పాయల్ పయనమెటు..

-ఆయన వెళ్తారా..? బలవంతంగా పంపిస్తారా..?
-కొద్ది రోజులుగా ఆయన వైఖరిపై గుర్రుగా ఉన్న అధిష్టానం
-శంకర్ పార్టీ వీడటం ఖాయమనే సంకేతాలు

ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు బీజేపీ ఆదిలాబాద్ జిల్లా అధ్య‌క్షుడు పాయల్ శంకర్ పేరు హాట్ టాపిక్ గా మారింది. కొద్ది రోజులుగా రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆయ‌న పేరు మారుమోగుతోంది. ఎన్నో ఏండ్ల రాజ‌కీయ అనుభవం ఉన్న ఆయ‌న ఇప్పుడు గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర్కొంటున్నారు. కొంత దూకుడు స్వ‌భావం, మ‌రికొంత ఆయ‌న అనుచ‌రులు, బంధువుల వ్య‌వ‌హార శైలి వ‌ల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. ఇప్పుడు ఏకంగా పార్టీ వీడే ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

పాయ‌ల్ శంక‌ర్ దూకుడు స్వభావం ఉన్న నేత‌. ఆ దూకుడే ఇప్పుడు ఆయ‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ కు గొడ్డ‌లి పెట్టుగా మారింద‌న రాజ‌కీయ ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. కొద్ది రోజులుగా జ‌రుగుతున్న వ్య‌వ‌హారాల‌ను ప‌రిశీలిస్తే అది నిజ‌మ‌నే అనిపిస్తుంది. గ‌తంలో టీడీపీలో ప‌నిచేసిన పాయ‌ల్ శంక‌ర్ బీజేపీలో చేరి అధ్య‌క్ష ప‌ద‌వి చేప‌ట్టారు. అయితే ఆయ‌న వ్య‌వ‌హార శైలిపై మొద‌టి నుంచి పార్టీలో అసంతృప్తి ఉంది. ఆయ‌న మున్సిప‌ల్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా టిక్కెట్ల కేటాయింపు వ్య‌వ‌హారంలో అవ‌క‌త‌క‌వ‌ల‌కు పాల్ప‌డ్డార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. గెలుపు గుర్రాల‌కు కాకుండా వేరే వాళ్లకి టిక్కెట్టు ఇచ్చి పరోక్షంగా అధికార పార్టీకి సహకరించారని ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఈ విష‌యంలో ఆ పార్టీ నేత సుహాసిని రెడ్డి ఏకంగా ఆందోళ‌న నిర్వ‌హించారు.

ఆయ‌న ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం డబ్బులు సైతం తీసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇలా ఆయ‌న వ్య‌వ‌హార‌శైలిని గ‌మ‌నించిన బీజేపీ అధిష్టానం పాయ‌ల్ శంక‌ర్‌ను ఢిల్లీకి పిలిపించుకుంది. జ‌రిగిన ప‌రిణామాలు అన్నింటిని ఆయ‌న‌కు వివ‌రించి పార్టీ ప‌ద‌వి నుంచి తొల‌గిస్తే బాగుండ‌ద‌ని, బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఆదేశించింది. అయితే పార్టీకి అందిన నివేదిక సరికాదని చెప్పిన పాయ‌ల్ శంక‌ర్ తాను త‌ప్పేమీ చేయ‌లేద‌ని వారికి న‌చ్చ‌జెప్పేందుకు ప్ర‌య‌త్నించారు. కొంతకాలం ఆలోచించుకోమని పార్టీ పెద్ద‌లు స్ప‌ష్టం చేయ‌డంతో ఆయ‌న వెన‌క్కి వ‌చ్చారు. వ‌చ్చీ రావ‌డంతోనే పార్టీ ప‌రంగా ఆయ‌న దూకుడు పెంచారు. కార్యక్రమాల ప‌రంగా, రాజకీయంగా తన అస్తిత్వ పోరాటానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

అయితే ఆయ‌న నిర్వ‌హించిన ప్ర‌తీ కార్య‌క్ర‌మం ఏదో ఒక వివాదానికి దారి తీసింది. ఆయా కార్యక్రమాలకు సంబంధించి వివాదాలు, పోలీసుల పట్ల దురుసు ప్రవర్తన మొదటికే మోసానికి వచ్చింది. ఆయన, అనుచరలు, కుటుంబీలపై పెద్ద ఎత్తున పార్టీకి ఫిర్యాదులు వెళ్లాయి. రెండు నెలల కిందట మున్సిపల్ సమస్యలపై ముట్టడి సందర్భంగా ఏకంగా పోలీసు వాహనాలపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. ఆయన కొడుకు బన్నీ, వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్, పద్మావర్ రాకేష్, రవీందర్ నలుగురిపై పీడీ యాక్టు కేసులు నమోదు అయ్యాయి.

ఇక జైనథ్లో కార్యకర్తకు అరెస్టుకు సంబంధించి పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టిన పాయల్ శంకర్.. మహిళా ఎస్ఐ అనే గౌరవం లేకుండా.. అది.. ఇదీ అని దూషించడమే కాకుండా పత్రికల్లో రాయలేని పదాలతో తిట్టడం విమర్శలకు కారణమైంది. దీన్ని పోలీస్ సంక్షేమ సంఘం ఖండించింది. తాజాగా ఎంపీ ఇంట్లో జ‌రిగిన ఘ‌ట‌న సైతం సంచ‌ల‌నం సృష్టించింది. ఈ ఘ‌ట‌న‌ల‌ను అన్నింటిని ఎప్ప‌టిక‌ప్పుడు టీఆర్ఎస్ నేత‌లు సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేస్తూ వ‌చ్చారు. ఇలా ప్ర‌తి కార్య‌క్ర‌మం భార‌తీయ పార్టీకి త‌ల‌నొప్పి వ్య‌వ‌హారంలా మారింది. ఈ నేప‌థ్యంలో అధిష్టానం మ‌రోమారు సీరియ‌స్ అయిన‌ట్లు స‌మాచారం.

అయిత్ పాయ‌ల్ శంక‌ర్ సైతం త‌న ప్ర‌య‌త్నాల్లో తానున్నారు. ఒక‌వేళ బీజేపీ నుంచి బ‌య‌ట‌కు వెళ్తే ఏం చేయాలి అని ఆయ‌న ముందుగానే అన్ని సిద్ధం చేసుకున్న‌ట్లు స‌మాచారం. ఢిల్లీలో వార్నింగ్ ఇచ్చిన తర్వాత బీజేపీ కార్యక్రమాల ఆక్టవిటీస్ పెంచుతూనే వేటు తప్పదనే భావంతో బీఎస్‌పీ పార్టీ కార్యక్రమాల్లోనూ ఆయన చురుకుగ్గా పాల్గొన్నారు. తనకు సంబంధించిన తన అనుచరుడిన్ని అందులో కీల‌కంగా ఉంచుతూ ముందుకు సాగారు. మ‌రోవైపు నాలుగు నెల‌ల కింద‌ట ఆయ‌న ఓ పార్టీ ముఖ్య‌నేత‌ను క‌లిసి అందులోకి వ‌చ్చేందుకు త‌న సంసిద్ధ‌త‌ను తెలిపారు. త‌న‌కు టిక్కెట్టు ఇస్తే వెళ్లేందుకు సిద్ధ‌మ‌య్యారు. అయితే అక్క‌డ నుంచి స్ప‌ష్ట‌మైన హామీ రాక‌పోవ‌డంతో సైలెంట్ అయ్యారు. ఒక‌వేళ భార‌తీయ జ‌న‌తా పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్తే ఖ‌చ్చితంగా బీఎస్పీలోకే వెళ్తార‌నే ప్ర‌చారం సాగుతోంది.

మ‌రి ఇప్పుడు భార‌తీయ జ‌న‌తా పార్టీ ఏం చేస్తుంద‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆయ‌న మీద‌ క్ర‌మశిక్ష‌ణా చ‌ర్య‌లు తీసుకుంటుందా..? వ‌దిలేస్తుందా అన్న‌ది చ‌ర్చ‌నీయాశంగా మారింది. గ‌తంలో ఆసిఫాబాద్ జిల్లా అధ్య‌క్షుడిగా ప‌నిచేసిన జేబీ పౌడేల్‌పై సైతం క్ర‌మ శిక్ష‌ణా చ‌ర్య‌లు తీసుకున్న అధిష్టానం ఆయ‌న‌తో జిల్లా అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేయించి, రాష్ట్ర క‌మిటీలో తీసుకుంది. పాయ‌ల్ శంక‌ర్ విష‌యంలో సైతం అదే జ‌రిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఒక‌వేళ అదే జ‌రిగితే దానికి పాయ‌ల్ శంక‌ర్ అంగీక‌రిస్తారా..? అనేది సైతం ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఏది ఏమైనా కొద్ది రోజుల్లో దీనిపై పూర్తి స్ప‌ష్ట‌త రానుంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like