ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి

రక్షణ సమావేశంలో పెద్ద‌ప‌ల్లి ఎంపీ వెంకటేష్‌ నేత

సింగరేణి అద్భుతమైన ప్రగతితో పాటు రక్షణ, సంక్షేమంలో కూడా అగ్రగామిగా ఉంటోంద‌ని అయినా గనుల్లో ప్రమాదాలు పూర్తిస్థాయిలో నివారించడానికి చర్యలు తీసుకోవాల‌ని పెద్ద‌ప‌ల్లి ఎంపీ వెంక‌టేష్ నేత స్ప‌ష్టం చేశారు. శుక్రవారం డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ మైన్స్‌ సేఫ్టీ అధికారులు, సింగరేణి అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణిలో భూగర్భగనుల కన్నా ఓ.సి. గనుల్లో ప్రమాదాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందనీ, ఓసీ గనుల్లో ప్రమాదాల నివారణకు డీజీఎంఎస్‌, సింగరేణి అధికారులు కలిసి సమీక్ష చేసి చర్యలు తీసుకోవాల‌ని సూచించారు. ఓ.బి. కాంట్రాక్టర్ల వద్ద పనిచేస్తున్న కార్మికులకు రక్షణపై ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేయాల‌న్నారు. ఓ.బి. కాంట్రాక్టర్లు తమ వద్ద పనిచేసే కార్మికులను చిన్న కారణాలతో తొలగించడం స‌రికాద‌న్నారు. రక్షణ, భద్రత విషయంలో రాజీపడకుండా కార్యకలాపాలు కొనసాగించాలని సూచించారు.

సమావేశంలో పాల్గొన్న ఎంఎల్‌సీ భాను ప్రకాశ్‌ మాట్లాడుతూ సింగరేణి సాధిస్తున్న అభివృద్ధిని కొనియాడారు. రక్షణ పెంపుదలకు ఇంకా కృషి చేయాలన్నారు. పెద్దపల్లి జిల్లా పరిషత్‌ ఛైర్మన్ పుట్టా మధు మాట్లాడుతూ స్థానికులకు, ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల యువతకు ఓ.బి. కాంట్రాక్టు పనుల్లో ఉపాధి కల్పించాలని, ఇందుకు యాజమాన్యం చొరవ చూపాలన్నారు.

డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) ఎస్‌.చంద్రశేఖర్ కంపెనీలో తీసుకొంటున్న ఆధునిక రక్షణ చర్యలు, సంక్షేమం, ఆర్‌అండ్‌ఆర్‌ కార్యక్రమాలపై వివరించారు. డైరెక్టర్‌ (పా,ఫైనాన్స్‌, పిఅండ్‌పి) ఎన్‌.బలరామ్ సింగరేణి సంస్థ కార్మికుల రక్షణ, ఆరోగ్యంపై ఖర్చుకు వెనుకాడకుండా అనేక చర్యలు తీసుకొంటోందని వెల్లడించారు. గ్రూపు గనుల వద్ద అంబులెన్సులను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. డైరెక్టర్‌ (ఇఅండ్‌ఎం) సత్యనారాయణరావు గనుల్లో, కాలనీల్లో వెలుతురు పెంపుదలకు వేలాది ఎల్‌.ఇ.డి. లైట్లను కొనుగోలు చేశామ‌న్నారు. విద్యుత్‌ సంబంధ‌ ప్రమాదాలు పూర్తిగా నివారించామన్నారు.

డిప్యూటీ డీజీఎంఎస్ మలయ్‌ టికేదార్‌ మాట్లాడుతూ సింగరేణి రక్షణపై గట్టి చర్యలు తీసుకొంటోందన్నారు. ఓపెన్‌కాస్టు గనుల్లో ప్రమాదాల నివారణకు ప్రత్యేక సూచనలు చేశామని తెలిపారు. తమ సూచనపై ఆపరేటర్స్‌ ట్రైనింగ్‌ కోసం ప్రత్యేక సిమ్యులేటర్లను కూడా సింగరేణి సంస్థ కొనుగోలు చేసిందన్నారు. డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ మైన్స్‌ సేఫ్టీ అధికారులు సుప్రియో చక్రవర్తి, టి.శ్రీనివాస్‌ (ఎలక్ట్రికల్‌), విశ్వనాథ్‌ బెహర (ఎలక్ట్రికల్‌), సుంకి రత్నాకర్‌, డా.కౌశిక్‌ సర్కార్‌, శ్యామ్‌ కుమార్‌ సోని మాట్లాడుతూ తాము తరచూ గనులను సందర్శిస్తున్నామని, సింగరేణి సంస్థ ఎప్పటికప్పుడు తమ సూచనలు పాటిస్తోందని వెల్ల‌డించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like