ప్రభుత్వ తీరుతో రైతుల పరిస్థితి దయనీయం

ప్ర‌భుత్వ తీరుతో రైతుల ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింద‌ని బీజేపీ నేత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాండూర్ మండలం, రేచిని గ్రామ పంచాయతీలోని ధాన్యం కొనుగోలు కేంద్రం ప‌రిశీలించిన నేత‌లు విలేక‌రుల‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ మండల ఉపాధ్యక్షులు బామనిపెల్లి ఆనంద్, మండల ప్రధాన కార్యదర్శి భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజ కొంటామని నమ్మబలికిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు తాండూర్ మండలంలో ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీని వల్ల రైతన్నలు తిండితిప్పలు మాని ధాన్యం వద్దే రోజుల తరబడి పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొందని మండి పడ్డారు. వర్ష సూచనతో రైతులు మొగులు వైపు చూసి దిగులు పడుతుంటే, ప్రజా ప్రతినిధులు, అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వ్యవరిస్తున్న తీరు దున్నపోతు మీద వాన పడిన చందంగా ఉన్నదని దుయ్యబట్టారు. కొనుగోలు కేంద్రంలో తేమ, తాలు పేరుతో అధిక తూకం వేయడం, కొనుగోలు రశీదు, ఇవ్వకపోవడం, ధాన్యం లోడింగ్ చేయకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదే శ్రీనివాస్,సోమయ్య, రవితేజ, మల్లేష్, గణేష్, సాయి, శ్రీధర్, ప్రవీణ్ మరియు రైతులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like