పోలీసుల‌పై ప్ర‌జ‌ల ఆందోళ‌న

-నిర్మ‌ల్ జిల్లాలో ఒకే రోజు రెండు ఘ‌ట‌న‌లు
-ద‌స్తూరాబాద్ పోలీస్‌స్టేష‌న్ ముట్ట‌డించిన ఆదివాసీలు
-పోలీసులు కొట్ట‌డంతో యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని ఆందోళ‌న‌
-పెంబి మండ‌లంలో పెళ్లి భర‌త్‌పై విరుచుకుప‌డిన ఎస్సై
-పిల్ల‌లు, మ‌హిళ‌లు అని చూడ‌కుండా వీరంగం
-పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్లి ఆందోళ‌న చేసిన బంధువులు

నిర్మ‌ల్ జిల్లాలో హైటెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. పోలీసుల‌కు సంబంధించి ఒకే రోజు రెండు ఘ‌ట‌న‌లు జ‌రిగాయి. ద‌స్తూరాబాద్ గోండుగూడ‌కు చెందిన నాగరాజు అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, దస్తూరాబాద్‌ సబ్ ఇన్‌స్పెక్టర్ కొట్టారన్న మనస్తాపంతోనే నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబసభ్యులు ఆరోపించారు. నాగరాజు డెడ్‌బాడీతో అతడి కుటుంబీకులు, బంధువులు గ్రామస్తులతో కలసి పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు.. దీంతో గోండుగూడ గ్రామస్తులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఈ నెల 14న ఓ శుభకార్యంలో పాల్గొని తిరిగొస్తుండగా.. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో గోండుగూడకు చెందిన నాగరాజు అనే యువకుడు పట్టుబడ్డాడు. అయితే ఆ సమయంలో దస్తూరాబాద్‌ ఎస్సై నాగరాజును కొట్టడంతో పాటు బైక్‌ కూడా లాక్కున్నారని కుటుంబీకులు చెబుతున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఇంటికొచ్చిన నాగరాజు పురుగుల మందు తాగాడు.. అది గమనించిన కుటుంబీకులు వెంటనే జన్నారం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

ఆరోగ్యం విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి నాగరాజు మృతి చెందాడు. అయితే, ఎస్సై కొట్టడం వల్లే నాగరాజు మృతి చెందాడని ఆరోపిస్తూ బంధువులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఎస్సై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇక నిర్మ‌ల్ జిల్లాకు చెందిన పెంబి మండ‌ల కేంద్రంలో ఓ పెళ్లి భ‌ర‌త్ పై ఎస్ఐ విరుచుకుప‌డ్డారు. ఓ పెళ్లి భ‌ర‌త్‌పై ఎస్ఐ మ‌హేష్ దాడి చేశార‌ని పిల్ల‌లు, ఆడ‌వాళ్లు అని చూడ‌కుండా చిత‌క‌బాదాడ‌ని బాధితులు ఆరోపించారు. వారంతా పోలీస్ స్టేష‌న్ ఎదుట ఆందోళ‌న నిర్వ‌హించారు. త‌మ‌కు న్యాయం చేయాల‌ని, ఉన్న‌తాధికారులు త‌మ‌పై దాడిచేసిన వారిని శిక్షించాల‌ని డిమాండ్ చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like