ప్రభుత్వ మెప్పుకోసం నిధుల మళ్లింపు

మళ్ళీ సింగరేణి సిక్ ఇండ్రస్టీగా మరే ప్రమాదం - విచ్చలవిడి మల్లింపు పై విచారణ చేపట్టాలి - మొండి బకాయిలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి - బీఎంఎస్ ఉపాధ్య‌క్షుడు అప్పని శ్రీనివాస్ డిమాండ్

సింగ‌రేణి ప్ర‌తినిధి : సింగరేణి నిధుల మ‌ళ్లింపు, దుర్వినియోగంపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (బీఎంఎస్) ఉపాధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. భూపాలపల్లి ఏరియా కేటీకే 6 ఇంక్లైన్ లో శ‌నివారం 13 వ రోజు కార్మికుల పలకరింపు కార్యక్రమం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కార్మికులను కలుసుకొని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంస్థ నిధుల మళ్లింపుతో మళ్ళీ నష్టాల ఊబిలోకి వెళ్లే అవ‌కాశం ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సింగరేణి సిక్ ఇండ్రస్ట్రీగా మారే అవ‌కాశం ఉంది. కార్మికులు, కార్మికుల కుటుంబాలు, ఇక్క‌డి పరిసర ప్రాంతాల ప్రజలకు ఉపాధి పోతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సింగరేణి అధికారులు రాష్ట్ర ప్రభుత్వ మెప్పుకోసం సంస్థ నిధులు ఇష్టం వచ్చినట్లు మ‌ళ్లిస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. సింగరేణి నిధులు మళ్లించడం అన్యాయమన్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయాల్సిన నిధులను ప్రభుత్వ పథకాలకు మళ్లించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. రామగుండంలో మెడికల్ కళాశాల ఏర్పాటు అభినందనీయమ‌న్నారు. కానీ ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించే మెడికల్ కళాశాల ఏర్పాటుకు సింగ‌రేణి రూ. 500 కోట్లు ఇవ్వడాన్ని కార్మికుల పక్షాన బీఎంఎస్ వ్య‌తిరేకిస్తోంద‌న్నారు.

రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి ఇప్పటి వరకు రూ.15వేల కోట్లు విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉండగా దానిపై దృష్టి సారించడం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఉన్న నిధులను దారి మళ్లించడం ఎంత వరకు సమంజసమని యాజమాన్యాన్ని ప్రశ్నిచారు. సింగరేణి నిధులు కార్మికుల క్షమానికి సంస్థ అభివృద్ధికి, నూతన టెక్నాలజీ వినియోగానికి, మౌలిక సదుపాయాల కల్పనకు మాత్రమే ఖర్చు చేయాల‌న్నారు. ఈ నిధుల దుర్వినియోగంపై సింగ‌రేణిలో 49 శాతం వాటా ఉన్న కేంద్ర ప్ర‌భుత్వం దృష్టి సారించాలని కోరారు. ఇలాగే సింగరేణి నిధులు దుర్వినియోగం చేస్తుపోతే…సింగరేణి సంస్థ భ‌విష్య‌త్తు కోసం…. సింగరేణి సంస్థను కాపాడుకోటానికి కార్మి కుల పక్షాన బీఎంఎస్ పోరాటం చేస్తుంద‌న్నారు. కార్యక్రమంలో శ్రీరాముల సాంబయ్య, రంగనాయకుల జనార్దన్, బత్తుల స్వామి, తాండ్ర మొగిలి పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like