రాహుల్ రిటైర్ అయ్యారు…

Journalist Rahul: ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రెస్‌మీట్ లో విన‌ప‌డే పేరు రాహుల్‌.. కేసీఆర్ విలేక‌రుల స‌మావేశం అంటే ఖ‌చ్చితంగా రాహుల్ ప్ర‌శ్న వేయాల్సిందే.. కేసీఆర్ కూడా హే.. నువ్ ఊరుకో రాహుల్.. అనాల్సిందే. కేసీఆర్ ప్రెస్‌మీట్ ఉంద‌టే రాహుల్ వ‌చ్చాడా..? లేదా..? అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తాయంటే ఆయ‌న క్రేజ్ అర్ధం చేసుకోవ‌చ్చు. రాహుల్ ‘ది హిందూ’లో సీనియర్ జర్నలిస్ట్. ఆయ‌న బుధ‌వారం రిటైర్ అయ్యారు.

రాహుల్ సొంతూరు హైదరాబాద్‌. ఇక్కడే నిజాం కాలేజీలో చదువు పూర్తి చేసుకున్న ఈయన జ‌ర్న‌లిస్టుగా కెరీర్ ప్రారంభించారు. ఎన్నో పత్రికల్లో పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన హిందూలో సీనియర్ జర్నలిస్టుగా విధులు నిర్వహించారు. తెలుగు జర్నలిస్టుల్లో విలువలతో కూడిన కమిట్మెంట్‌తో పని చేసే అతి కొద్దిమంది మీడియా ప్రతినిధుల్లో ఈయన కూడా ఒకరని విమ‌ర్శ‌కులు సైతం చెబుతుంటారు. నిజాయితీ, ముక్కుసూటి తత్వం అనేది ఆయన అడిషనల్ క్వాలిఫికేషన్స్ అని మిత్రులు చెబుతుంటారు.

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాహుల్‌ ఆప్త మిత్రుడే. అప్పట్లో ఇద్దరూ కలిసి చదువుకున్నారు. రాహుల్ మీలాంటి వారు సమాచార కమిషన్‌కు కావాల్సి ఉంటది.. రండి మీకు పెద్ద పోస్ట్ ఇస్తామని కిరణ్ రెడ్డి ఆఫర్ చేసినా ఆయ‌న అస్సలు ఒప్పుకోలేదు. నేను చేస్తున్న జాబ్ నాకు చాలంటూ ఆ ప‌ద‌వి తీసుకోకుండా ఉండిపోయారు. ఆయ‌నే కాకుండా చాలా మంది ముఖ్య‌మంత్రుల‌తో చ‌నువు ఉండేది. వారు కూడా ప‌ద‌వులు ఆఫ‌ర్ చేసినా వ‌ద్దంటూ వారించార‌ట‌.

తెలంగాణ ఉద్యమం మొదటి నుంచి కేసీఆర్‌కు రాహుల్ చాలా బాగా తెలుసు. ఉద్యమం నుంచి కేసీఆర్‌కు సంబంధించిన వార్తలన్నీ దాదాపుగా ఈయనే కవర్ చేసి రాస్తుండేవారు. కేసీఆర్ రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఈ ఇద్దరి మధ్య మరింత సత్సంబంధాలు పెరిగాయట. ఒకానొక సందర్భంగా (కేసీఆర్ సీఎం అయ్యాక) ప్రగతి భవన్‌కు వెళ్తుండగా ఆఫీస్ బయటున్న రాహుల్‌ను ‘దా రాహుల్ కారులో కూర్చో వెళ్దాం’ అని పిలిచినా సారీ సార్.. ముందు వర్క్ ఫినిష్ చేయాలి ఆ తర్వాతే మిగతావన్నీ అని చెప్పారు. అంటే ఆయన కమిట్మెంట్ అంటే దీన్ని బట్టి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. హైదరాబాదీ అయిన రాహుల్‌కు కేసీఆర్ పిలిచి మరీ మంచి పోస్టింగ్ ఇవ్వాలని భావించినా ‘సారీ సార్.. నాకొద్దు’ అన్నారని కూడా చెబుతుంటారు. ఇదీ కేసీఆర్‌తో రాహుల్‌కు ఉన్న అనుబంధం.

కేసీఆర్ ప్రెస్‌మీట్ అంటే జ‌ర్న‌లిస్టుగా రాహుల్ ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉంటారు.. ఆయన ప్రశ్న సరైనదైతే హే రాహుల్ ఇది మంచి ప్రశ్న జర ఆగు సమాధానం చెబుతా అంటుంటారు కేసీఆర్.. ఒకవేళ సీఎం చిరాకేసే ప్రశ్నలేస్తే మాత్రం ఇంతెత్తున రాహుల్‌పై ఎగిరి ఇదేం దిక్కుమాలిన ప్రశ్న అని తిట్టేస్తుంటారు..?. కొన్ని కొన్ని సార్లు రాహుల్.. ఇది కచ్చితంగా హైలైట్ చేయాలి సరేనా అని కేసీఆర్ చెబుతుంటారు..? ఇంతకీ ఆ రాహుల్ ఎవరు..? ఏ పత్రికకు లేదా ఏ టీవీ చానెల్‌కు చెందిన మీడియా ప్రతినిధి అతను..? అనేది కేసీఆర్ ప్రెస్ మీట్ చూసిన జనాల్లో.. తెలుగు రాష్ట్రాల్లోని కొందరు ఔత్సాహికులు, నెటిజన్లల్లో మెదులుతున్న ప్రశ్న.

ఇక ఇప్ప‌టి నుంచి కేసీఆర్ ప్రెస్‌మీట్ అంటే రాహుల్ ప్ర‌శ్న‌లు వేయ‌డు… కేసీఆర్ కూడా రాహుల్ ఆగ‌వ‌యా… అనే మాట కూడా విన‌ప‌డ‌దు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like