నల్ల సూర్యులకు మసి పూసిన కేసిఆర్

- హామీలు ఇచ్చి క‌నీసం ప‌ట్టించుకోని ముఖ్య‌మంత్రి
- 27 ఫిబ్రవరి 2018 సింగరేణి చరిత్రలో బ్లాక్ డే
- త‌ప్పు చేసేది మీరు.. నింద‌లు మాపై నా..?
- బిజెపి జిల్లా అధ్యక్షులు వెర‌బెల్లి రఘునాథ్

మంచిర్యాల : సింగ‌రేణి కార్మికుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ మోసం చేశార‌ని బిజెపి జిల్లా అధ్యక్షుడు వెర‌బెల్లి రఘునాథ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శ‌నివారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ 27 ఫిబ్రవరి 2018 లో ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రగతి స్టేడియం లో జరిగిన కార్మికుల ఆత్మీయ సమ్మేళన సభలో అనేక హామీలు ఇచ్చార‌ని అన్నారు. ఇప్పటి వరకు ఆ హామీలు నెరవేర్చకపోవడం దారుణ‌మ‌న్నారు. ఆరు కొత్త బొగ్గు గనులకు శంకుస్థాపన చేసి 4,500 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఇప్పటి వరకు గనులు ప్రారంభించలేదన్నారు. కార్మికుల కోసం 10 వేల క్వార్టర్లు నిర్మాణానికి 400 కోట్ల రూపాయల కేటాయిస్తామని ఇప్పటి వరకు క్వార్టర్లు నిర్మాణం చేపట్టలేదని గుర్తు చేశారు. కార్మికుల ప్రతి ఇంటికి మంచి నీరు అందించడానికి మిషన్ భగీరథ ద్వారా అనుసంధానం చేస్తామని చెప్పి ఇప్పటి ఆ పని చేయలేదన్నారు.

ఉచిత కరెంట్, ఉచిత మంచినీరు అని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయలేదని వెల్ల‌డించారు. శ్రీరాంపూర్ లో 156 ఎకరాల్లో నివాసం ఉంటున్న సింగరేణి కార్మికులకు పట్టాలు అందజేస్తానని ఇప్పటి ఇవ్వ‌లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తక్కువ పెన్షన్ వస్తున్న రిటైర్డ్ కార్మికులకు పెన్షన్లు పెంచుతామని ఇప్పటి వరకు పెంచలేదన్నారు. 10లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలు అందజేస్తామని ఇప్పటి వరకు ఇవ్వ‌లేద‌ని ర‌ఘునాథ్ చెప్పారు. అలియాస్ పేర్లు మార్పుకు అవకాశం ఇస్తామని ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. మెడికల్ బోర్డు లో లంచాలు నివారణ చేస్తామని చెప్పి మెడికల్ బోర్డును అక్రమాల అడ్డాగా మార్చారని దుయ్య‌బ‌ట్టారు.

ఇచ్చిన హామీలు నెల రోజుల్లో నెరవేరుస్తామని చెప్పి నాలుగు సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా సింగరేణి కార్మికులు కేసీఆర్‌ మోసం చేశారన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులను తప్పుదోవ పట్టించడానికి కేంద్రంపై నిందలు వేస్తోంద‌న్నారు. ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ పట్టణ అధ్యక్షులు ఆగల్ డ్యూటీ రాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోనుగోటి రంగ రావు, సత్రం రమేష్, పిట్టల రవి, మిట్టపల్లి మొగిలి, పడాల సంజీవ్, సమ్రాజ్ రమేష్, డొంగరి లక్ష్మీ కాంత్, రంగం వేణు, మాడిషెట్టి మహేష్, కుర్రే చక్రి, తాడురి మహేష్, కర్ణ రణధీర్, సిరికొండ రాజు, భీమయ్య, డొంగరి శ్వేత తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like