న‌ల్ల‌నేల‌లో స‌మ‌రానికి సై

=తాము సిద్ద‌మ‌ని ప్రభుత్వానికి లేఖ రాసిన సీఅండ్ఎండీ
-చివ‌ర‌గా 2017, అక్టోబరు 5న సింగరేణిలో గుర్తింపు ఎన్నికలు
-కాల ప‌రిమితి ముగిసినా ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ట్టించుకోలేదు
-జాతీయ కార్మిక సంఘాల పోరాటంతో దిగి వ‌చ్చిన యాజ‌మాన్యం
-ఇక న‌ల్ల నేల‌లో రాజుకోనున్న ఎన్నిక‌ల వేడి

మంచిర్యాల : సింగ‌రేణిలో ఎన్నిక‌ల వేడి రాజుకుంది. సింగరేణిలో ఎన్నికల నిర్వహణకు సంసిద్ధత తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వ ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీకి సింగరేణి సిఅండ్ఎండి శ్రీధర్ లేఖ రాశారు. సింగరేణిలో గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించాలని కొంతకాలంగా జాతీయ సంఘాలు పోరాటం చేస్తున్నాయి. అదే స‌మ‌యంలో టీబీజీకేఎస్ సైతం తాము ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మేన‌ని ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే కాల ప‌రిమితి ముగియ‌డంతో సంస్థ‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలోనే గురువారం యాజమాన్యం ఎన్నికలకు సంసిద్ధత తెలపడంతో వేడి రాజుకుంది. ఈ మేర‌కు అన్ని కార్మిక సంఘాలు పోరాటానికి సిద్ధమవుతున్నాయి.

నాలుగేళ్ల కాలపరిమితి ముగియడంతో గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలన్న ఒత్తిడి పెరిగింది.. దీంతో సింగరేణి యాజమాన్యం ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఇదివరకే కేంద్ర కార్మిక శాఖ కార్మిక సంఘాల వార్షిక నివేదికలను సమర్పించాలని కోరింది. ఏడాది కింద‌టే ప్రక్రియ మొదలైంది. అయితే సింగరేణి యాజమాన్యంతో పాటు ప్రభుత్వం నుంచి సానుకూలత లభించకపోవడంతో ఎన్నికలపై సందిగ్ధత నెలకొంది. 2017, అక్టోబరు 5న సింగరేణిలో గుర్తింపు ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలకు ముందు నాలుగేళ్ల కాలపరిమితితో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు కార్మిక సంఘాల అభిప్రాయాన్ని తీసుకుంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరం గెలిచిన టీబీజీకేఎస్‌కు రెండేళ్ల కాలపరిమితి మాత్రమేనని గుర్తింపు పత్రాన్ని 2018, ఏప్రిల్లో అందజేసింది.

గుర్తింపు సంఘం కోర్టును ఆశ్రయించినా.. చివరికి కాలపరిమితి నాలుగేళ్లు పూర్తయింది. 2017, అక్టోబరు 5న ఎన్నికలు నిర్వహించిన కేంద్ర కార్మిక శాఖ 2018, ఏప్రిల్లో గుర్తింపు పత్రం అందజేసింది. ఆ సమయం నుంచి 2022, ఏప్రిల్ నాటికి నాలుగేళ్లు పూర్తయింది. ఇటీవల ఆర్ఎల్సీ వద్ద నిర్వహించిన చర్చల్లో ఐదు జాతీయ కార్మిక సంఘాలతో పాటు టీబీజీకేఎస్‌ యాజమాన్యం ఒప్పందం చేసుకుంది. గుర్తింపు ఎన్నికలకు యాజమాన్యం సానుకూలంగానే ఉంది. కేంద్ర కార్మిక శాఖ కూడా ఎన్నికలు నిర్వహించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. దీంతో ఇదే నెల‌లో ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం టీబీజీకేఎస్కు కూడా అధికారికంగా అవకాశాలు దూరమవుతుండటంతో ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇటీవల 9 డిమాండ్లపై ఒప్పందం చేసుకోవడంతో వీటిపై అన్ని కార్మిక సంఘాలు తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాయి.

గుర్తింపు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండటంతో కార్మిక సంఘాలు గెలుపునకు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నాయి. జాతీయ కార్మిక సంఘాలతో పాటు టీబీజీకేఎస్‌, ఇతర విప్లవ కార్మిక సంఘాలు ఉనికి చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇదివరకే టీబీజీకేఎస్‌ మూడోసారి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసింది. ఇతర జాతీయ కార్మిక సంఘాలు కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న తమకే అవకాశం ఉంటుందన్న నమ్మకంతో కార్మికులకు అందుబాటులో ఉంటున్నాయి. కార్మికులకు ఏ చిన్న సమస్య వచ్చినా నేత‌లు అందుబాటులో ఉంటూ సేవలందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదివరకే జాతీయ కార్మిక సంఘాలు గనుల బాట నిర్వహించాయి. గనులు, జీఎం కార్యాలయాల వద్ద నిరసన దీక్షలు చేపట్టాయి. వీటి ద్వారా కార్మికులకు దగ్గరయ్యే అవకాశం ఉంటుందని జాతీయ కార్మిక సంఘాలు భావిస్తున్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like