మృతి చెందిన రెస్క్యూ టీమ్ సభ్యులకు కోటి రూపాయ‌లు ఇవ్వాలి

తెలంగాణ NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ డిమాండ్

ఆసిఫాబాద్ జిల్లా పెద్దవాగు రెస్క్యూ ఆపరేషన్లో మృతి చెందిన సింగరేణి రెస్క్యూ టీమ్ సభ్యులు రాము, సతీష్ కుటుంబాలకు ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని తెలంగాణ NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండల పెసరుకుంట గ్రామ పెద్దవాగు వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న సింగరేణి రెస్క్యూ బృందం స‌భ్యులు రాము,సతీష్ మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే.

జమ్మికుంట మండల మడిపల్లి గ్రామానికి చెందిన రాము పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంత‌రం వెంకట్ బల్మూరి మాట్లాడారు. సింగరేణి రెస్క్యూ టీమ్ కేవలం సింగరేణిలో జరిగే విప‌త్తుల కోస‌మే సంసిద్ధ‌మై ఉంటార‌ని అన్నారు. వారిని కేవ‌లం సింగ‌రేణి సంస్థ‌లో జ‌రిగే వాటికి త‌ప్ప బ‌య‌ట‌కు పంపించ‌వ‌ద్ద‌న్నారు. దానికి సంబంధించి స‌ర్క్యుల‌ర్ సైతం జారీ చేసింద‌ని కానీ వాటిని క‌నీసం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, అధికారులు అంబాల రాము, సతీష్ మృతికి కారణమ‌య్యార‌ని దుయ్య‌బ‌ట్టారు. వారి కుటుంబానికి తీరని అన్యాయం చేశారన్నారు. ప్రభుత్వం వెంటనే రాము, సతీష్ కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రకృతి విప్పత్తులు ఎదురైనప్పుడు కేవలం విప‌త్తు సహాయక చర్యల్లో నిష్ణాతులను మాత్రమే ఉపయోగించాలన్నారు. నియమాలను పాటించకపోవడం వల్ల ఇలాంటి దురదృష్టకర సంఘటనలకు దారి తీస్తుందని స్ప‌ష్టం చేశారు. ఇక ముందైనా ప్రభుత్వం,అధికారులు ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జ‌ర‌గ‌కుండా చూసుకోవాలన్నారు. రాము కుటుంబానికి తగిన న్యాయం జరిగేంత వరకు వారి పక్షాన‌ పోరాడుతానని వెంకట్ బల్మూరి తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like