పేద‌రికం ఓడింది.. మాన‌వ‌త్వం గెలిచింది..

-డ‌బ్బులు లేక అన్న శ‌వాన్ని ఇక్క‌డే వ‌ద‌లివెళ్లిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వాసి
-ముందుకు వ‌చ్చి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించిన ముస్లిం వెల్ఫేర్ కమిటీ స‌భ్యులు
-అంత్య‌క్రియ‌ల‌కు రూ. 10 వేలు అందించిన ఆసుప‌త్రి సూప‌రింటెండ్ అర‌వింద్

మంచిర్యాల : క‌ండ్ల ముందే సోద‌రుడు చ‌నిపోయాడు. చేతిలో చిల్లిగ‌వ్వ లేదు. క‌నీసం శ‌వాన్ని తీసుకుపోయే ప‌రిస్థితి లేదు. అంబులెన్స్ వాళ్ల‌ని అడిగితే రూ.80 వేలు డిమాండ్ చేశారు. దీంతో దిక్కుతోచ‌ని స్థితిలో శ‌వాన్ని అక్క‌డే వ‌దిలేసిపోయాడు త‌మ్ముడు.. కానీ, మాన‌వ‌త్వం ఇంకా మిగిలే ఉంద‌ని నిరూపించారు

వివ‌రాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల మోతీషా ఓ వలస కూలీ. సోదరుడితో కలిసి ట్రైన్‌‌లో వస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స పొందుతూ మంచిర్యాల ఆసుప‌త్రిలో మ‌ర‌ణించాడు. అత‌ని సోద‌రుడు మోతీషా శ‌వాన్ని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి తీసుకెళ్లేందుకు మోతీషా ప్రైవేట్ అంబులెన్స్‌లను సంప్రదించాడు. శ‌వాన్ని తరలించాలంటే రూ. 80 వేలు డిమాండ్ చేశారు.డబ్బు చెల్లించే స్థోమత లేకపోవడంతో సోదరుడు శ‌వాన్ని ఆసుపత్రిలోనే వదిలేశాడు.

రెండు రోజులుగా శ‌వం ఇక్క‌డే ఉండ‌టంతో పోలీసుల‌కు ఫిర్యాదు వెళ్లింది. దీంతో మోతీషా సోద‌రుడితో మాట్లాడేందుకు ప్ర‌య‌త్నించిన వారు విఫ‌లం అయ్యారు. ఇక్క‌డి అధికారులు అక్క‌డి పోలీసుల‌తో మాట్లాడారు. మోతీషా కుటుంబ స‌భ్యులు, తాలూకా పోలీసులు, స‌ర్పంచ్‌, కుటుంబ పెద్ద‌లు అంద‌రితో మాట్లాడారు. ఆ శ‌వాన్ని తీసుకువెళ్లేందుకు త‌మ ఆర్థిక స్థోమ‌త లేద‌ని సంప్ర‌దాయం మంచిర్యాల‌లోనే అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించాల‌ని కోరారు. ఈ నేప‌థ్యంలో అక్కడ పోలీస్ అధికారులు, బంధువుల‌తో ఒప్పందం పత్రం తీసుకుని శ‌వానికి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు.

ఇక రూ.80 వేలు ఇస్తే కానీ శ‌వాన్ని తీసుకువెళ్ల‌మ‌ని అంబులెన్స్ వారు నిరాక‌రించ‌గా, మ‌రోవైపు మాన‌వ‌త్వం సైతం స‌జీవంగా ఉంద‌ని నిరూపించారు మంచిర్యాల ఆసుప‌త్రి సూప‌రిండెంట్ అర‌వింద్‌, ముస్లిం యూత్ వెల్ఫేర్ క‌మిటీ స‌భ్యులు. శవానికి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించేందుకు రూ. 10 వేల వ‌ర‌కు ఖ‌ర్చు మంచిర్యాల ఆసుప‌త్రి సూప‌రిండెంట్ అర‌వింద్ భ‌రించారు. ఇక హిందూ సంప్ర‌దాయ ప్ర‌కారం ముస్లిం యూత్ వెల్ఫేర్ కమిటీ స‌భ్యులు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. ఆ క‌మిటీ ఉపాధ్య‌క్షుడు సలీం, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎండీ షారుఖ్, ఫిరోజ్,పర్వేజ్ ఉద్దీన్,మోషిన్,జహీర్ ఈ అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించి పెద్ద మ‌న‌సు చాటుకున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like