పారాణింకా ఆర‌నేలేదు..

-తాగి వచ్చి నిత్యం భ‌ర్త వేధింపులు
-పెళ్లయిన 20 రోజులకే ఆత్మహత్య

కోటి ఆశలతో అత్తవారింట అడుగిడిన ఆమె కాళ్ల పారాణి ఆరక ముందే బలవన్మరణానికి పాల్పడింది. వివాహమై 20 రోజులు తిరగకుండానే ఓ నవవధువు ఆత్మ హత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం లోని కొండపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై రామన్ కుమార్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండపల్లికి చెందిన ఆత్రం శంకర్, సత్యక్క దంపతులకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. రెండో కుమార్తె శారద (19) వివాహం ఫిబ్రవరి 11న పాపన్పేటే గ్రామానికి చెందిన తిరుపతితో జరిపించారు. మొదటి రోజు నుంచే భర్త మద్యం తాగి వచ్చి వరకట్నం తెమ్మంటూ శారదను వేధించేవాడు. తట్టుకోలేక 15 రోజుల్లోపే ఆమె రెండుసార్లు పుట్టింటి తలుపు తట్టింది. పెద్దలు నచ్చజెప్పడంతో మళ్లీ పాపన్పేటకు వెళ్లింది. తర్వాత కూడా వేధింపులు కొనసాగడంతో ఈ నెల 1న కొండపల్లికి వచ్చేసింది. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. సాయంత్రం పొలం పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన తల్లి ఆమెను గమనించి కాగజ్నగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామన్ కుమార్ తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like