నిజామాబాద్ ఆస్ప‌త్రి ఘ‌ట‌న నిజం కాదు..

-ఆ ఘ‌ట‌న జ‌రిగింది ఈ రోజు కాదు
-పేషెంట్‌ను ఈడ్చుకువెళ్లింది ఆసుప‌త్రి సిబ్బంది కాదు
-వీల్‌చైర్ అందుబాటులో ఉన్నా నేల‌పై లాక్కువెళ్లారు
-పూర్తి వీడియో విడుద‌ల చేసిన ఆసుప‌త్రి సూపరిండెంట్ ప్రతిమ రాజ్

Nizamabad Government Hospital: నిజం గ‌డ‌ప దాటేలోపు.. అబ‌ద్దం ప్ర‌పంచాన్ని చుట్టి వ‌స్తుంద‌ని చెప్ప‌డానికి ఈ ఘ‌ట‌న ప్ర‌త్య‌క్ష సాక్ష్యం. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక వ్యక్తి కాళ్లు ప‌ట్టుకుని లాగుతూ తీసుకెళ్లిన వీడియో సోషల్ మీడియాలో ప్రచారం అయ్యింది. సిబ్బంది అమాన‌వీయ ఘ‌ట‌న‌కు ప్ర‌తీక‌గా నిలిచింద‌ని ఆసుప‌త్రి సిబ్బంది నిర్ల‌క్ష్యం స్ప‌ష్టం క‌నిపిస్తోంద‌ని ప‌లువురు పోస్టులు చేశారు. పేషెంట్‌ను ఆసుప‌త్రి సిబ్బంది ఈడ్చుకువెళ్లార‌ని, వీల్‌చైర్ లేక‌పోవ‌డంతో దారుణం చేశార‌ని ఆరోపించారు. ఈ వీడియో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల, సోషల్ మీడియా గ్రూపుల్లో వీడియో పోస్ట్ చేసి వైరల్ చేశారు.

వెంట‌నే మంత్రి హరీశ్ రావు స్పందించారు. నిజానిజాలు విచారించి, నివేదిక అందజేయవలసిందిగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‎కు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేప‌థ్యంలో వీడియోకు సంబంధించి నిజాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఈ సంఘటన ఏప్రిల్ 1న జరిగింది. ఆ వ్య‌క్తి కాళ్లు ప‌ట్టుకుని ఈడ్చుకుని పోయింది ఆసుప‌త్రి సిబ్బంది కాదు.. పెషేంట్ తాలూకు బంధువులు అని వెల్ల‌డైంది. ఆసుప‌త్రి సూపరిండెంట్ ప్రతిమ రాజ్ ఘ‌ట‌న‌కు సంబంధించి వివరాలు వెల్ల‌డించారు.

వీడియోలో ఉన్నవ్యక్తిని అతని తల్లిదండ్రులు మార్చి 31 రాత్రి 10.00 గంటలకు అస్వస్థతగా ఉన్నాడని అత్యవసర విభాగానికి తీసుకొనివచ్చారని చెప్పారు. అప్పటికే అతను మద్యం మత్తులో ఉన్నట్లు తెలిపారు. అక్కడ ఉన్న వైద్యులు అతన్ని పరీక్షించి, ఇతర సమస్యలు ఉన్నాయని గుర్తించి, సైకియాట్రిస్టుకు చూపించాలని డాక్టర్లు సూచించినట్లు వెల్ల‌డించారు. ఆ తర్వాత పేషెంట్ కేర్ సిబ్బంది ఆ వ్యక్తిని వీల్ చైర్‎లో కూర్చోబెట్టి, కాజువాలిటీలో బెంచ్ పైన కూర్చోబెట్టి వెళ్లినట్లు తెలిపారు. ఉదయం సుమారు 11.08 ఓపీ చిట్టి తీసుకుని 2వ అంతస్తుకు వెళ్ళవలసి ఉండగా, పేషెంట్ కేర్ సిబ్బంది చక్రాల కుర్చీ తీసుకొచ్చే లోపు లిఫ్ట్ రావ‌డంతో అతని తల్లిదండ్రులు ఆ వ్యక్తిని లాగుతూ లిప్ట్‎లో పై అంతస్తుకు తీసుకెళ్లారు.

దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీ ఆమె విలేక‌రుల‌కు చూపించారు. అందులో వీల్‌చైర్ ప‌క్క‌నే ఉన్నా, దానిని ప‌ట్టించుకోకుండా పేషెంట్ బంధువులు కాళ్లు ప‌ట్టుకుని లాగుతూ లిఫ్ట్‌లోకి తీసుకుపోయిన దృశ్యాలు క‌నిపించాయి. పూర్తి అవగాహన లేకుండా, పూర్తి సమాచారం లేకుండా ఇలాంటి వీడియోలు తీసి ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పోగొట్టవద్దని, దుష్ప్రచారాలు చేయడం చాలా బాధాకరమని ఆసుప‌త్రి సూపరిండెంట్ ప్రతిమరాజ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నిరుపేదలకు విశిష్ట సేవలందిస్తూ రాష్ట్రంలోనే పేరు తెచ్చుకున్న నిజామాబాద్ జీజీహెచ్ పై తప్పుడు వార్తలు రావడం బాధాకరమని అన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like