ఎమ్మెల్సీ కారులో యువకుడి మృత‌దేహం

ఎమ్మెల్సీ కారులో యువకుడి మృతదేహం ఉండటం సంచలనం సృష్టించింది. గతంలో ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్‌గా పనిచేసిన వ్య‌క్తిగా అత‌న్ని గుర్తించారు. నిన్న రాత్రి తమ కొడుకును ఎమ్మెల్సీ తీసుకెళ్లారని కుటుంబీకులు ఆరోపించగా, అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడంటూ మృతదేహాన్ని ఎమ్మెల్సీ కారులో తీసుకుని వచ్చారు. బాధితుల ఆందోళనతో ఎమ్మెల్సీ కారు వదిలి వెళ్లిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కాకినాడ జిల్లాకు చెందిన‌ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారులో యువకుడి మృతదేహం క‌ల‌క‌లం రేపింది. సుబ్రహ్మణ్యం అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతదేహాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు నేరుగా సుబ్రహ్మణ్యం ఇంటికి తీసుకెళ్లగా.. కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో డెడ్ బాడీని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. సుబ్రహ్మణ్యం గతంలో అనంతబాబు వద్ద డ్రైవ్ గా పనిచేశాడు. నిన్న రాత్రి ఎమ్మెల్సీ అనుచరులు సుబ్రమహ్మణ్యంను తీసుకెళ్లారని.. వాళ్లే తమ కొడుకును హత్య చేసి ఉంటారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

గురువారం అనంతబాబు పుట్టిన రోజు కావడంతో అనుచరులంతా పార్టీ చేసుకున్నారు. పార్టీలో గొడవ జరిగిందా.. మరేదైనా కారణముందా అనేది తెలియాల్సి ఉంది. గతంలో పనిచేసిన డ్రైవర్ ను స్వయంగా ఎమ్మెల్సీనే వచ్చి తీసుకెళ్లి.. తర్వాత రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని చెప్పడం అనుమానాస్పదంగా ఉంది. పార్టీ జరుగుతుండగా టిఫిన్ కోసం సుబ్రహ్మణ్యం బయటకు వెళ్లాడని.. అప్పుడు యాక్సిడెంట్ జరిగిందని ఎమ్మెల్సీ చెబుతున్నారు. పార్టీలో భోజనం లేక టిఫిన్ కోసం బయటకు వెళ్లాడని చెప్పడం కూడా అనుమానాలకు తావిస్తోంది. సుబ్రహ్మణం డెడ్ బాడీపై మట్టి, కాళ్లు చేతులు విరిచేసిన ఆనవాళ్లు ఉన్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలో ఎమ్మెల్సీ వద్ద కొంత డబ్బు తీసుకున్నారని.. డబ్బు కోసం తరచూ ఫోన్ చేస్తుండేవారని కూడా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులిచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు డెడ్ బాడీ పోస్ట్ మార్టంకు తరలించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like