సానుభూతికి త‌హ‌త‌హ‌

Chennur: కాంగ్రెస్ నేత వివేక్ ఎన్నికల్లో సానుభూతి కోసం ప్రయత్నాలు చేస్తున్నారా.? తనపై జరిగిన ఈడీ దాడులను పక్కదారి పట్టించేందుకు పావులు కదుపుతున్నారా..? ఎన్నికల్లో దాన్ని తనకు అనుకూల అంశంగా మార్చుకునేందుకు చూస్తున్నారా.? ఎనిమిది కోట్లు అకౌంట్ ట్రాన్స్ఫర్ నిజం.. అకౌంట్ ఫ్రీజ్ చేసింది వాస్తవం.. దానికి ఇంకొకరిపై ఆడిపోసుకోవడంలో ఆంతర్యం ఏంటి..? ఎన్నికల్లో లబ్ధి కోసం వేస్తున్న ఎత్తులు ఫలిస్తాయా.?

రాష్ట్రంలో చెన్నూరు నియోజకవర్గం స్పెషల్ అట్రక్షన్ గా నిలుస్తోంది. ఎన్నికల హడావిడి మొదలైనప్పటి నుంచి ఏదో ఒక అంశంతో ఈ నియోజ‌క‌వ‌ర్గంపై చర్చ కొనసాగుతోంది. తాజాగా, కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ఇంట్లో ఈడీ సోదాలు జరగడం రాష్ట్రంలో పతాక శీర్షకల‌కు ఎక్కింది. ఈడీ సోదాలను త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు వివేక్ తీవ్రంగా ప్ర‌యత్నిస్తున్నారు. ప్ర‌జ‌ల్లో సానుభూతి పొందేందుకు తన‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌చారంలో ఇదే అంశాన్ని ప్ర‌స్తావిస్తున్నారు. ఓ అడుగు ముందుకు వేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈడీ సోదాలతో తనకు మైలేజీ పెరిగిందని మీడియా సమావేశంలో ఊదరగొడుతున్నారు. పైగా బాల్క సుమన్కు ఓటమి భయం పట్టుకుందని సుమన్ ఫిర్యాదుతోనే తన ఇంటితో పాటు ఎనిమిది చోట్ల సోదాలు జరిగాయని ఆరోపిస్తూ గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు.

వివేక్ సంస్థల నుంచి విజిలెన్స్ ఎన్ ఫోర్స్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు చెందిన ఖాతాకి రూ. 8 కోట్ల డబ్బులు బదిలీ అయ్యాయి. ఇదేవిషయమై సుమన్ ఫిర్యాదు చేశారు. రెండు రోజుల్లో చెన్నూరుకు వివేక్ కంపెనీ ప్రతినిధులు తరలిస్తున్న రూ. 50 లక్షల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమకు వచ్చిన ఫిర్యాదు మేరకు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల్లో తమకు కొన్ని ఆధారాలు సైతం దొరికినట్లు ఈడీ వెల్లడించింది. దాంతో పాటు తప్పుడు సర్టిఫికెట్లతో బోగస్ కంపెనీ పెట్టారని ఆ సంస్థ స్పష్టం చేసింది. ఫెమా నిబంధనలు సైతం ఉల్లంఘినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ అంశం నుంచి చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ సానుభూతి పొందే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా తాను బీజేపీ నుంచి వచ్చాను కాబట్టే తనపై దాడులు జరుగుతున్నాయని ఆయన జనాలకు చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పై సైతం ఆరోపణలు గుప్పిస్తున్నారు.. తన అరెస్టు జరిగినా జరగొచ్చని, మీరంతా నా వెంట ఉండాలని వివేక్ చెబుతున్నారు. అయితే, ఈ వ్య‌వ‌హారంలో వివేక్ చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు ప‌ర‌స్ప‌ర విరుద్ధంగా ఉన్నాయ‌ని ప‌లువురు స్ప‌ష్టం చేస్తున్నారు. ఆయ‌న విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతున్న‌ది ఒక‌టి, ప్ర‌జ‌ల‌కు చెబుతున్న‌ది మ‌రోర‌కంగా ఉంది. దీంతో అస‌లు వాస్త‌వం ఏమిట‌నే దానిపై సందేహాలు నెల‌కొన్నాయి.

వివేక్ మొదట విజిలెన్స్ ఎన్ ఫోర్స్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో తనకు సంబంధం లేదని కొట్టి పారేశారు. ఆ త‌ర్వాత బాల్క సుమన్ విలేక‌రుల స‌మావేశం పెట్టారు. ఆ స‌మావేశం తర్వాత వివేక్ త‌న మాట మార్చారు. ఆ కంపెనీ అమెరికాలో ఉన్న తన స్నేహితుడి కంపెనీ అని తానే చూసుకుంటున్నానని చెప్పారు. తాను వేల కోట్ల టాక్స్ క‌ట్టాన‌ని చెప్పిన వివేక్ ఆస్తులు మాత్రం రూ. 600 కోట్లు మాత్ర‌మే చూపించారు. అదే స‌మ‌యంలో ఈటెల రాజేంద‌ర్‌కు రూ. 27 కోట్లు అప్పు ఇచ్చిన అని చెప్పిన వివేక్ ఎన్నిక‌ల అఫిడ‌విట్లో చెప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇలా ఆయ‌న చెప్పిన దానికి, చేసిన పొంత‌న లేక‌పోవ‌డం అనుమానాల‌కు తావిస్తోంది.

ఇక‌, ఈడీ దాడుల‌కు సంబంధించి సైతం ఇప్పుడు త‌న అరెస్టు జ‌రుగుతుంద‌ని చెప్పుకొస్తున్నారు. కానీ, ఎన్నిక‌ల్లో పాల్గొంటున్న అభ్య‌ర్థుల‌ను అరెస్టు చేసే అవ‌కాశం ఉండ‌దు. దీనికి సంబంధించి ఏకంగా సుప్రీం కోర్టు ఆదేశాలు సైతం ఉన్నాయి. ఇలాంటి స‌మ‌యంలో ఆయ‌న ప్ర‌జ‌ల్లో త‌న అరెస్టుకు సంబంధించి చేస్తున్న ప్ర‌చారం కూడా కేవ‌లం సానుభూతి కోస‌మేన‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న చేస్తున్న ప్ర‌చారాన్ని ప్ర‌జ‌లు ఆద‌రిస్తారా..? లేక తిర‌స్క‌రిస్తారా..? అనేది కొద్ది రోజుల్లో తేల‌నుంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like