పోలీసుల నిర్ల‌క్ష్యం… మూడు నెల‌ల చిన్నారి మృతి

అనారోగ్యానికి గురైన బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. పోలీసులు అరగంట సేపు కారు ఆపడం వల్ల వైద్యం ఆలస్యమై ఆ బాలుడు మృతిచెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. జనగామ జిల్లా వెంకిర్యాల గ్రామానికి చెందిన మచ్చ మల్లేశం, సరస్వతి దంపతుల మూడు నెలల కొడుకు రేవంత్‌ అనారోగ్యానికి గురవడంతో జనగామలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి హైదరాబాద్‌కు సిఫార్సు చేశారు. బాలుడిని కారులో హైద‌రాబాద్ తీసుకెళ్తుండగా మార్గమధ్యలో వంగపల్లి శివారులో పోలీసులు వాహన చలాన్ల తనిఖీల్లో భాగంగా ఆ కారును ఆపారు. త‌న కొడుకు చావుబతుకుల మ‌ధ్య ఉన్నాడ‌ని వెళ్ల‌నివ్వాల‌ని ఎంత కోరినా వినిపించుకోలేద‌ని, దాదాపు అర‌గంట ఆపార‌ని ఆ త‌ల్లి ఆవేదన వ్య‌క్తం చేసింది.

పోలీసులు వచ్చి ‘మీ కారుపై రూ.1000 చలానా ఉంది.. వెళ్లి మీ సేవలో చెల్లించండి.. అప్పుడే పంపిస్తాం’ అని చెప్పారని బాధితులు తెలిపారు. అత్యవసర వైద్యం కోసం వెళ్తున్నామని చెప్పినా పట్టించుకోలేదన్నారు. చలాన్ చెల్లింపునకు అరగంట సమయం పట్టిందని డ్రైవర్‌ తెలిపారు. ఆ తర్వాత ప్రయాణమయ్యాయమని, తార్నాక చేరుకోగానే బాలుడిలో కదలికలు లేవని బాధితులు, డ్రైవర్‌ చెప్పారు. ఆసుపత్రికి తీసుకెళ్లాకా.. వైద్యులు చూసి ‘బాబు చనిపోయి అరగంట అవుతుంద’ని నిర్ధారించారని వాపోయారు. సమయానికి ఆసుపత్రికి చేరుకొని ఉంటేే మా బాబు బతికేవాడని తల్లి కన్నీరు మున్నీరయ్యారు. ‘అత్యవసర పరిస్థితిలో వెళ్లే వాహనాలను మేమెప్పుడూ ఆపమని, అలాంటి పరిస్థితులు ఎదురైతే మా సొంత వాహనాల్లోనే ఆసుపత్రికి తరలిస్తామ’ని యాదగిరిగుట్ట ట్రాఫిక్‌ సీఐ సైదయ్య తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like