నైని నుండి ఉత్పత్తికి చర్యలు

సింగరేణి డైరెక్టర్ (ఫైనాన్స్‌) బలరామ్‌ ఒడిశా పర్యటన ఒడిశా ప్రభుత్వానికి నిధుల అందజేత

సింగ‌రేణి ప్ర‌తినిధి : ఒడిశాలో సింగరేణి చేపట్టిన నైనీ బ్లాక్‌ లో ఏప్రిల్‌ నుండి బొగ్గు ఉత్పత్తి నేపథ్యంలో రవాణాకు అవసరమైన ఏర్పాట్లను సింగరేణి చేపడుతోది. సంస్థ డైరెక్టర్ (ఫైనాన్స్‌) బలరామ్‌ సోమవారం సంబల్పూర్‌ పార్లమెంటు సభ్యులు గంగా దేవ్‌ నితేష్‌, కలెక్టర్‌ సిద్ధార్థ శంకర్‌ స్వేన్ ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా నైనీ బ్లాకు, న్యూ పాత్రపద బొగ్గు బ్లాకులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. జిల్లా కలెక్టర్‌ పూర్తి సానుకూలంగా స్పందించిన‌ట్లు డైరెక్ట‌ర్ వెల్ల‌డించారు. నైని బ్లాక్‌ నుండి మరో మూడు నెలల్లో బొగ్గు ఉత్పత్తి కానుంది. దీంతో ఇక్కడి నుండి సమీపంలోని మజీగా రైల్వే సైడింగ్‌ వరకు 35 కిలోమీటర్ల రోడ్డు నిర్మించేందుకు సంబంధిత శాఖకు తగు సూచనలు చేయాలని సంస్థ డైరెక్టర్‌ కోరారు. ఈ రోడ్డు నిర్మాణానికి అవసరమయ్యే నిధులను కూడా ఇటీవలనే రోడ్డు అథారిటీ శాఖకు చెల్లించామని స్ప‌ష్టం చేశారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే బొగ్గు రవాణాకు అనుకూలంగా ఉంటుందని వెల్ల‌డించారు. కలెక్టర్‌ దీనికి సానుకూలంగా స్పందించారు. డైరెక్టర్ బలరామ్‌ రోడ్డు అథారిటీ, సంబంధిత శాఖ అధికారులకు కూడా విజ్ఞప్తి చేశారు.

నైనీ బొగ్గు బ్లాకు కు కావాల్సిన అటవీ భూములను కేటాయిస్తూ కేంద్ర పర్యావరణ అటవీ శాఖల నుండి ఇప్పటికే అనుమతులు లభించాయని డైరెక్ట‌ర్లు స్ప‌ష్టం చేశారు. స్థానికంగా కేటాయించే 35 హెక్టార్ల ప్రభుత్వ భూమిని కూడా వెంటనే అప్పగించాలని కోరగా జిల్లా కలెక్టర్‌ను కోరారు. మరికొద్ది రోజుల్లో ఈ భూమిని కేటాయించడానికి ఏర్పాట్లు చేస్తామని ఆయ‌న హామీ ఇచ్చారు. మహానది కోల్‌ రైల్వేస్‌ లిమిటెడ్ రైలు మార్గం కోసం భూ సేకరణ వంటి విషయాల్లో సహకరించాలని డైరెక్టర్‌ విజ్ఞప్తి చేశారు. దీనికి కూడా జిల్లా కలెక్టర్‌ సిద్ధార్థ శంకర్‌ స్వేన్‌ పూర్తి సానుకూలంగా స్పందించిన‌ట్లు వెల్ల‌డించారు. తమ నుండి సింగరేణి కి పూర్తి సహాయ సహకారాలు అందుతాయనీ హామీ ఇచ్చిన‌ట్లు చెప్పారు.

సంబల్పూర్‌ ఎంపీ గంగా దేవ్‌ నితీష్‌ ను కూడా డైరెక్టర్‌ (ఫైనాన్స్‌) బలరామ్‌ కలిసి రైల్వే లైను, రోడ్డు నిర్మాణం పనులకు సహకారం అందించాలని కోరారు. దీనికి సైతం ఎంపీ పూర్తి సానుకూలంగా స్పందించిన‌ట్లు చెప్పారు. సింగరేణి సంస్థ తమ ప్రాంతం నుండి దేశ అవసరాల కోసం బొగ్గు తీయడం సంతోషకరమని, సింగరేణి సంస్థకు త‌న‌తో పాటు నియోజకవర్గ ప్రజలు పూర్తిగా సహకరిస్తారని వెల్ల‌డించారు. తన నియోజకవర్గంలో పలు పరిశ్రమలు రావడం తనకు ఆనందంగా ఉందన్నారు. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితో పాటు, సామాజిక బాధ్యతగా ప్రజలకు మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కూడా కృషి చేయాలని కోరారు.

ఈ సందర్భంగా డైరెక్టర్‌ (ఫైనాన్స్‌ ప్రాజెక్ట్స్‌ అండ్‌ ప్లానింగ్‌ మరియు పర్సనల్‌) బలరామ్‌ అంగూల్‌ లోని సింగరేణి కార్యాలయంలో నైనీ నుండి బొగ్గు ఉత్పత్తి ప్రణాళిక పై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. కార్య‌క్ర‌మంలో ఆయ‌న‌తో పాటు అడ్వయిజర్‌ (మైనింగ్‌) డి.ఎన్‌. ప్రసాద్‌, అడ్వయిజర్‌ (నైనీ) విజయరావు, జనరల్‌ మేనేజర్‌ (నైనీ) సురేష్‌, నైనీ ప్రాజెక్టు అధికారి ఆర్‌.పి.చౌదరి, కన్సల్టెంట్‌ (నైనీ) డి.నాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like