పులుల‌ను చూసొద్దాం రండి..

పులులు సహా 19 రకాల జంతువులను చూసే అవకాశం - 300 రకాల పక్షుల కిలకిలారావాల నడుమ పర్యటన - ప్రకృతి ప్రేమికులకు మధుర జ్ఞాపకంగా జంగిల్‌ ట్రిప్‌ - టూర్‌లో కాటేజీలో బస, టైగర్‌ సఫారీ, ట్రెక్కింగ్‌ - అటవీశాఖ ప్యాకేజీ ఇద్దరు వ్యక్తులకు రూ.4,600

హైదరాబాద్ : లోనికి అడుగు పెట్టగానే దారి పొడవునా వందల రకాల పక్షుల కిలకిలారావాలు మిమ్మల్ని స్వాగతిస్తాయి! లోనికి వెళుతున్న కొద్దీ ప్రకృతి రమణీయత, అందులో చెంగుచెంగున దుంకే జింకలు.. కనువిందు చేస్తాయి! ఇంకాస్త లోనికి వెళితే.. అడుగుల చప్పుడు మాత్రమే వినిపించేంత నిశ్శబ్దం మిమ్మల్ని కలవరపెడుతుంది! అనుకోకుండా ఎదురయ్యే ఎలుగుబంట్లో.. పులులో, చిరుత పులులో మిమ్మల్ని భయపెడుతాయి! అచ్చమైన అడవి! రక్షిస్తున్న అడవి! అదే అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌!! చూసేద్దాం పదండి.. జ్ఞాపకాలు పదిలపర్చుకుందాం కదలండి!!

పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, అడవి కుక్కలు, నక్కలు, చుక్కల జింకలు, సాంబార్‌ జింకలు, నీల్గాయి, చింకారా, బ్లాక్‌బక్‌, మూషిక జింకలు, నాలుగు కొమ్ముల జింకలు, అడవి పందులు.. తదితర 19 రకాల జంతువులు, 300 రకాల అరుదైన పక్షులు.. ఇవన్నీ మన రాష్ట్రంలోనే చూసే అవకాశం వచ్చింది. హైదరాబాద్‌కు కేవలం 140 కిలోమీటర్ల దూరంలోని ప్రకృతి రమణీయ నల్లమల అడవిలో ఉన్న అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ (ఏటీఆర్‌)లో వీటన్నింటినీ వీక్షించే అవకాశాన్ని కల్పించింది అటవీశాఖ.

టైగర్‌ సఫారీలో భాగంగా ఫరహాబాద్‌ గేటు నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరం దట్టమైన అడవిలో సఫారీ ఏర్పాటు చేశారు. ఇద్దరు పర్యాటకులు రూ.4,600తో ఒకరోజు ఉండేందుకు కాటేజీ (మన్ననూరు) తో పాటు టైగర్‌ సఫారీ, మరుసటి రోజు మన్ననూరు నుంచి ఉమామహేశ్వర ఆలయం వరకు 5 కిలోమీటర్లు ట్రెక్కింగ్‌ ఈ టూర్‌లో భాగం. ఆహ్లాదాన్ని పంచే అడవిలో పక్షులు, జంతువుల మధ్య ఆనందంగా గడువచ్చు. అడవి మధ్యలో నివసించే చెంచుల జీవన విధానం తెలుసుకోవచ్చు.

పర్యావరణ పరిరక్షణ, పులులను రక్షించుకోవాల్సిన అవసరాన్ని, జంతుజాలం, పక్షుల గురించి తెలుసుకునేలా ఈ ట్రిప్‌ను రూపొందించినట్టు అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్‌ (ఏటీఆర్‌) ఫీల్డ్‌ డైరెక్టర్‌, సీసీఎఫ్‌ బీ శ్రీనివాస్‌ తెలిపారు. టూర్‌ కోసం amrabadtigerreserve.comలో బుక్‌ చేసుకోవచ్చని ఫారెస్ట్‌ డివిజన్‌ ఆఫీసర్‌ గోపిడి రోహిత్‌ చెప్పారు.

దాదాపు 2,611 కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించిన అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ (ఏటీఆర్‌) నాగర్‌కర్నూల్‌, నల్లగొండ జిల్లాల్లో విస్తరించి ఉన్నది. కోర్‌ ఏరియాను పరిగణలోకి తీసుకొంటే ఇది దేశంలోనే రెండో అతిపెద్ద టైగర్‌ రిజర్వ్‌. 1983లో దీనిని శాంక్చురీగా ప్రకటించగా, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏటీఆర్‌గా మార్చారు. టైగర్‌ సఫారీలో టూరిస్టుల కోసం అన్ని వసతులతో డజను కాటేజీలను మన్ననూరులో ఏర్పాటుచేశారు. ఆటవిడుపు, ఆహ్లాదం, విజ్ఞానం.. దేనికోసమైనా ఈ టూర్‌ చూసితీరాల్సిందే.

 

బుకింగ్స్‌కు_ www.amrabadtigerreserve.com

Get real time updates directly on you device, subscribe now.

You might also like