మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుదాం

-అగ్నిపథ్ వెంటనే ఉపసంహరించుకోవాలి
-కిషన్ రెడ్డి,బండి సంజయ్ కి సిగ్గు లేదు
-మోదీ నిర్ణయాలు దేశ భద్రతకు పెనుముప్పు

మంచిర్యాల:మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుదామని, దానికి యువత ముందుకు రావాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పిలుపునిచ్చారు.శుక్రవారం చెన్నూరు క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని టిఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తోందని స్పష్టం చేసారు.

ఒకప్పుడు జైజవాన్ జైకిసాన్ అనే వారని, ఇప్పుడు మోడీ ప్రభుత్వం నైజవాన్ నైకిసాన్ నినాదంతో పనిచేస్తున్నదని అన్నారు. అగ్నిపథ్ నిర్ణయంతో దేశ యువత గొంతు నొక్కాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నిర్ణయంపై ప్రజలు, మేధావులు, సబ్బండ వర్గాలు స్పందించాలని సుమన్ కోరారు. సికింద్రాబాద్ ఘటన దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే వ్యవస్థ కేంద్రం ఆధీనంలో ఉన్న విషయం తెలిసి కూడా సిగ్గు లేకుండా కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వ ఘటనగా చిత్రీకరిస్తున్నారని అన్నారు.

వెంటనే ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించు కోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామీణ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దెబ్బతీయకుండా, దేశ రక్షణకు పాటుపడాలని కోరారు.

దుర్మార్గపు, దరిద్రపు, చేతకాని, అసమర్థ ప్రభుత్వం ప్రధాని మోడీ ప్రభుత్వం అని దుయ్యబట్టారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చేది లేదు చచ్చేది లేదని, 16 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఊసేలేదన్నారు. కేంద్రం తెలంగాణ కు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో లెక్క తేల్చాలని డిమాండ్ చేశారు.

మోడీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు దేశ భద్రతకు పెను ముప్పుగా దాపరిస్తున్నాయని స్పష్టం చేశారు. ప్రధాని అదాని సంపాదన పెంచడానికే పని చేస్తున్నారని, నిత్యం అదాని సేవలో తరిస్తున్నారని అన్నారు. సికింద్రాబాద్ ఘటన పూర్తి బాధ్యత బీజేపీ ప్రభుత్వం వహించాలని డిమాండ్ చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like