ఒమిక్రాన్‌కు ఆనంద‌య్య మందు.. మరో వివాదం..  

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌కు కూడా త‌న వద్ద మందు ఉంద‌ని చెబుతున్నారు… నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య. క‌రోనా సెకండ్ వేవ్ సంద‌ర్భంగా అప్పట్లో ఆనందయ్య ఇచ్చిన ఆయుర్వేద మందు విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని.. ఆయుష్ను రంగంలోకి దింపింది. మూడు వారాలు శోధించి.. దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక చుక్కల మందు విషయంలో మాత్రం ఇప్పటికీ సందిగ్థత కొనసాగుతోంది.

ఇప్పుడు మరో వేరియెంట్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. అదే ఒమిక్రాన్.  దీనిపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే.. దీనిని కూడా తాను 48 గంటల్లోనే అరికడతానంటూ.. ఆనందయ్య మరోసారి ముందుకు వచ్చారు. ఒమిక్రాన్ వేరియంట్ అయినా మరే ఇతర ప్రమాదకర వేరియంట్ అయినా తన మందు ముందు తలొంచాల్సిందేనంటారు ఆనందయ్య. ఒమిక్రాన్ మందుతో 48 గంటల్లో దాన్ని పూర్తిగా తగ్గించేస్తానని చెప్పారు. దీంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఒమిక్రాన్ గురించి ఇంకా వైద్యులకే పూర్తిగా తెలియదు వారి దగ్గరే సరైన సమాధానం లేదు. ఆనందయ్య మాత్రం ఒమిక్రాన్ కి మందు కనిపెట్టానంటున్నారు. ఆయుష్ విభాగం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. ప్రపంచస్థాయి మేధావులకే ఒమిక్రాన్ అంతు బట్టడం లేదని ఆనందయ్య ఎలా అరికడతారనేది.. ఆయుష్ ప్రశ్న.

ఆయుష్ విభాగం కమిషనర్ రాములు ఒక ప్రకటన చేశారు. ఆనందయ్య మందు విషయంలో స్వయంగా ఆయన కానీ.. ప్రభుత్వం నుంచి కానీ.. తమకు ఎలాంటి సూచనలు అందలేదని.. పేర్కొన్నారు. తమకు పరీక్షల కోసం.. పంపిస్తే.. దానిని పరీక్షిస్తామని కూడా అంటున్నారు.  ఒమిక్రాన్ కు మందు కనిపెట్టామని ప్రచారం చేసుకుంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. కానీ తమను ఆనందయ్య సంప్రదించలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆనందయ్య మందుపై మరోసారి వివాదం తెరమీదికి వచ్చే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. మరి ఇది ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like