నిలకడ లేదు… దారెటు…?

-ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు వివేక్ వెంక‌ట‌స్వామి య‌త్నాలు
-మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌పై దృష్టి
-ఎక్క‌డి నుంచి పోటీ చేయాల‌నే దానిపై మ‌ల్ల‌గుల్లాలు
-ఈసారి స‌రైన నిర్ణ‌యం తీసుకోక‌పోతే రాజ‌కీయంగా ఇబ్బందులే

‘రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవు’ అనేది జగమెరిగిన సత్యం. అతి విశ్వాసం, నిలకడ లేని నిర్ణయాలతో మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ అదే పని చేస్తున్నారని అనిపిస్తుంది. అంగ బలం, అర్ద బలం ఉన్నా సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో ఆయన రాజకీయ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పుడు ఆయన చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో మూడు నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు.

వివేక్ వెంకటస్వామి… కాకా తనయుడిగా ఆయనకు ఎంతో పేరుంది. అయితే ఆయన సరైన సమయంలో సరైనా రాజకీయ నిర్ణయాలు తీసుకోకపోవడంతో బోర్లా పడుతున్నారు. తుది వరకు కాంగ్రెస్వాదిగా, ఇందిర కుటుంబానికి విశ్వాసపాత్రుడిగా ఎన్నో పదవులు అలంకరించిన గడ్డం వెంకటస్వామి వారసుడిగా పదిహేను సంవత్సరాల కిందట రాజకీయాల్లోకి వచ్చిన వివేక్ ఇప్పటికీ తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. రాజకీయంగా ఉన్నత స్థాయి పదవుల్లో ఉండాలనే ఆలోచనతో ఎప్పటికప్పుడు కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు వికటించి అసలుకే ఎసరు తెచ్చాయి.

కాంగ్రెస్ పార్టీ తరఫున 2009లో పెద్దపల్లి ఎంపీగా విజయం సాధించిన వివేక్ తెలంగాణ ఉద్యమం ఎగిసిపడుతున్న దశలో కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన తరువాత సరిగ్గా 2014 ఎన్నికల ముందు తిరిగి కాంగ్రెస్లోకి వెళ్లారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని సోనియాగాంధీ చేసిన ప్రకటనకు ఆకర్షితుడై టీఆర్ఎస్ వీడినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.

అయితే పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి విద్యార్థి నాయకుడిగా పోటీ పడ్డ బాల్క సుమన్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. 2014లో తొలి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కేసీఆర్తో సఖ్యతతో మెలిగిన ఆయన 2017లో సింగరేణి ఎన్నికలకు ముందు మరోసారి టీఆర్ఎస్లో చేరారు. 2018లో అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఆయన పోషించిన పాత్ర వివాదాస్పదమైంది. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే… అనే ఆలోచనతో టీఆర్ఎస్లోనే ఉంటూ పలువురు కాంగ్రెస్ అభ్యర్థులకు ఆర్థిక సాయం చేశారనేది ఆరోపణ. ప్రస్తుతం మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురితోపాటు పెద్దపల్లి, చెన్నూరు, మంథని, రామగుండం, మంచిర్యాల నియోజకవర్గాలలో సిట్టింగ్ అభ్యర్థుల ఓటమికి పనిచేశారని ఆరోపణ. మంథని, రామగుండం సీట్లు టీఆర్ఎస్ కోల్పోవడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూర్చింది.

ఆ తర్వాత పరిణామక్రమంలో ఆయన బీజేపీలో చేరారు. గత ఎన్నికల్లో ఆయనకు పెద్దపల్లి ఎంపీ టిక్కెట్టు ఇచ్చేందుకు భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చింది. పార్టీ ఎస్.కుమార్ పేరును పెద్దపల్లి అభ్యర్థిగా ప్రకటించినా, వివేక్ కోసం రెండు రోజులు బీఫారం ఇవ్వకుండా ఆపింది. పార్టీ జిల్లా, రాష్ట్ర నాయకులు ఎంత నచ్చచెప్పినా, పోటీ చేసేందుకు వివేక్ ఒప్పుకోలేదు. ఆ ఎన్నికల్లో బీజేపీ నాలుగు స్థానాల్లో గెలిచింది. అన్నింటికన్నా ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో పెద్దపల్లి చుట్టున్న కరీంనగర్,ఆదిలాబాద్,నిజామాబాద్ ఎంపీ స్థానాలను గెలవడం. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఉంటే టీఆర్ఎస్ మోసం చేసిందనే సానుభూతితో పాటు మోదీ హవా, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రభావం కూడా పెద్దపల్లిపై పడేవని వివేక్ గెలిచి ఉండేవారని పలువురు చెబుతున్నారు.

ఇప్పుడు వివేక్ వెంక‌ట‌స్వామి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌నే ఆలోచ‌న‌లో ఆయ‌న త‌ల‌మున‌క‌లు అయ్యారు. త‌న అనుచ‌ర‌వర్గం నుంచి పూర్తి స్థాయిలో స‌మాచారం తెప్పించుకున్న వివేక్ మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌పై క‌న్నేశారు. ఆయ‌న ధ‌ర్మ‌పురి, చెన్నూరు, బెల్లంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏదో ఒక దాని నుంచి పోటీ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌న‌ ప్ల‌స్‌,మైన‌స్‌పై చ‌ర్చిస్తున్నారు. అదే స‌మ‌యంలో పార్టీకి ఉన్న బ‌లం గురించి కూడా తెలుసుకుంటున్నారు. ఈ మ‌ధ్య కాలంలో ధ‌ర్మ‌పురి నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్కువ ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. అక్క‌డ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న నేప‌థ్యంలో అక్క‌డ నుంచి పోటీపై ఆయ‌న మొగ్గు చూపుతున్న‌ట్లు తెలుస్తోంది.

చెన్నూరులో త‌న చిర‌కాల ప్ర‌త్య‌ర్థి విప్ బాల్క సుమ‌న్ తో పోటీ ఎక్కువ‌గానే ఉండే అవ‌కాశం ఉంది. దీంతో అక్క‌డ నుంచి బ‌రిలో ఉండే అవ‌కాశాల త‌క్కువ‌ని ఆయ‌న అనుచ‌రులే చెబుతున్నారు. ఇక మిగిలింది బెల్లంప‌ల్లి… ఇక్క‌డ దుర్గం చిన్న‌య్య‌పై అయితే ఈజీగా గెల‌వ‌చ్చ‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి వివేక్ సొంత అన్న వినోద్ పోటీ చేసేందుకు సిద్ధం చేసుకున్నారు. ఆయ‌న‌ను పోటీలో నుంచి త‌ప్పించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. తాను కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తాన‌ని వినోద్ ఖ‌రాఖండిగా చెప్ప‌డంతో ఏం చేయాల‌నే విష‌యంలో ఆలోచిస్తున్నారు. అన్న‌ను త‌ప్పించి తాను బెల్లంప‌ల్లి బ‌రిలో ఉంటే ఖ‌చ్చితంగా గెలుపు ఖాయ‌మ‌ని వివేక్‌ భావిస్తున్నారు. అక్క‌డ ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య‌పై వ్య‌తిరేక‌త‌, ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త వెర‌సి త‌న విజ‌యం న‌ల్లేరు మీద న‌డ‌క అని వినోద్ పావులు క‌దుపుతున్నారు.

ఇలా అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శ‌ని అన్న‌ట్లు వేల కోట్ల అధిప‌తి, పెద్ద ఎత్తున అనుచ‌ర‌గ‌ణం ఉన్న‌ప్ప‌టికీ రాజ‌కీయంగా స‌రైన నిర్ణ‌యాలు తీసుకోక బొక్కాబోర్లా ప‌డుతున్నారు. ఇప్ప‌టికైనా ఆయ‌న స‌రైన నిర్ణ‌యం తీసుకుని గెలిస్తే రాజ‌కీయ భ‌విష్య‌త్ ఉంటుంద‌ని, లేక‌పోతే మ‌రోసారి పోటీ చేసే అవ‌కాశం రాక‌పోవ‌చ్చ‌ని ప‌లువురు చెబుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like