సుమ‌న్‌కు ప్ర‌మోష‌న్

KTR: చెన్నూరులో మరోసారి బాల్క సుమన్ ను భారీ మెజార్టీ తో గెలిపిస్తే కేసీఆర్ ఆయ‌న‌కు ప్రమోషన్ ఇస్తారని, సుమ‌న్ మంత్రి అయితే మ‌రిన్ని అద్భుతాలు చేస్తార‌ని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. మంత్రులుగా ఉన్నవాళ్లు చేయని పనులను బాల్కసుమన్‌ చేశారని కొనియాడారు. మంచిర్యాల జిల్లాలో ప‌ర్య‌టించిన మంత్రి కేటీఆర్ మందమర్రి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు శంకుస్థాప‌న‌లు అనంతరం మందమర్రి చౌరస్తాలో నిర్వ‌హించిన రోడ్ షోలో పాల్గొని మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ 60 ఏండ్లు విద్యుత్‌, నీళ్లవ్వక చావగొట్టిన కాంగ్రెస్ పార్టీ అల‌విగాని హామీలతో ఆరు గ్యారంటీలు ఇస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. 150 ఏండ్ల క్రితం నాటి కాంగ్రెస్‌ గ్యారంటీ ఎప్పుడో తీరిపోయిందన్నారు. తెలంగాణకు మొండి చెయ్యి చూపే బీజేపీ, మరోవైపు చెవిలో పువ్వులు పెట్టే కాంగ్రెస్‌ పార్టీ అని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు డిపాజిట్లు కూడా రావన్నారు.

ఆరు గ్యారంటీ లు ఏమో కానీ, కాంగ్రెస్ కు ఓట్లు వేస్తే 24 గంటలు కరెంట్ పోవుడు గ్యారంటీ అని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆకాశం నుంచి భూమి వరకు అన్ని స్కాంలు గ్యారంటీ అని, ఏడాదికి ఒక ముఖ్య‌మంత్రి మారుతాడ‌ని వెల్ల‌డించారు. కాంగ్రెస్‌ అంటే కన్నీళ్లు.. కష్టాలు అని, బీఆర్‌ఎస్‌ అంటే సాగునీళ్లు సంక్షేమం అని చెప్పారు. ప్రధాని మనసులో తెలంగాణపై ప్రేమ లేదన్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు సింగ‌రేణి అంటే ప్ర‌త్యేక‌మైన ప్రేమ అని వెల్ల‌డించారు. ఆయ‌న కార్మికుల‌ను క‌డుపులో పెట్టుకుని చూసుకుంటున్నార‌ని స్ప‌ష్టం చేశారు.

దసరా దీపావళి పండుగవేళలో సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్‌ భారీగా బోనస్‌ ప్రకటించారని చెప్పారు. సింగరేణిని లాభాల బాటలో నడిపిస్తున్నారని, కార్మికులను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారని తెలిపారు. చెన్నూరు రెవెన్యూ డివిజన్ పై త్వరలో శుభ వార్త వింటారని ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు. ప్ర‌జ‌లు ఆగం కావద్దని, ఆలోచించి ఓటు వేయాల‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. మంత్రి ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న వెంట ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్‌, ఎమ్మెల్సీ దండే విఠ‌ల్‌, ఎమ్మెల్యేలు న‌డిప‌ల్లి దివాక‌ర్‌రావు, దుర్గం చిన్న‌య్య త‌దిత‌రులు ఉన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like