ముఖ్య‌మంత్రిపై వీడ‌ని సందిగ్ధ‌త

ఢిల్లీకి డీ కే శివకుమార్

Telangana: తెలంగాణ కొత్త ముఖ్య‌మంత్రి ప్ర‌మాణ స్వీకారం వాయిదా ప‌డింది. వాస్త‌వానికి ఆయ‌న ప్ర‌మాణ స్వీకారం సోమ‌వారం సాయంత్రం ఎనిమిది గంట‌ల‌కు ఉంటుంద‌ని అంతా భావించారు. దానికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు సైతం చేశారు. రాజ్ భవన్‌లోని దర్బార్ హల్‌లో సీఎంతో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు జీఏడీ (జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్) నుంచి గవర్నర్ కార్యాలయానికి సమాచారం అందింది. కాగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న దర్బార్ హాల్‌లో 300 మంది కూర్చునే వెసులుబాటు కల్పించారు. మిగిలిన ఆహ్వానితులకు ఎక్కడ ఏర్పాట్లు చేయాలనే అంశంపై జీఏడీ అధికారుల కసరత్తు చేస్తున్నారు.

అయితే, అనూహ్యంగా దానిని వాయిదా వేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థిపై కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికీ ఒక నిర్ణయానికి రాలేదు. సీఎల్పీ భేటీలో నిర్ణ‌యం తీసుకున్న ఎమ్మెల్యేలు ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి నిర్ణ‌యం పూర్తిగా అధిష్టానికే అప్ప‌గించారు. హైదరాబాద్ హోటల్ ఎల్లాలో సీఎల్పీ సమావేశం జరిగ్గా అందులో ఏక‌వాక్య తీర్మానం చేసి పంపించారు. ఈ సమావేశంలోనే సీఎల్పీ నేతను ఎన్నుకుంటారని చెప్పినా, అది జరగలేదు

ప‌లువురు కాంగ్రెస్ సీనియ‌ర్ల‌తో చ‌ర్చించి, 64 మంది ఎమ్మెల్యేల వ్యక్తిగతఅభిప్రాయం తీసుకున్న త‌ర్వాత డీకే శివకుమార్ ఎల్లా హోటల్ నుంచి ఢిల్లీకి వెళ్లిపోయారు. ఆయనతో పాటు మరో నలుగురు ప‌రిశీల‌కులు కూడా ఉన్నారు. డీకే శివ‌కుమార్‌తో మాట్లాడిన అనంత‌రం భట్టి, ఉత్తమ్‌, శ్రీధర్‌బాబు హోటల్‌ నుంచి వెళ్లిపోయారు. దీంతో రేవంత్‌రెడ్డి ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిత్వం విష‌యంలో వీరు ఏమైనా అలిగారా..? లేక ఇంకేదైనా ఉందా..? అనే సందేహాలు నెల‌కొన్నాయి. కాసేపట్లో సోనియా ఇంట్లో పార్టీ స్ట్రేటజీ కమిటీ భేటీ కానుంది. వీరితో చర్చించిన అనంతరం సీఎంపై అధికారిక ప్రకటన చేసే అవకాశముంది. ఆ భేటీలోనే సీఎల్పీ నాయకుడిని నిర్ణయిస్తారని సమాచారం అందుతోంది. అయితే, ఢిల్లీలో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ మాత్రం నెల‌కొంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like