మ‌రో వివాదంలో రాహుల్ గాంధీ

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు. ‘మోదీ ఇంటి పేరు’ పరువు నష్టం కేసులో ఊరట పొంది కొన్ని రోజులు కూడా గడవక ముందే ఆయ‌న‌ను మ‌రో వివాదం చుట్టుముట్టింది. లోక్ సభ నుంచి వెళ్లిపోతూ ఆయన మహిళా ఎంపీల వైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. ఈ మేర‌కు రాహుల్ గాంధీపై 21 మంది బీజేపీ మహిళా ఎంపీలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. లోక్ సభలో రాహుల్ అనుచితంగా ప్రవర్తించారని ఎంపీలు ఆరోపిస్తున్నారు.

‘మోదీ ఇంటి పేరు’ పరువు నష్టం కేసులో ఊరట పొంది కొన్ని రోజులు కూడా గడవక ముందే రాహుల్ గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా బుధవారం లోక్ సభలో పెను దుమారం రేగింది. రాహుల్ మాట్లాడుతూ, హింసాత్మక ఘర్షణలు జరుగుతున్న మణిపూర్ రాష్ట్రంలో తాను పర్యటించానని చెప్పారు. ప్రధాన మంత్రి మోదీ మాత్రం పర్యటించలేదని ఆరోపించారు. బీజేపీ ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించిందన్నారు. భారత దేశ ఆత్మను ప్రభుత్వం హత్య చేసిందని ఆరోపించారు. మణిపూర్‌లో భారతమాతను హత్య చేశారని ఆరోపించారు. బీజేపీ నేతలు ద్రోహులని వ్యాఖ్యానించారు. మోదీని పరోక్షంగా రావణాసురుడితో పోల్చారు. రావణాసురుడు మేఘనాథుడు, కుంభకర్ణుడు చెప్పిన మాటలనే వినేవాడని, మోదీ కూడా ఇద్దరి మాటలనే వింటారని, వారిద్దరూ అమిత్ షా, అదానీ అని దుయ్యబట్టారు. బీజేపీ నేతలు దేశభక్తులు కాదని, దేశ ద్రోహులు అని మండిపడ్డారు.

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ, రాహుల్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి, వారసత్వ రాజకీయాలు భారత దేశాన్ని విడిచిపెట్టిపోవాలని చెప్పారు. మీది ఇండియా కాదు, అవినీతి ప్రతిరూపం అని ప్రతిపక్ష కూటమి పేరు ఉద్దేశించి ఆరోపించారు. స్మృతి ఇరానీ మాట్లాడుతుండగానే రాహుల్ లోక్ సభ నుంచి వెళ్లిపోయారు. ఆయన సభ నుంచి వెళ్లిపోతూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని స్మృతి ఇరానీ ఆరోపించారు. ఈ ఆరోపణల్లో వాస్తవాలను తెలుసుకునేందుకు అధికారులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.

సభ నుంచి వెళ్లిపోయేటపుడు రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని స్మృతి ఇరానీ ఆరోపించడంతో కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ శోభ కరంద్లజే నేతృత్వంలో మహిళా మంత్రులు, ఎంపీలు రాహుల్ గాంధీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన తన ప్రసంగాన్ని ముగించిన తర్వాత ఫ్లయింగ్ కిస్ ఇచ్చి, వెళ్లిపోయారని ఆరోపిస్తూ లోక్ సభ సభాపతి ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like