సింగ‌రేణి కార్మికుల‌కు నెల‌లోపు వేజ్‌బోర్డు ఎరియ‌ర్స్ చెల్లింపు

-వేజ్‌బోర్డు ఎరియ‌ర్స్ రూ.1,726 కోట్లు చెల్లింపున‌కు భారీ క‌స‌ర‌త్తు
-ఛైర్మ‌న్ మ‌రియు ఎండీ శ్రీ ఎన్‌.శ్రీ‌ధ‌ర్ ఆదేశంపై ముమ్మ‌ర ఏర్పాట్లు
-ఒక్కో కార్మికుడికి స‌గ‌టున రూ.4 ల‌క్ష‌ల వ‌ర‌కు ఎరియ‌ర్స్
-అన్ని విభాగాల‌ను స‌న్న‌ద్ధం చేసిన డైరెక్ట‌ర్‌(ప‌ర్స‌న‌ల్‌, ఫైనాన్స్) ఎన్‌.బ‌ల‌రామ్‌

Singareni: సింగ‌రేణి కార్మికుల‌కు చెల్లించాల్సి ఉన్న 23 నెల‌ల 11వ వేజ్‌బోర్డు బ‌కాయిల‌ను వీలైనంత త్వ‌ర‌గా చెల్లించేందుకు రంగం సిద్ధ‌మైంది. నెలరోజుల్లో ఈ చెల్లింపులు పూర్తి చేయ‌నున్నారు. డైరెక్ట‌ర్‌(ఫైనాన్స్‌, ప‌ర్స‌న‌ల్‌) ఎన్.బ‌ల‌రామ్ సార‌థ్యంలో ముమ్మ‌ర ఏర్పాట్ల‌ను చేప‌ట్టారు. ప్రాథ‌మిక అంచ‌నా ప్ర‌కారం రూ.1,726 కోట్లను బ‌కాయిలుగా చెల్లించ‌నున్నారు. స‌గ‌టున ఒక్కో కార్మికుడు సుమారుగా రూ.4 లక్ష‌ల వ‌ర‌కు ఎరియ‌ర్స్ అందుకుంటాడని ఎన్‌.బ‌ల‌రామ్ వెల్ల‌డించారు.

సింగ‌రేణి చ‌రిత్ర‌లో తొలిసారిగా పెద్ద‌మొత్తంలో వేత‌న‌ బ‌కాయిల‌ను చెల్లిస్తున్న నేప‌థ్యంలో ఎటువంటి పొర‌పాట్ల‌కు అవ‌కాశం లేకుండా ఉండేందుకు వీలుగా నెల రోజుల వ్య‌వ‌ధిలో రెండు విడ‌త‌లుగా బ‌కాయిల‌ను కార్మికుల ఖాతాల్లో జ‌మ చేయ‌నున్నారు. వేత‌న బ‌కాయిల లెక్కింపు ప్ర‌క్రియ అత్యంత ప‌క‌డ్బందీగా నిర్వ‌హించ‌డానికి ప‌ర్స‌న‌ల్ విభాగం, అకౌంట్స్‌, ఆడిటింగ్‌, ఈఆర్‌పీ, ఎస్ఏపీ, ఐటీ త‌దిత‌ర అన్ని విభాగాల స‌మ‌న్వ‌యంతో శుక్ర‌వారం నుంచి ప్ర‌క్రియ‌ ప్రారంభించారు.

ముందుగా ఉద్యోగుల వేత‌న ఎరియ‌ర్స్‌పై ఆడిటింగ్ ప్ర‌క్రియ‌ను అత్యంత వేగంగా పూర్తి చేస్తారు. అనంత‌రం ప్రోగ్రామ్ రూప‌క‌ల్ప‌న‌, ఎస్ఏపీ టెస్ట్ ర‌న్ల‌ను కూడా త‌క్కువ స‌మ‌యంలో పూర్తి చేసి చెల్లింపుల‌కు మార్గం సుగ‌మం చేయాల‌ని సంబంధిత శాఖ‌ల అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ఏ ద‌శ‌లోనూ జాప్యం జ‌ర‌గ‌కుండా ఏర్పాట్లు చేశారు. నెల‌రోజుల‌లోపు చెల్లించాల‌ని ప్రాథ‌మికంగా అనుకుంటున్నా అంత‌క‌న్నా ముందే చెల్లించ‌డం కోసం అధికారులు కృషి చేస్తున్నారు.

11వ వేజ్ బోర్డు వేత‌నాల‌ను అంద‌రిక‌న్నా ముందే సింగ‌రేణి లో అమ‌లు చేశామ‌ని, ఈ మేర‌కు కంపెనీకి ఏడాదికి సుమారు రూ.1200 కోట్ల అద‌న‌పు వ్య‌యం అవుతోంద‌ని, దీనితోపాటు ప్ర‌స్తుతం చెల్లించే ఎరియ‌ర్స్ రూ.1726 కోట్లతో క‌లిపి మొత్తం దాదాపు 3 వేల కోట్ల చెల్లింపుల‌ను చేయ‌నుంద‌ని డైరెక్ట‌ర్ (ప‌ర్స‌న‌ల్‌, ఫైనాన్స్) ఎన్‌.బ‌ల‌రామ్ పేర్కొన్నారు. ఈ బ‌కాయిల‌ను ప్ర‌స్తుతం ఉద్యోగంలో ఉన్న కార్మికుల‌కు చెల్లిస్తున్నామ‌ని, ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన కార్మికుల‌కు త్వ‌ర‌లో చెల్లిస్తామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like