ప్ర‌ధాని స్థాయిలో ప్ర‌సంగం

-కేసీఆర్ విమ‌ర్శ‌లు ప‌ట్టించుకోని మోదీ
-రాజ‌కీయ వివాదాల జోలికి పోని ప్ర‌ధాని
-తెలంగాణ వీర‌త్వాన్ని, క‌ళాత్మ‌క‌త‌ ప్ర‌శంసించిన మోదీ

ఆయన ఏం మాట్లాడ‌తారు…? ఏం చెబుతారు..? కేసీఆర్ మీద ఎలాంటి విమ‌ర్శ‌లు చేస్తారు.. రాజ‌కీయంగా ఏ విధంగా స్పందిస్తారు…? కొద్దిరోజులుగా తెలంగాణ వ్యాప్త‌గా ఇవే ప్ర‌శ్న‌లు. భార‌తీయ జ‌న‌తా పార్టీ స‌మావేశాలు ఇక్క‌డ నిర్వ‌హిస్తుండం, విజ‌య సంక‌ల్ప స‌భ సైతం ఏర్పాటు చేయ‌డంతో ప్ర‌ధాని మోదీ ప్ర‌సంగంపై అంత‌టా ఉత్కంఠ నెల‌కొంది. అదే స‌మ‌యంలో రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌ధానిపై మాట‌ల దాడి చేయ‌డం , త‌న‌పై ఖ‌చ్చితంగా ఎదురుదాడి చేస్తార‌ని అంతా భావించారు. కానీ, మోదీ మాత్రం అందుకు భిన్నంగా పూర్తి స్థాయిలో రాజ‌కీయాల‌కు దూరంగా ఉండిపోయారు.

ఆయ‌న ప్ర‌సంగం ఆద్యంతం ఉర్రూత‌లూగించారు. అటు అభివృద్ధి గురించి చెబుతూనే తెలంగాణ వీరత్వాన్ని గుర్తు చేయ‌డంతో పాటు క‌ళాత్మ‌క గురించి సైతం గుర్తు చేశారు. ‘‘తెలంగాణ బీజేపీని ఆశీర్వదించడానికి ఎంతో దూరం నుంచి వచ్చిన ప్రతీ కార్యకర్తకు, సోదర సోదరీ మణులకు, మాతృమూర్తులకు నా నమస్కారం’’ అంటూ ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. ఎనిమిది సంవ‌త్స‌రాల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందనే విషయాలను వెల్లడించడానికే ఆయన ప్రాధాన్యం ఇచ్చారు.

సభకు హాజరైన వారిని చూస్తే తెలంగాణ మొత్తం ఇక్కడే ఉందనిపిస్తుందన్నారు. తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలను చూసే ఈసారి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించామన్నారు. తెలంగాణ ప్రజల కళాకౌశలాన్ని మోదీ కొనియాడారు. తెలంగాణ ప్రాచీన పరాక్రమాల గడ్డ అని ప్రశంసించారు.

రుద్రమ దేవి, కొమురం భీమ్‌ల వీరత్వాన్ని ప్రస్తావించిన ప్రధాని మోదీ… పాల్కూరికి సోమనాథుడి రచనలను గుర్తు చేశారు. భద్రాచలం శ్రీరాముడు.. యాదాద్రి లక్ష్మీ నరసింహుడు, ఆలంపూర్ జోగులాంబ, వరంగల్ భద్రకాళి.. ఇలా దేవుళ్లందరి ఆశీస్సులు మనకు ఉన్నాయన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప ఆలయం, కాకతీయ కళాతోరణం తెలంగాణ కళలకు నిదర్శనమన్నారు..

తెలంగాణ అభివృద్ధికి బీజేపీ ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందన్న ప్రధాని.. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నామన్నారు. తెలంగాణ పేదల పట్ల సేవాభావంతో పని చేస్తున్నామన్న ప్రధాని మోదీ.. అందుకే తెలంగాణ ప్రజల్లోనూ బీజేపీ పట్ల విశ్వాసం పెరుగుతోందన్నారు. మీ ప్రేమ, ఉత్సాహం.. దేశం మొత్తం చూస్తోందన్నారు. 2019 ఎన్నికల నుంచి తెలంగాణలో బీజేపీ పట్ల నమ్మకం పెరుగుతోందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగిరిందన్నారు. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారును తెలంగాణలో ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.

తెలంగాణ రైతుల జీవితాలను మార్చాలని మేం అనుకుంటున్నామ‌ని,. రైతులకు మద్దతు ధర ఇచ్చి పెద్ద మొత్తంలో ధాన్యాన్ని కొనుగోలు చేశామ‌న్నారు. రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని తెరిచామ‌న్నారు.హైదరాబాద్‌లోని ఫ్లైఓవర్లకు నిధులిచ్చామ‌ని గుర్తు చేశారు. తెలంగాణ నీటి ప్రాజెక్టులకు సహకారం అందించామ‌ని చెప్పారు. రాష్ట్రంలో అతి పెద్ద మెగా టెక్స్‌టైల్ పార్క్‌ని ఏర్పాటు చేయబోతున్నామ‌ని, దీని వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. వేలాది యువతకు ఉపాధి లభిస్తుందని స్ప‌ష్టం చేశారు. తెలంగాణకు కొత్త రైల్వే లైన్లను మంజూరు చేశామ‌న్నారు. తెలంగాణలో సైన్స్ సిటీ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామ‌ని. బయో మెడికల్ సైన్సెస్ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. తెలుగులో మెడికల్,టెక్నాలజీ చదువులు ఉంటే ఎంతో బాగుంటుందో ఆలోచించండని కోరారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like