తెలంగాణ‌కు బీజేపీ అగ్ర‌నేత‌ల క్యూ

BJP: ఎన్నిక‌ల వేడి రాజుకున్న నేప‌థ్యంలో తెలంగాణ‌కు బీజేపీ నేత‌లు క్యూ క‌డుతున్నారు. ఇప్ప‌టికే ఓమారు ఇక్క‌డ‌కు వ‌చ్చి వెళ్లిన ప్ర‌ధాన‌మంత్రి మోదీ ఈ రోజు మ‌ళ్లీ తెలంగాణ‌లో అడుగుపెట్ట‌నున్నారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా త‌దిత‌రులు తెలంగాణ‌కు రానున్నారు. వీరంతా వివిధ కార్య‌క్ర‌మాలు, స‌భ‌లు, స‌మావేశాల్లో పాల్గొంటారు.

రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న బీజేపీ ఆ మేర‌కు వ్యూహ‌ర‌చ‌న చేస్తోంది. తెలంగాణ‌లో ఎలాగైనా పాగా వేయాల‌ని భావిస్తున్న ఆ పార్టీ అధిష్టానం ముందుకు సాగుతోంది. తెలంగాణ బీజేపీ నేతల్లో జోష్ నింపేందుకు ఆ పార్టీ అధిష్టానం ఫోకస్ పెంచింది. తెలంగాణలో పట్టు బిగించేందుకు అన్ని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కమలదళం ప్రణాళికలు ర‌చిస్తోంది. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ మాత్రమే ఉందనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా ఆ పార్టీ కొద్దిరోజులుగా కార్యాచరణలు చేస్తూ వస్తోంది. గతంలో పోల్చుకుంటే ప్రస్తుతం బీజేపీ రాష్ట్రంలో కాస్త బలంగా కనిపిస్తోంది. అయితే కర్ణాటక ఎన్నికల తర్వాత సీన్ కాస్త మారింది. కాంగ్రెస్ కేడర్ అంతా మళ్లీ ఊపందుకుంది. దీంతో కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టి బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఉండాలంటే బీజేపీ తమ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అగ్రనేతల పర్యటనలు జరిగితే పార్టీ కేడర్‌‌ను యాక్టివ్ చేయొచ్చనే భావనలో ఉంది.

తెలంగాణలో అగ్రనేతలు వరుస పర్యటనలతో కేడర్‌లో జోష్ పెంచనున్నారు. ప్ర‌ధాన‌మంత్రి మోదీ తెలంగాణ ప‌ర్య‌ట‌నలో భాగంగా ఈ నెల 1న మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో ప‌ర్య‌టించిన ఆయ‌న ఈ రోజు మ‌ధ్యాహ్నం నిజామాబాద్ జిల్లాకు వ‌స్తారు. అక్క‌డ దాదాపు 9 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప‌నులకు శంకుస్థాప‌న‌లు చేస్తారు. ఇక రానున్న పది రోజుల్లో తెలంగాణలో బీజేపీ అగ్రనేతలు, పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు పర్యటించ‌నున్నారు. నవంబర్ మొదటి వారంలోపు రాష్ట్రంలో దాదాపు 30 భారీ సభలు నిర్వహించాలని కార్యాచరణ రూపొందించారు. ఈ నెల 6న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, 10న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ‌కు రానున్నారు. మ‌రోవైపు ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో మ‌ళ్లీ ఒక‌సారి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీతో బ‌హిరంగ స‌భ ఏర్పాట చేయాల‌ని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

అక్టోబర్ 5, 6 తేదీల్లో బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశాలు హైదరాబాద్ వేదికగా జరగ‌నున్నాయి. తొలి రోజు సమావేశంలో సునీల్ బన్సల్ నేతృత్వంలో జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జులు, రాష్ట్ర పదాధికారులు భేటీ కానున్నారు. ఇక 6న నడ్డా అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయ‌నున్నారు. ఇందులో అన్ని అసెంబ్లీ స్థానాల కన్వీనర్లు, ఇన్చార్జులు సహా దాదాపు 800 మంది పాల్గొన‌నున్నారు. ఈసారి ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితుల్లో విజ‌యం సాధించాల‌ని అందుకు అనుగుణంగా ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని అధిష్టానం నుంచి ఆదేశాల నేప‌థ్యంలో తెలంగాణ నేత‌లు క‌స‌ర‌త్తు ముమ్మ‌రం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like