ప‌ట్టాలిస్తామ‌న్నారు.. ప‌త్తా లేకుండా పోయారు..

-మాదారం టౌన్‌షిప్ ప్ర‌జ‌ల‌కు గ‌త ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చిన దుర్గం చిన్న‌య్య‌
-ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం వాటి ఊసెత్త‌ని వైనం
-ఆయ‌న దృష్టికి తీసుకువెళ్ల‌ని స్థానిక నాయ‌కులు
-బెల్లంప‌ల్లికి వ‌ల‌స‌వెళ్లిన టీబీజీకేఎస్ నేత‌లు
-ఇప్పుడు తిరిగి ఓట్లు అడిగేందుకు వ‌స్తున్న బీఆర్ఎస్ నేత‌లు
-ఆగ్ర‌హంతో ఉన్న మాదారం టౌన్షిప్ వాసులు

Singareni: మాదారం టౌన్షిప్ అందమైన కొండల నడుమ, పచ్చని ప్రకృతితో అలరారుతుంది ఈ గ్రామం.. సుమారు 60 ఏండ్ల కిందట ఏర్పడింది ఇది. గతంలో చుట్టూ సింగరేణి భూగర్భ గనులు ఉన్నప్పుడు కళకళలాడింది. కానీ, ఇప్పుడు వెలవెలబోతోంది. ఈ గ్రామం ఎప్పుడు కాలగర్భంలో కలిసిపోతుందోనని పలువురు ఇక్కడి నుంచి వలస వెళ్లిపోయారు. ఉన్న వారికి పట్టాలు ఇస్తానని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్థానికులు నేతలు ఇచ్చిన హామీ నీటి మూటగానే మిగిలింది..

బెల్లంపల్లి ఏరియాలో రెండు ఓపెన్కాస్టులు ప్రారంభించేందుకు రంగం సిద్ధమయ్యింది. ఈ ఓపెన్ కాస్టుల కింద ఎంవీకే 5 ఇంక్లైన్, 3 ఇంక్లైన్తో పాటు మాదారం టౌన్షిప్ సైతం ఉనికి కోల్పోనుంది. ఈ గ్రామంలో దాదాపు 500 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ గ్రామంలో రిటైర్డ్ కార్మికులు, మరికొందరు జీవనం సాగిస్తున్నారు. గత ఎన్నికల సందర్భంగా మాదారం టౌన్షిప్లో నివాసం ఉంటున్న కార్మికులకు పట్టాలు ఇస్తామని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హామీ ఇచ్చారు. ఆయనతో పాటు ఆయన అల్లుడు, టీబీజీకేఎస్ నేత దుగుట శ్రీనివాస్, ధరావత్ మంగీలాల్ తో సహా పలువురు నేతలు సాక్షులుగా నిలిచారు. అయినా ఇప్పటి వరకు ఇక్కడ పట్టాలు ఇచ్చిన పాపాన పోలేదు.

ఈ విషయంలో ఇప్పటి వరకు ఒక్క నేత కూడా కనీసం మాట్లాడకపోవడం పట్ల పలువురు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఎన్నికల సమయంలోనే ఇలాంటి విషయాలు గుర్తుకు వస్తాయని ఆ తర్వాత కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, టీఆర్ఎస్ నేతలు, టీబీజీకేఎస్ నేతలు సైతం కనీసం మాట్లాడం లేదు. పత్రికల్లో వార్తలు వచ్చినప్పుడు మాత్రం ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇస్తారు. ఆయన హామీ ఇస్తారు.. తర్వాత అంతా షరా మాములుగా మారిందని పలువురు చెబుతున్నారు. మాదారం టౌన్షిప్కు పట్టాలు ఇస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు. కానీ, ఇప్పుడు ఏకంగా ఊరే లేకుండా పోతోందని దీని గురించి మాట్లాడే నాథుడే లేడా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా తమ గ్రామానికి పట్టాలు ఇవ్వాలని స్పష్టం చేస్తున్నారు.

ఇక కొసమెరుపు ఏంటంటే… పట్టాలు ఇస్తామని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో హామీ ఇప్పించిన నేతలు ఒక్కొక్కరుగా మాదారం టౌన్షిప్ విడిచిపెట్టి వెలుతుండటం గమనార్హం. వారంతా బెల్లంపల్లిలో తమ పేరిట క్వార్టర్లు అలాట్ చేయించుకుని వెళ్లిపోతున్నారు. ఇదీ నేతల తీరు.. మరి ప్రజలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి…

Get real time updates directly on you device, subscribe now.

You might also like