నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా పుస్త‌కాల అమ్మ‌కాలు : అడ్డుకున్న విద్యార్థి సంఘం నేత‌లు

నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా పాఠ‌శాల‌ల్లో పుస్త‌కాల‌ను అమ్ముతుండ‌గా విద్యార్థి సంఘం నేత‌లు అడ్డుకున్నారు. ఇంత జ‌రుగుతున్నా విద్యాశాఖ అధికారులు క‌నీసం ప‌ట్టించుకోక‌పోవ‌డం ప‌ట్ల వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

మంచిర్యాల జిల్లాలో అక్ర‌మంగా పుస్త‌కాల విక్ర‌యాలు సాగుతున్నాయి. వీటిపై ప్ర‌భుత్వం ఎన్నో మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసినా ప్రైవేటు పాఠ‌శాల‌లు వాటిని క‌నీసం ప‌ట్టించుకోవ‌డం లేదు. దీనిపై దృష్టి సారించాల్సిన విద్యాశాఖ అధికారులు క‌నీసం అటువైపు క‌న్నెత్తి కూడా చూడ‌టం లేద‌ని ప‌లువురు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. పిల్ల‌ల‌కు మంచి విద్య‌ను అందించి వారిని ఉన్న‌తంగా తీర్చిదిద్దాల‌ని క‌ల‌లు కంటున్న త‌ల్లిదండ్రుల ఆశ‌ను ఆస‌రాగా చేసుకుని ప్రైవేటు విద్యా సంస్థ‌లు అడ్డ‌గోలుగా సంపాదిస్తున్నాయి.

విద్యార్థులకు కావాల్సిన స్టేషనరీ, పాఠ్య పుస్తకాలను ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా అధిక ధరలకు పాఠశాలల్లోనే విక్రయిస్తున్నారు. పిల్లలకు ఉపయోగపడే పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, టై, బెల్ట్, యూనిఫామ్స్, స్టేషనరీ, పెన్స్, పెన్సిల్స్, రబ్బర్స్ పాఠశాలల్లో అమ్ముతున్నారు. దీంతో ప్రైవేట్ పాఠశాలల కంటే కిరాణా కొట్టులే నయమని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా విద్యాశాఖాధికారులు మాత్రం తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య హై స్కూల్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలను అధిక ధ‌ర‌ల‌కు అమ్ముతున్నారు. విష‌యం తెలుసుకున్న విద్యార్థి సంఘం నాయ‌కులు పాఠ‌శాల ముందు ధర్నా కు దిగారు. ఈ సందర్బంగా విద్యార్థి సంఘం నాయకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రైవేటు పాఠ‌శాల‌లు పుస్తకాల పేరుతో దోపిడికి పాల్పడుతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అధికారులు ప్రైవేట్ పాఠశాలలను తనిఖీ చేయ‌కుండా చోద్యం చూస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. దీంతో ప్రైవేటు పాఠ‌శాల‌ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని విమర్శించారు. ఫీజులు కూడా అడ్డ‌గోలుగా వ‌సూలు చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు చొరవ తీసుకుని చర్యలు చేపట్టాలని వారు కోరారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like