రూ. ప‌దివేలు దాట‌నున్న ప‌త్తి

తెల్ల బంగారం రైతులకు సిరులు కురిపిస్తోంది. పత్తి ధరలు రికార్డు ధరలు పలుకుతుండటంతో రైతులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. క్వింటాల్ పత్తి ధర రూ. 8 వేలకు పైగానే పలుకుతోంది. వరంగల్ మార్కెట్ లో క్వింటాల్ పత్తి ధర రూ. 8230 చేరింది. ఈ ధర గ‌తంలో ఎప్పుడూ లేదని, క్వింటాల్ కు నాలుగైదు వేలు చివ‌ర‌గా ఏడు వేల‌కు ఎప్పడూ మించలేదని రైతులు అంటున్నారు. ఈ సారి సాగు విస్తీర్ణం తగ్గడంతో మార్కెట్ కు తక్కువగా వస్తోంది. అంతేకాకుండా పూత‌, కాత స‌మ‌యంలో విప‌రీతంగా వ‌ర్షాలు ప‌డ్డాయి. దీంతో మార్కెట్‌కు వ‌చ్చే ప‌త్తి త‌గ్గిపోయింది. ఇదే సమయంలో అంతర్జాతీయంగా పత్తికి డిమాండ్ ఏర్పడింది. దీంతో రికార్డ్ స్థాయిలో ధర లభిస్తోందని వ్యాపారులు అంటున్నారు.

త‌గ్గిన సాగు విస్తీర్ణం…

గ‌త ఏడాదితో పోలిస్తే ఈసారి పత్తి సాగు తగ్గింది. గత ఏడాది 60. 53 లక్షల ఎకరాల్లో సాగు చేయగా ఈ ఏడు 49.97 లక్షల ఎకరాల్లో పంట వేశారు. దీనికి తోడు సాగు ప్రారంభంలో జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జులైలో, తాజాగా సెప్టెంబర్​లో కురిసిన వర్షాలకు పత్తి భారీగా దెబ్బతింది. ఆశించినంతగా పూత, కాత రాలేదు. దూది వచ్చే టైమ్​లో కురిసిన వర్షాలతో పత్తి నేలపాలైంది. ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి.. ఐదారు క్వింటాళ్లకు త‌గ్గింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పత్తి నిల్వలు తక్కువున్నాయి. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు పెరుగుతున్నాయి. గతేడాది ఇదే టైమ్​లో పత్తి క్వింటా రూ. 5 వేల వరకే పలికాయి. ఇప్పుడు రూ. 7 వేల నుంచి రూ. 8 వేలు దాటడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఎగుమ‌తులే కార‌ణం..

మూడేళ్లుగా పత్తి బఫర్ స్టాక్ తగ్గడంతో పాటు చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో పత్తి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో ఇంటర్నేషనల్ గా మన దేశపు పత్తికి ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయని వ్యాపారులు అంటున్నారు. గతంలో కోవిడ్ కారణంగా టెక్స్ టైల్స్ పరిశ్రమలు మూతపడ్డాయి. ప్రస్తుతం ఇవన్నీ క్రమక్రమంగా తెరుచుకుంటున్నాయి. దీంతో ముడిసరుకైన పత్తికి భారీగా డిమాండ్ ఏర్పడింది. బంగ్లాదేశ్, చైనా, యూరోపియన్, అమెరికా మార్కెట్ లో పత్తి అవసరాలు పెరిగాయి. మనదేశం నుంచి పత్తి ఎగుమతి అవుతుండటంతో డిమాండ్ పెరిగింది.

మ‌హారాష్ట్రకు మ‌న ప‌త్తి..

మ‌హారాష్ట్రలోని మార్కెట్ల‌లో మ‌న ప‌త్తికి ఎక్కువ ధ‌ర ల‌భిస్తోంది. దీంతో ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా రైతులు ప‌త్తిని అక్క‌డికి త‌ర‌లిస్తున్నారు. ఇక్క‌డ తేమ నిబంధ‌న‌తో పాటు ధ‌ర కాస్తా త‌క్కువ‌గా ఉండ‌టంతో పెద్ద ఎత్తున రైతులు మ‌హారాష్ట్రలోని ప‌లు ప్రాంతాల‌కు ప‌త్తి తీసుకువెళ్తున్నారు. కొంత‌మంది వ్యాపారులు ఇక్క‌డ‌కు వ‌చ్చి మ‌రీ ప‌త్తి కొనుగోలు చేస్తున్నారు. తేమ చూడ‌కుండా రూ. 7,900 చెల్లిస్తున్నారు. గ‌తంలో అక్క‌డి ప‌త్తి ఇక్క‌డ‌కు వ‌చ్చేద‌ని ఇప్పుడు ప‌రిస్థితి తారుమారైంద‌ని రైతులు చెబుతున్నారు.

ప‌ది వేలు దాటుతుంది..

ప‌రిస్థితి చూస్తుంటే ఖ‌చ్చితంగా రికార్డు స్థాయిలో ధ‌ర‌లు పెరుగుతాయ‌ని అధికారులు సైతం చెబుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా దేశీయ మార్కెట్‌లో నిల్వ‌లు త‌గ్గ‌డంతో పాటు దిగుబ‌డి కూడా త‌క్కువ‌గా ఉండ‌టంతో ఖ‌చ్చితంగా ధ‌ర పెరుగుతుంద‌ని వారంటున్నారు. ఇప్ప‌టికే ఎనిమిది వేల మార్కు దాటిన ప‌త్తి మ‌రికొద్ది రోజుల్లో ప‌దివేల‌కు చేరుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఒక‌వేళ అదే జ‌రిగితే ఖ‌చ్చితంగా ప‌త్తి రైతుల క‌ష్టాలు తీరిన‌ట్టే. ప్ర‌తిసారి మార్కెట్‌లో న‌ష్టాలు చ‌విచూస్తున్న రైతుల‌కు ఈ ఏడాది ఊర‌ట క‌లిగిస్తోంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like