మూడో దశ కట్టడికి చర్యలు

సింగరేణిలో కరోనా కట్టడికి అన్ని ఏరియాలు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యం వహించొద్దని సంస్థ డైరెక్టర్ (ఆపరేషన్స్) చంద్రశేఖర్, డైరెక్టర్ (పర్సనల్, ఫైనాన్స్, పి అండ్ పి) బలరామ్ జీఎంలను ఆదేశించారు. సోమవారం వారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటి రెండు దశల్లో కరోనా కట్టడికి విజయవంతంగా అవలంబించిన వ్యూహాన్ని ఇప్పుడు కూడా అమలు చేయాలన్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పొరుగు సేవల సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించాలన్నారు దీనితో వైరస్ సోకిన వారిని గుర్తించి వేరు చేయొచ్చన్నారు. తద్వారా వారికి చికిత్స అందించొచ్చని, కరోనా ప్రబలకుండా కట్టడి చేయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సింగరేణి వ్యాప్తంగా ఇప్పటి వరకు 913 యాక్టివ్ కేసులు ఉన్నాయని, అందులో382 మంది ఉద్యోగులు,415 మంది కుటుంబ సభ్యులు,116 మంది పొరుగు సేవల సిబ్బంది ఉన్నారని చెప్పారు. సింగరేణిలో ఉద్యోగులు, వారి కుటుంబీకులు, పొరుగు సేవల సిబ్బందికి వ్యాక్సినేషన్ వందశాతం విజయవంతం చేసారని గుర్తు చేశారు. ఇప్పుడు కరోనా బారిన పడుతున్న వారిలో వైరస్ తీవ్రత అంతగా లేదని చెప్పారు. అయినప్పటికీ కరోనా పట్ల అప్రమత్తంతో ఉండాలన్నారు. ఇది వ్యాపించకుండా చూడాలని కోరారు. కరోనా బారిన పడిన వారి కోసం ఆసుపత్రుల్లో అన్ని బెడ్లను సంసిద్ధం చేయాలన్నారు. క్వారంటైన్ కేంద్రాలను కూడా మళ్లీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా గనుల్లో పనిచేసే కార్మికులకు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడంపై గని మేనేజర్ల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు.
సమావేశంలో పాల్గొన్న జనరల్ మేనేజర్ (కో ఆర్డినేషన్) సూర్యనారాయణ మాట్లాడుతూ.. హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి అన్ని ఏరియాలకు కావాల్సిన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను, మందులను, హోం ఐసోలేషన్ కిట్లను, శానిటైజర్లను సమకూర్చుతున్నామని వివరించారు. ఏరియాలకు కావాల్సిన సామగ్రిని కోరితే తక్షణమే సమకూర్చుతామని వెల్లడించారు.

ఉద్యోగులకు వారం రోజుల ప్రత్యేక సెలవు..

కరోనా మొదటి రెండో దశల్లో వైరస్ సోకిన ఉద్యోగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా 14 రోజుల ప్రత్యేక సెలవును ఇచ్చామని, అయితే మూడో దశ లో కరోనా మార్గ దర్శకాలను కేంద్రం సడలించిందని డైరెక్టర్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సడలించిన మార్గదర్శకాలకు అనుగుణంగా కరోనా బారిన పడిన ఉద్యోగులకు వారం రోజుల ప్రత్యేక సెలవును మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏడు రోజుల ఐసోలేషన్ తర్వాత (అనారోగ్యం నుంచి కోలుకొని) ఉద్యోగులు విధుల్లోకి రావొచ్చన్నారు. కరోనా పరీక్షలు చేయించుకోనవసరం లేదని వివరించారు.
ఈ సమావేశంలో సింగరేణి భవన్ నుంచి జీఎం(స్ట్రాటెజిక్ ప్లానింగ్) జి.సురేందర్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ భాస్కర్, డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ బాలకోటయ్య, కొత్తగూడెం నుంచి జీఎం(పర్సనల్), వెల్ఫేర్, సీఎస్ఆర్ బసవయ్య, జీఎం(పర్సనల్), ఐఆర్, పీఎం అండ్ ఆర్సీ ఎ.ఆనందరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ మంథా శ్రీనివాస్ పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like