సూర్య‌యాన్‌కు సిద్ధం

Aditya L-1:ఇస్రో మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. చంద్రయాన్‌-3తో జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతంపై అడుగుపెట్టి అంత‌రిక్ష‌యానంలో చరిత్ర సృష్టించిన ఇస్రో.. భానుడిపై దృష్టిసారించింది. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఆదిత్య ఎల్‌-1ను ప్రయోగించనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం 11.50కి శ్రీహరికోట సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్ నుంచి రాకెట్ ప్ర‌యోగించ‌నున్నారు. ఆదిత్య ఎల్‌-1 శాటిలైట్‌ను మోసుకుంటూ పీఎస్‌ఎల్వీ-సీ57 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనున్నది. 23.40 గంటల కౌంట్‌డౌన్‌ ప్రక్రియను ఇస్రో శుక్రవారం 12.10 గంటలకు ప్రారంభించింది. సరిగ్గా ఉదయం 11.50 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనున్నది.

సూర్యుడికి సంబంధించి ఇస్రో ప్రయోగిస్తున్న మొదటి శాటిలైట్‌ ఇదే. దీన్ని భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని సూర్యుడు- భూమి లాగ్రేంజ్‌ పాయింట్‌-1 (ఎల్‌-1) వద్ద ఉండే సుదీర్ఘమైన దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెడతారు. అక్కడి చేరేందుకు సుమారు 125 రోజుల సమయం పడుతుంది. ఈ ఉపగ్రహం ద్వారా అతి దగ్గరి నుంచి సౌర వ్యవస్థపై నిఘా పెట్టవచ్చు. తద్వారా సౌర తుఫానులు, అక్కడి వాతావరణం, పరిస్థితులపై అధ్యయనం చేయవచ్చు.

ఆదిత్య-ఎల్‌1లో మొత్తం ఏడు పేలోడ్లు ఉంటాయి. వీటిలో నాలుగు పేలోడ్లు సూర్యుడిపై అధ్యయనం చేస్తాయి. మిగతా మూడు ఎల్‌-1 పరిధిలోని వాతావరణంపై అధ్యయనం చేస్తాయి. వీటిలో విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కొరొనాగ్రాఫ్‌ (వీఈఎల్‌సీ) పేలోడ్‌ అతి కీలకమైంది. దీని ద్వారా సూర్యుడి ఫొటోలు చిత్రీకరించవచ్చు. ఎల్‌-1 పాయింట్‌ వద్ద ఈ శాటిలైట్‌ను ప్రవేశపెట్టడం వల్ల సూర్యుడిని నిరంతరం పర్యవేక్షించవచ్చు. సూర్యుడి నుంచి అంతరిక్షంలోకి వెలువడే పదార్థాలు కొన్నిసార్లు భూమివైపు దూసుకొస్తాయి. వీటి వల్ల శాటిలైట్లకు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో పాటు వీటి వల్ల భూమికి ప్రమాదం పొంచి ఉంటే ముందే గుర్తించి వాటిని దారి మళ్లించే అవకాశం ఉంటుంది.

ఈ ప్రయోగానికి ఇస్రో వద్దనున్న పవర్‌ఫుల్‌ రాకెట్‌ పీఎస్‌ఎల్వీ-సీ57ను వినియోగిస్తున్నారు. ఈ వేరియంట్‌ను గతంలోనూ ఇస్రో వినియోగించింది. 2008లో నిర్వహించిన చంద్రయాన్‌-1 శాటిలైట్‌, 2013లో చేపట్టిన అంగారక ఆర్బిటర్‌ మిషన్లను ఈ వేరియంట్‌ సాయంతోనే నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఆదిత్య-ఎల్‌1ను లో ఆర్బిట్‌లో ప్రవేశపెడతారు. తర్వాత ఇది మరింత దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి మారుతుంది. అనంతరం ఆన్‌బోర్డ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్స్‌ను వినియోగించుకుని దీన్ని ఎల్‌1 పాయింట్‌లోకి ప్రవేశపెడతారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేందుకు 125 రోజుల వరకు పడుతుంది. వీఈఎల్‌సీకి పేలోడ్‌ నిమిషానికో ఫొటో చొప్పున 24 గంటల్లో 1,440 చిత్రాలను పంపుతుంది.

ఆదిత్య ఎల్ 1 ప్రయోగాన్ని ఇస్రో ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఇస్రో అధికారిక వెబ్ సైట్ https://isro.gov.in ద్వారా, అలాగే, ఇస్రో ఫేస్ బుక్ పేజ్, యూట్యూబ్ చానెల్, దూరదర్శన్ సహా పలు వార్తా చానెల్స్ ద్వారా ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఆదిత్య ఎల్ 1 తరువాత గగన్ యాన్ ప్రయోగం చేపడ్తామని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ తెలిపారు. ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి ముగ్గురు వ్యక్తులను మూడు రోజుల పాటు పంపించనున్నామని వెల్లడించారు. గగన్ యాన్ కోసం ప్రభుత్వం రూ. 90.23 బిలియన్లను కేటాయించింది.

ఇస్రో ప్రయోగించే ఆదిత్య ఎల్ 1 విజయవంతమైతే భారత్ ఎన్నో మైలురాళ్లను అధిగమించబోతోంది. ముఖ్యంగా సూర్యుని గురించి అధ్యయనం చేస్తున్న అతి కొద్ది దేశాల సరసన భారత్ నిలవబోతోంది. సౌర మంటలు పరిశోధించడానికి గత సంవత్సరం ప్రారంభించిన అడ్వాన్స్‌డ్ స్పేస్-బేస్డ్ సోలార్ అబ్జర్వేటరీతో సహా చైనాకు చెందిన రెండు అంతరిక్ష నౌకలు ప్రస్తుతం భూ కక్ష్యలో ఉన్నాయి. జపాన్, యుకె, యుఎస్, యూరప్‌ అంతరిక్ష ఏజెన్సీల మద్దతుతో హినోడ్ అనే నౌక భూమి చుట్టూ పరిభ్రమిస్తోంది. అది సూర్యుని అయస్కాంత క్షేత్రాలను కొలుస్తుంది. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఉమ్మడి ప్రాజెక్ట్ సోలార్ అండ్ హీలియోస్పిరిక్ అబ్జర్వేటరీ మిషన్ (SOHO) ఆదిత్య ఎల్ 1 కోసం ఇస్రో లక్ష్యంగా పెట్టుకున్న లాగ్రాంజ్ పాయింట్‌కు సమీపంలోనే ఉంది. మరొక సంయుక్త-యూరోపియన్ మిషన్ సోలార్ ఆర్బిటర్, సూర్యుని నుండి దాదాపు 42 మిలియన్ కి.మీ. దూరంలో ఉంది. అమెరికాలో పార్కర్ సోలార్ ప్రోబ్‌తో సహా ఇతర సౌర మిషన్లు ఉన్నాయి. ఇది 2021లో సూర్యుని కరోనా గుండా ప్రయాణించిన మొదటి అంతరిక్ష నౌకగా రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఇస్రో ప్రయోగించే ఆదిత్య ఎల్ 1 ప్రయోగం విజయవంతమైతే భారత్ కూడా ఈ దేశాల సరసన చేరబోతోంది. అలాగే వారి కన్నా మెరుగ్గా తక్కువ సమయంలో ఈ ప్రయోగం చేసి పలు రికార్డులు నెలకొల్పడం కూడా ఖాయంగా కనిపిస్తోంది. దీంతో భారత్ దూకుడును ఆయా దేశాలు ఉత్కంఠగా గమనిస్తున్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like