ఎమ్మెల్యేగారూ.. హామీ మ‌రిచారు మీరు..

-మాదారం టౌన్‌షిప్‌కు ప‌ట్టాలు ఇస్తామ‌ని చెప్పారు
-ఇప్ప‌టి వ‌ర‌కు ఆ విష‌యంలో నోరు మెద‌ప‌డం లేదు
-ఊరు ఉంటుందో.. పోతుందోన‌నే భ‌యంలో ప్ర‌జానీకం
-స్థానిక నాయ‌కులు సైతం స్పందిస్త‌లేర‌ని ఆందోళ‌న‌
-ఇప్ప‌టికైనా ప‌ట్టాలు ఇచ్చి త‌మ‌ను ఆదుకోవాల‌ని విన‌తి

మంచిర్యాల : మాదారం టౌన్‌షిప్‌… చుట్టూ కొండ‌లు, చెట్ల మ‌ధ్య పొద‌రిల్లులా ఉంటుంది ఆ గ్రామం.. గ‌తంలో చుట్టు ప‌క్క‌ల బొగ్గు గ‌నులు, నిత్యం వ‌చ్చిపోయే కార్మికుల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతుండేది. వ‌రుస‌గా బావులు మూత‌ప‌డుతుంటంతో ఇప్పుడు ఆ గ్రామం బోసిపోతోంది. వ‌ల‌స వెళ్లగా మిగిలిన ప్ర‌జ‌లు, శిథిల‌మైన క్వార్ట‌ర్ల‌తో క‌ళ త‌ప్పింది. ఈ గ్రామానికి ప‌ట్టాలు ఇప్పిస్తామ‌ని ఎమ్మెల్యే ఇచ్చిన హామీతో ప్ర‌జ‌ల్లో సంతోషం వ్య‌క్తం అయ్యింది. ఏండ్లు గ‌డుస్తున్నా దాని గురించి క‌నీసం ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఎంవీకే 1,2,3,5,6, గోలేటీ 1,2 గ‌నుల‌తో మాదారం టౌన్‌షిప్ ఎంతో క‌ళ‌గా ఉండేది. ప‌చ్చ‌ని ప్ర‌కృతి, ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఉండటంతో స్థానిక ప్ర‌జ‌లే కాకుండా, అధికారులు సైతం ఇక్క‌డే ఉండేందుకు ఇష్ట‌ప‌డే వారు. కానీ ఆ గ‌నుల‌న్నీ మూత‌ప‌ట‌డంతో ఇక్క‌డ కార్మికులు ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లిపోయారు. కొంద‌రు రిటైర్డ్ కార్మికులు, స్థానిక ప్ర‌జ‌లు దాదాపు 500 కుటుంబాల‌కు జీవ‌నం వెళ్ల‌దీస్తున్నారు. గ‌తంలో త‌మ‌కు కేటాయించిన క్వార్ట‌ల‌లో కొంద‌రు ఉంటుండ‌గా, మ‌రికొంద‌రు ఇక్క‌డే ఇండ్లు క‌ట్టుకుని బ‌తుకుతున్నారు. త‌మకు ప‌ట్టాలు ఇవ్వాల‌ని ఎన్నో ఏండ్లుగా డిమాండ్ చేస్తున్నా క‌నీసం ప‌ట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు.

ప‌ట్టాల‌కు సంబంధించిన విష‌యంలో ఎమ్మెల్యే నాలుగు సంవ‌త్స‌రాల కింద‌ట హామీ ఇచ్చారు. మాదారం టౌన్‌షిప్‌కు సంబంధించి ఖ‌చ్చితంగా ప‌ట్టాలు ఇప్పిస్తామ‌ని స్థానికుల‌కు భ‌రోసా క‌ల్పించారు. దీంతో స్థానికులు ఆనందం వ్య‌క్తం చేశారు. గ‌తంలో బాల్క సుమ‌న్ ఎంపీగా ఉన్న‌ప్పుడు కొంద‌రు వెళ్లి క‌లిసిన‌ప్పుడు వారికి ప‌ట్టాలు ఇస్తామ‌ని ఆయ‌న కూడా మాదారం వాసుల‌కు ప‌ట్టాలిప్పిస్తామ‌ని వెల్ల‌డించారు. ఇక ఎమ్మెల్యే త‌మ గ్రామానికి వ‌చ్చి మ‌రీ ప‌ట్టాలు ఇస్తామ‌ని చెప్ప‌డంతో ఇక్క‌డి వారి ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. కానీ, హామీ ఇచ్చి ఏండ్లు గ‌డుస్తున్నా ఇటు వైపు చూసే వారే లేకుండా పోయారు.

ఈ గ్రామం ఓపెన్‌కాస్టు కింద పోతుంద‌ని కొంత‌మంది, అలాంటిది ఏమీ లేద‌ని మ‌రికొంత మంది భ‌యాందోళ‌న‌ల మ‌ధ్య బిక్కుబిక్కుమంటూ కాలం గ‌డుపుతున్నారు. దీనికి తోడు ఇక్క‌డ ప్ర‌జాప్ర‌తినిధులు, నేత‌లు త‌మకు తోచింది చెబుతూ స్థానిక ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెడుతూ వారు సైతం కాలం వెళ్ల‌దీస్తున్నారు. క‌నీసం వారు కూడా నిజాలు తెలుసుకుని సింగ‌రేణి యాజ‌మాన్యంతో మాట్లాడి ఊరు ఉంటుందా..? ఉండ‌దా..? ఓపెన్‌కాస్టు ప్ర‌భావితం అయితే ఎక్క‌డి వ‌ర‌కు అవుతుంది..? ప‌్ర‌జ‌ల‌కు ఎలాంటి న‌ష్టం జ‌రుగుతుంది అనే విష‌యం స్ప‌ష్టం చేయ‌డం లేదు. దీంతో ప్ర‌జ‌లు భ‌యాల మ‌ధ్యే కాలం వెళ్ల‌దీస్తున్నారు.

దీనికి తోడు సింగ‌రేణి యాజ‌మాన్యం కూడా ఓపెన్ కాస్టు విష‌యం పొక్క‌కుండా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. ఓపెన్‌కాస్టు ఏర్పాటైతే మాదారం టౌన్‌షిప్ మొత్తం ముంపు గ్రామంగా మారుతుందని స‌మాచారం. అదే స‌మ‌యంలో కేవ‌లం కొన్ని ప్రాంతాల్లో మాత్ర‌మే ఓవ‌ర్‌బ‌ర్డెన్ కోసం వాడుకుంటార‌ని చెబుతున్నారు. ఈ విష‌యంలో ఎలాంటి క్లారిటీ లేక జ‌నం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. మాదారం టౌన్‌షిప్ చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో యాజ‌మాన్యం స‌ర్వే చేసింది. కానీ, ఆ స‌ర్వేకు సంబంధించిన ఏ చిన్న విష‌యం కూడా బ‌య‌ట‌కు పొక్క‌కుండా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది.

మాదారం టౌన్‌షిప్‌కు ప‌ట్టాల విష‌యంలో ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌వ‌ద్ద‌ని ఎమ్మెల్యే స్థానిక నేత‌ల‌ను హెచ్చ‌రించిన‌ట్లు స‌మాచారం. అందుకే వారెవ‌రు మాట్లాడ‌టం లేద‌ని తెలుస్తోంది. ప‌ట్టాల‌కు సంబంధించి హామీ ఇచ్చిన సంద‌ర్బంలో తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం చ‌ర్చ‌ల క‌మిటీ ప్ర‌తినిధి ధ‌రావ‌త్ మంగీలాల్‌, ఎమ్మెల్యే దూరపు బంధువు, మాజీ ఎంపీటీసీ దుగుట శ్రీ‌నివాస్ త‌దిత‌రులు ఉన్నారు. ఇక‌ స్థానిక ఎంపీటీసీ, కాంగ్రెస్ జిల్లా నేత సూరం ర‌వీంద‌ర్, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ నేత‌లు సైతం క‌నీసం మాట్లాడం లేదు. ఒకవేళ తాము మాట్లాడితే సింగ‌రేణి యాజ‌మాన్యం నుంచి ఏవైనా ఇబ్బందులు వ‌స్తాయ‌ని సైలెంట్‌గా ఉంటున్నార‌నే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

సింగ‌రేణి స్థ‌లాల్లో ఇండ్ల ప‌ట్టాల కోసం ప్ర‌భుత్వం ఏకంగా జీవో 76 జారీ చేసింది. ఆ జీవో ప్ర‌కారం శ్రీ‌రాంపూర్‌,రామ‌కృష్ణాపూర్‌,మంద‌మ‌ర్రి ప్రాంతాల్లో వేలాది పట్టాలు ఇస్తున్నారు. ఆ జీవో సైతం పొడిగిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అయినా, ఇక్క‌డ ప‌ట్టాలు దిక్కులేవు. ఇప్ప‌టికైనా ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య మాదారంటౌన్‌షిప్‌కు ప‌ట్టాలు ఇవ్వాల‌ని స్థానిక ప్ర‌జాప్ర‌తినిదులు ఆ దిశ‌గా కృషి చేసి పుట్టిన గ‌డ్డ రుణం తీర్చుకోవాల‌ని కోరుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like