ఎమ్మెల్యే రేసులో మున్సిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్‌

-బెల్లంప‌ల్లి టిక్కెట్‌పై క‌న్నేసిన జ‌క్కుల శ్వేత‌
-వెన‌క ఉండి న‌డిపిస్తున్న ఓ ధార్మిక సంస్థ
-ర‌స‌వ‌త్త‌రంగా మారిన‌ బెల్లంప‌ల్లి రాజ‌కీయాలు

మంచిర్యాల : ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ రాజ‌కీయ‌నాయ‌కులు తాము అనుకున్న ప‌నులు వేగ‌వంతం చేస్తున్న‌రు. ముఖ్యంగా టిక్కెట్ ఆశిస్తున్న నేత‌లు త‌మ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. ఇప్పుడు బెల్లంప‌ల్లిలో అదే జ‌రుగుతోంది.

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేం… మ‌న వాళ్లు అనుకున్న వాళ్లే, మ‌నం పెంచి పెద్ద చేసిన వాళ్లే మ‌న‌కు వ్య‌తిరేకంగా మారే ప్ర‌మాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. ఇప్పుడు అదే జ‌రుగుతోంది. బెల్లంప‌ల్లి మున్సిపాలిటీకి సంబంధించి చైర్‌ప‌ర్స‌న్ ఎంపిక స‌మ‌యంలో ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య జ‌క్కుల శ్వేతకు అవ‌కాశం క‌ల్పించారు. దీని వెన‌క ఒక ధార్మిక సంస్థ ఉంద‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం. ఆ సంస్థ ద్వారానే శ్వేత ఎమ్మెల్యేను క‌ల‌వ‌డం, ఆమెను చైర్‌ప‌ర్స‌న్‌గా ఎంపిక చేయ‌డం జ‌రిగిపోయాయి. తాను విద్యావంతురాలు కావ‌డంతో రాజ‌కీయాల్లో దూసుకుపోతున్నారు.

అదే స‌మ‌యంలో మున్సిపాలిటీలో అవినీతి ఆరోప‌ణ‌లు సైతం వెల్లువెత్తాయి. కాంట్రాక్టు ఉద్యోగులను మార్చ‌డం, కొత్త‌గా డ్రైవ‌ర్ల నియామ‌కం వివాదంగా మారింది. ఇండ్ల నిర్మాణాలు ఎక్క‌డ చేప‌ట్టినా వ‌సూళ్ల ప‌ర్వం కొన‌సాగుతోంది. ఇంటి నంబ‌ర్ల‌కు సైతం డ‌బ్బులు తీసుకుంటున్నార‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. తాజాగా బెల్లంప‌ల్లి ప‌ట్ట‌ణంలోని హోర్డింగ్‌కు సంబంధించి సైతం త‌న వాళ్ల‌కు ఇప్పించుకోవాల‌ని చైర్‌ప‌ర్స‌న్ ప‌ట్టుబ‌ట్టారు. అయితే ఇది స‌హించ‌ని వైస్‌చైర్మ‌న్ ఏకంగా ఆమెపై అవిశ్వాస తీర్మాణం పెట్టాల‌ని కౌన్సిల‌ర్ల‌తో స‌మావేశం ఏర్పాటు చేశారు. ప‌రిస్థితి అదుపుత‌ప్పుతుంద‌ని గ్ర‌హించిన జ‌క్కుల శ్వేత హోర్డింగ్ కంట్రాక్ట‌ర్ కౌన్సిల్‌లో మెజారిటీ స‌భ్యులు ప‌ట్టుబ‌ట్టిన‌ట్టుగానే ఆదిలాబాద్‌కు చెందిన వ్య‌క్తికి క‌ట్ట‌బెట్టారు.

త‌న వ‌ర్గాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుతున్న జ‌క్కుల శ్వేత క‌న్ను బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే టిక్కెట్‌పై ప‌డింది. తాను చైర్‌ప‌ర్స‌న్ కావ‌డానికి కార‌ణ‌మైన ఆ ధార్మిక సంస్థే త‌న‌ను వెన‌క ఉండి న‌డిపిస్తున్న‌ట్లు స‌మాచారం. ఎన్ని కోట్ల‌యినా ఫ‌ర్వాలేదు.. ఆమెను ఎమ్మెల్యేను చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇప్ప‌టికిప్పుడు బ‌య‌ట‌ప‌డ‌కున్నా ఆ సంస్థ‌ను న‌డుపుతున్న వ్య‌క్తి టిక్కెట్ కోసం ఎవ‌రెవ‌రిని క‌ల‌వాలి..? ఎలా ముందుకు వెళ్లాలి..? అనే విష‌యంలో ప‌క్కా వ్యూహం ప్ర‌కారం ముందుకు సాగుతున్నారు. దీంతో శ్వేత సైతం అదే స్థాయిలో త‌న వ‌ర్గాన్ని పెంచి పోషించుకుని టిక్కెట్ ద‌క్కించుకునే ప‌నిలో ప‌డ్డారు.

ఈ విష‌యంలో బ‌య‌ట‌కు లీక్ కావ‌డంతో ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య ఆమెను ప‌క్కన పెడుతున్న‌ట్లు తెలుస్తోంది. తాను రాజ‌కీయాల్లోకి తీసుకువ‌చ్చిన వ్య‌క్తి త‌న‌కు ప‌క్క‌లో బ‌ళ్లెంలా మార‌డం ఆయ‌న జీర్ణించుకోలేక‌పోతున్న‌ట్లు స‌మాచారం. ఎన్నిక‌ల స‌మ‌యంలో, ఇత‌ర వ్య‌వ‌హారాల్లో త‌న‌కు అండ‌గా ఉంటార‌ని భావించిన వారే త‌న‌కు వ్య‌తిరేకంగా మార‌డం ప‌ట్ల ఆగ్రహంతో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఏం చేయాల‌నే దానిపై ఆయ‌న ఆలోచిస్తున్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఒకానొక ద‌శ‌లో వైస్‌చైర్మ‌న్ అవిశ్వాస తీర్మాణం పెట్టాల‌నే దానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వాల‌ని భావించిన‌ట్లు స‌మాచారం. కానీ, త‌న నియోజ‌క‌వ‌ర్గంలోనే అవిశ్వాస తీర్మానం జ‌రిగితే బాగుండ‌ద‌ని వెన‌క్కి త‌గ్గిన‌ట్లు తెలుస్తోంది.

ఇలా ఇప్ప‌టి నుంచే రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ఎన్నిక‌లు స‌మీపించే నాటికి ఇంకెన్ని సిత్రాలు చూడాల్సి ఉంటుందో….?

Get real time updates directly on you device, subscribe now.

You might also like