ఎఫ్ఐఆర్ లో నా పేరు లేదు

-ఈ నెల 6న హాజ‌రు కాలేను
-11, 12, 14, 15 తేదీల్లో అందుబాటులో ఉంటా
-చ‌ట్టాన్ని గౌర‌వించే వ్య‌క్తిని, ద‌ర్యాప్తున‌కు స‌హ‌క‌రిస్తా
-సీబీఐకి కల్వకుంట్ల కవిత లేఖ

MLC Kavita wrote a letter to CBI: సీబీఐ తన వెబ్సైట్ లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్ క్షుణ్ణంగా పరిశీలించానని అందులో త‌న పేరు లేద‌ని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఆమె సీబీఐకి లేఖ రాశారు. ఆ లేఖ‌లో ప‌లు విష‌యాలు వెల్ల‌డించారు. సీబీఐ ఎఫ్ఐఆర్‌లో నిందితుల జాబితాను కూడా చూశానని, దానిలో నా పేరు ఎక్కడా లేని విషయాన్ని తెలియజేస్తున్నానని చెప్పారు. ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల 6న సీబీఐ ఎదుట హాజ‌రుకాలేన‌ని స్ప‌ష్టం చేశారు. ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో మీకు అనువైన ఏదైనా ఒక రోజు హైదరాబాద్ లోని నా నివాసంలో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటానని క‌విత చెప్పారు.

లిక్క‌ర్ ముడుపుల కేసులో క్లారిఫికేషన్ కోసం సీబీఐ ఇచ్చిన నోటీసులకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిస్పందించారు. కేంద్ర హోం శాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని కోరుతూ సీబీఐకి లేఖ రాశారు. దానికి స్పందించిన సీబీఐ అధికారులు ఈ-మెయిల్ ద్వారా సమాధానం ఇస్తూ ఎఫ్ఐఆర్ కాపీ వెబ్ సైట్ లో ఉన్నదని తెలిపారు. దాంతో తాను ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న నిందితుల పేర్లతో సహా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించానని, కానీ అందులో తన పేరు ఎక్కడా లేదని కల్వకుంట్ల కవిత సోమవారం ఉదయం సీబీఐ అధికారి రాఘవేంద్ర వస్తకు లేఖ రాశారు.

ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల ఈ నెల 6వ తేదీనా తాను సీబీఐ అధికారులను కలుసుకోలేనని సమాచారం ఇచ్చారు. ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో మీకు అనువైన ఏదైనా ఒక రోజు హైదరాబాద్ లోని తన నివాసంలో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. త్వరగా తేదీని ఖరారు చేయాలని పేర్కొన్నారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, దర్యాప్తునకు సహకరిస్తానని కవిత పునరుద్ఘాటించారు. దర్యాప్తునకు సహకరించడానికి పైన పేర్కొన్న తేదీల్లో ఒక రోజు సమావేశం అవుతానని లేఖలో తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like