ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచేలా..

మంచిర్యాల : ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కేసీఆర్ కిట్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయి. అయితే, కరోనా నేపథ్యంలో, ఇతర కారణాల వల్ల తిరిగి సామాన్య జనం ప్రైవేటు ఆసుపత్రుల బాట పడుతున్నారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీటి సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున కృషి చేసింది. అంతేకాకుండా తల్లీబిడ్డల క్షేమాన్ని కోరుతూ కేసీఆర్ కిట్ పథకం ప్రవేశపెట్టారు. ఈ పథకంలో గర్భిణులకు ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగపిల్లాడు పుడితే రూ.12 వేలు అందజేస్తున్నారు. దీంతో ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. సహజ ప్రసవాలకు అవకాశం ఉండేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా లేబర్ రూములు, ఎంసీహెచ్, సీమాంక్ సెంటర్లను, మెటర్నల్ ఐసీయూలు, ఎస్ఎన్సీయూలు, బ్లడ్బ్యాంక్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రసవానంతరం తల్లీబిడ్డలను క్షేమంగా ఇంటికి చేర్చడానికి 102 వాహనాలు సైతం ఉన్నాయి. గర్భిణులను ప్రసవాల కోసం హాస్పిటల్కు, తర్వాత ఇంటికి ఉచితంగా ఈ వాహనాలు చేరవేరుస్తున్నాయి.

ఇలా అన్ని రకాలుగా సేవలు అందిస్తూ ప్రసవాలు పెంచుతున్నారు. అయితే, కొన్ని చోట్ల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల మళ్లీ ప్రజలు ప్రైవేటు వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్రావు ఆసుపత్రులకు వైద్యం మొదలుపెట్టారు. ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిపేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయా జిల్లాల్లో పర్యటించి సమీక్షా సమావేశాలు సైతం నిర్వహించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ప్రసవాల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు.

ఆయ‌న ఆదేశాల మేర‌కు వైద్య‌శాఖ అధికారులు రంగంలోకి దిగారు. మంచిర్యాల డీఎంఅండ్‌హెచ్‌వో సుబ్బ‌రాయుడి ఆదేశాల మేర‌కు జిల్లాలో వైద్యాధికారులు రంగంలోకి దిగారు. ప్ర‌జ‌ల్లో ప్ర‌సూతి సేవ‌ల‌పై ముఖ్యంగా ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో సాధార‌ణ ప్ర‌స‌వాల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. ఆయా గ్రామాల‌కు వెళ్లి గ‌ర్భిణుల ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. మంద‌మ‌ర్రి మండ‌లంలో మెడిక‌ల్ అధికారి సీ. మాన‌స‌, ఇత‌ర వైద్య సిబ్బంది గ్రామాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. గ‌ర్భిణుల‌కు జాగ్రత్త‌లు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. వారితో పాటు ఆరోగ్య సిబ్బంది సైతం గ‌ర్భిణుల బాగోగుల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెడుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో ఖ‌చ్చితంగా ప్ర‌స‌వాలు పెంచ‌వ‌చ్చిన వారు భావిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like