌ట్టించుకోవ‌డం లేదు. ప్రెస్‌మీట్లు పెట్టి మ‌రీ త‌న అక్క‌సు వెళ్ల‌గ‌క్కుతోంది.

ఇక‌, ఆ నియోజ‌క‌వ‌ర్గంలో రేఖా నాయ‌క్ వైపు ఉన్న నేత‌లు, ప్ర‌జాప్ర‌తినిధుల‌ను త‌న వైపు తిప్పుకునేందుకు జాన్స‌న్ నాయ‌క్ చాలా ర‌కాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మొద‌ట ఆమెను ఖానాపూర్‌లో డ‌మ్మీ చేయ‌డం, తర్వాత వారిని త‌న‌వైపున‌కు తిప్పుకోవ‌డం చేస్తున్నారు. మొద‌టి ప్లాన్ స‌క్సెస్ అవ‌డంతో రెండో దానిని అమ‌లు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. రేఖానాయ‌క్ వైపు ఉన్న నేత‌ల‌ను న‌యానా, భ‌యానా ఒప్పించి వారిని త‌న వైపు తిప్పుకున్నారు. వారికి అన్ని ర‌కాలుగా న‌చ్చ‌జెప్పి మ‌రీ ఆ ప్ర‌య‌త్నంలో కూడా స‌ఫ‌లీకృత‌మ‌య్యారు. త‌న వైపు రాని నేత‌ల‌ను ఏం చేయాల‌నే దానిపై మంత‌నాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం.

మ‌రోవైపు ఆరు నెల‌లుగా నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించిన అన్ని ప‌నులు ఆపివేశారని, ఆయ‌న‌కు ఏ అధికారం ఉంద‌ని అధికారులు ఆయ‌న చెప్పిన‌ట్లే చేస్తున్నారంటూ ఎమ్మెల్యే రేఖా నాయ‌క్ దుయ్య‌బ‌డుతున్నారు. ఇక ఆమె మ‌రో అడుగు ముందుకేసి అభ్య‌ర్థి జాన్స‌న్ నాయ‌క్‌ను న‌డిరోడ్డుపై కొడ‌తా అంటూ సంచ‌ల‌న వ్యాఖ్యాలు సైతం చేశారు. ఇలా ఖానాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయ‌క్‌ను కాదని, కేవ‌లం అభ్య‌ర్థి జాన్స‌న్ నాయ‌క్‌ను అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు ఎమ్మెల్యేగా గుర్తిస్తున్నారు. దీనిపై ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌జాబ‌లం ఉన్న నేత‌, ఎమ్మెల్యేను కాద‌ని ఒక అభ్య‌ర్థికి ప్రాధాన్య‌త ఇవ్వ‌డం ఏమిట‌నే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికార యంత్రాంగం ఆలోచించాల‌ని ప‌లువురు కోరుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like