మోదీ వ్యాఖ్య‌ల‌పై గ‌రం..గ‌రం..

హైదరాబాద్‌: పార్లమెంటు సాక్షిగా తెలంగాణ పోరాటంపై మోదీ చేసిన వ్యాఖ్య‌ల పట్ల టీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీ చీఫ్‌లు భ‌గ్గుమన్నారు. ప్ర‌ధాని మోదీ వెంట‌నే తెలంగాణ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

మోదీ వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ రాష్ట్ర స‌మితి, కాంగ్రెస్ పార్టీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. చాలా సంద‌ర్భాల్లో తెలంగాణ పోరాటాన్ని మోదీ త‌క్కువ చేసి మాట్లాడుతున్నార‌ని దుయ్య‌బ‌డుతున్నాయి. మరోసారి అవమానించిన ప్రధాని నరేంద్రమోదీ వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు డిమాండ్‌ చేశారు. ‘మిస్టర్‌ ప్రైమ్‌ మినిస్టర్‌.. ఇది కచ్చితంగా అవమానకరం. తెలంగాణ ప్రజల దశాబ్దాల స్ఫూర్తిదాయక పోరాటాన్ని, త్యాగాలను పదేపదే అవమానిస్తున్నారు. ప్రధాని చేసిన అసంబద్ధ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నాను’ ట్వీట్‌ చేశారు. ప్రధాని వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని టీఆర్‌ఎస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. అన్ని మండల, నియోజక వర్గాల కేంద్రాల్లో బీజేపీ దిష్టి బొమ్మలు దహనం చేయాలని, నల్ల జెండాలతో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని సూచించారు. గత ఏడేండ్లుగా తెలంగాణ పట్ల కేంద్రం చూపుతున్న వివక్షను ప్రజలకు వివరించాలని కోరారు.

అదే బాట‌లో కాంగ్రెస్ పార్టీ..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ భగ్గుమంది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తగులుతుందని తెలిసినా తెలంగాణలో ఆత్మహత్యలను ఆపేందుకు సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారని, ఇప్పుడు మోదీ తెలంగాణ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం తెలంగాణ పట్ల ఆయన వైఖరిని స్పష్టం చేశారని కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆయన దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్వంలో పలువురు విద్యార్థులు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు, ఎన్‌ఎస్‌యూఐ–బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ చొక్కా చిరిగిపోయి స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం బల్మూరి వెంకట్‌ మాట్లాడుతూ, దశాబ్దాల తెలంగాణ ప్రజల కలను నెరవేర్చిన సోనియాకు తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారని, మోదీ లాంటి నేతలు ఎంత అక్కసు వెళ్లగక్కినా తెలంగాణకు జరిగే నష్టమేమీ లేదన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like