పోరాటాలు మ‌రిచిన ఏఐటీయూసీ

ర‌క్తంతో త‌మ జెండాను ఎరుపెక్కిన కార్మిక నేత‌లు - వారి పేరు చెప్పుకుని కాలం వెళ్ల‌దీస్తున్న ఈ త‌రం నాయ‌కులు - వాసిరెడ్డి వ‌న్‌మాన్ షోతో యూనియ‌న్‌కు మ‌రింత న‌ష్టం - క‌ష్టాలు, క‌న్నీళ్ల‌తోనే విధుల్లోకి సింగ‌రేణి కార్మికులు

మంచిర్యాల – నాయ‌కుల పేర్లు చెబితే చాలు కార్మికుల్లో వేడిరక్తం ఉబికేది. యాజమాన్యం వెన్నులో వణుకు పుట్టేది. ఒక్క పిలుపుతో సింగరేణిలో సమ్మె జరిగేది. సమ్మె నోటీస్‌లో పెట్టిన డిమాండ్లలో 80 శాతానికిపైగా హక్కులను గత్యంతరం లేక యాజమాన్యం ఒప్పుకునేది. 20 ఏళ్ళ కింద‌ట చెప్పుకోదగ్గ స్థాయిలో సాధించిన హక్కులే ప్రస్తుత కార్మికులు అనుభవిస్తున్నారు. సంప్రదింపుల ద్వారా సాధించిన ఒకటి, అర మినహా ఇప్పటి సంఘాలు సాధించింది ఏమీ లేదు. మ‌రి కార్మిక సంఘాలు ఇలా ఎందుకు మారాయి.

కామేడ్ర్ మ‌న‌బోతుల కొంర‌య్య‌, అబ్ర‌హం, పీ.న‌ర్స‌య్య, మాదిరెడ్డి భాస్క‌ర్‌రావు, నారాయ‌ణ‌, అచ్యుత‌న్‌, బాసెట్టి గంగారాం, పోశెట్టి, జే. కుమార‌స్వామి ఇలా ఎంద‌రో నేత‌లు కార్మికుల ప‌క్షాన పోరాటాలు సాగించారు. వారు కార్మికుల కోసం త‌మ స‌ర్వ‌స్వాన్ని ధారపోశారు. చాలా మంది నేత‌లు కార్మికుల కోసం అసువులు బాశారు. త‌మ ర‌క్తంతో ఆ జెండాను మ‌రింత ఎరుపెక్కించారు. సింగ‌రేణి చాలా హ‌క్కులు వారి హ‌యాంలోనే సాధించుకున్నారంటే అతిశ‌యోక్తి కాదు. వారు చెబితే చాలు కార్మికులు ముందు వెన‌కా ఆలోచించ‌కుండా స‌మ్మెలోకి దిగేవారు. కార్మిక సంఘం నేత‌లు కూడా త‌మ‌కున్న విశ్వ‌స‌నీయ‌త‌ అలాగే నిలుపుకున్నారు. దీంతో అటు కార్మికుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారంతో పాటు ఇటు ఏఐటీయూసీ యూనియ‌న్ సైతం నిల‌బ‌డింది.

కార్మికుల స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోని ఏఐటీయూసీ..
సింగ‌రేణి గుర్తింపు కార్మిక సంఘంగా టీఆర్ ఎస్ అనుబంధ సంఘ‌మైన టీబీజీకే ఎస్ గెలుపొందింది. అది ప్ర‌భుత్వానికి, య‌జ‌మాన్యానికి వ్య‌తిరేకంగా ఎలాంటి పోరాటం చేయ‌లేదు. మ‌రి అలాంట‌ప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న ఏఐటీయూసీ ఖ‌చ్చితంగా పోరాటం చేయాలి. కార్మికుల ప‌క్షాన నిల‌బ‌డాలి. కానీ, సింగ‌రేణి వ్యాప్తంగా ఎక్క‌డా అది క‌న‌ప‌డ‌టం లేదు. అడ‌పాద‌డ‌పా చిన్న‌చిన్న విష‌యాల్లో జోక్యం చేసుకోవ‌డం త‌ప్ప పెద్ద‌గా పోరాటాలు చేసిన ప‌రిస్థితి క‌న‌ప‌డం లేదు. కోడ్ ఆఫ్ కండ‌క్ట్ పేరు చెప్పి త‌ప్పించుకోవ‌డం మిన‌హా వారు కార్మికుల స‌మ‌స్య ప‌రిష్క‌రించేందుకు ఏ మాత్రం శ్ర‌ద్ధ చూప‌డం లేదు. సింగ‌రేణివ్యాప్తంగా ప‌క్క‌న పెడితే క‌నీసం ఏరియాల వారీగా కూడా నేత‌లు పోరాటాలు చేయ‌డం లేదు. దీంతో అస‌లు ఏఐటీయూసీ యూనియ‌న్ ఉంద‌నే విష‌యం కూడా కార్మికులు మ‌రిచిపోయే ప‌రిస్థితి.

వాసిరెడ్డి వ‌న్‌మాన్ షోతో మ‌రింత న‌ష్టం..
వాసిరెడ్డి సీతారామ‌య్య వ‌న్‌మాన్ షోతో ఆ యూనియ‌న్‌కు మ‌రింత‌గా న‌ష్ట క‌లుగుతోంద‌ని ఆ యూనియ‌న్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లే చెబుతున్నారు. ఆయ‌న యూనియ‌న్‌కు సంబంధించి పోరాటాల గురించి కానీ, ఇత‌ర విష‌యాల్లో ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆవేద‌న చెందుతున్నారు. అదే స‌మ‌యంలో సింగ‌రేణి వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న స‌మ‌స్య‌ల‌పై పెద్ద ఎత్తున ఆందోళ‌న చేయాల్సి ఉండ‌గా అటు వైపుగా దృష్టి సారించ‌డం లేదు. మ‌రోవైపు ఏరియాల వారీగా పోరాటాలు చేయాల్సిందిగా కార్య‌క‌ర్త‌ల‌ను సైతం స‌మాయ‌త్తం చేయ‌డం లేదు. ఇలా అన్ని ర‌కాలుగా స్త‌బ్దుగా ఉండ‌టం వ‌ల్ల యూనియ‌న్‌కు ఇబ్బంది క‌లుగుతోంద‌ని ఆ యూనియ‌న్ కార్య‌క‌ర్త‌లే ఆరోపిస్తున్నారు.

 

ఇబ్బందుల‌తో స‌త‌మ‌తం అవుతున్న కార్మికులు..
మెడిక‌ల్ అన్‌ఫిట్ల‌లో ల‌క్ష‌ల్లో చేతులు మారుతున్నాయి. ప్ర‌తి బోర్డుకు కోట్లాది రూపాల‌య అవినీతి జ‌రుగుతోంది. కార్మికుల‌కు ప‌ని స్థ‌లాల్లో భ‌ద్ర‌త లేకుండా పోతోంది. డీఎంఎఫ్‌టీ కింద దాదాపు 2,300 కోట్లు ఆరు జిల్లాల‌కు అందించామ‌ని సింగ‌రేణి చెబుతోంది. ఆ నిధులు ఎక్క‌డ ఖ‌ర్చు చేశారు..? ఏం చేశారు..? ఎలాంటి లెక్క లేకుండా పోతోంది. కొత్త మున్సిపాలిటీల్లో హెచ్ ఆర్ ఏ ఇవ్వ‌డం లేదు. కోల్ ఇండియాలో పెర్స్క్ మీద యాజ‌మాన్యం ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్న్ చెల్లిస్తుంది. కానీ ఇక్క‌డ అమ‌లు చేయ‌డం లేదు. ప్ర‌తి నెలా వంద‌ల కోట్ల లాభాలు చూపిస్తున్న సంస్థ‌లో జీతాలు చెల్లించ‌లేని దుస్థితి. జెన్‌కో వంద‌ల కోట్ల బకాయిలు చెల్లించాలి. అడిగే నాథుడు లేడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో స‌మ‌స్య‌లు ఏఐటీయూసీ మాత్రం క‌నీసం ప‌ట్టించుకోవ‌డం లేదు.

నాయ‌క‌త్వ వైఫ‌ల్యంతో న‌ష్టం..
ప్ర‌తిప‌క్ష యూనియ‌న్‌గా ఏఐటీయూసీ కార్మికుల త‌ర‌ఫున పోరాటం చేస్తే అటు యూనియ‌న్‌కు మంచి పేరుతో పాటు కార్మికుల స‌మ‌స్య‌లు కూడా ప‌రిష్కారం అవుతాయి. యూనియ‌న్‌కు సంబంధించి ద్వితీయ శ్రేణి నాయ‌క‌త్వం కూడా స‌రిగ్గా స్పందించ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఒక‌టి రెండు చోట్ల మిన‌హా ఎక్క‌డా కూడా ఏరియా క‌మిటీలు స‌క్ర‌మంగా లేవు. దీంతో ఆ యూనియ‌న్ ఒక ర‌కంగా నిర్వీర్యం అయిపోయింది. ఇప్ప‌టికైనా కార్మికుల స‌మ‌స్య‌లు ప‌ట్టించుకుని పోరుబాట ప‌డితే త‌ప్ప కార్మికుల మ‌న‌స్సుల్లో కాస్తోకూస్తో చోటు ద‌క్కుతుంది. లేక‌పోతే మా తాత‌లు నేతులు తాగారు… మీరు మా మూతులు వాస‌న చూడండి చందాన‌… పాత నేత‌ల పేరు చెప్పుకుని జీవ‌నం సాగించాల్సిందే.

 

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like